విజయుడు (ధారావాహిక నవల పార్ట్-38)
నిమ్స్ వద్ద కోలాహలం
విజయ్‌కు ఆస్పత్రిలో ఎలా ఉందో తెలుసుకోవాలని జనం తండోపతండాలుగా నిమ్స్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. రాష్ట్ర వాప్యంగా ఆయన అభిమానులు పంజాగుట్టకు చేరకుంటున్నారు. వచ్చిన జనసందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కావడం లేదు.ఆయా పట్టణాల్లో ఇప్పటికే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు డిజిపి కార్యాలయానికి పెద్దయెత్తున మెసేజీలు వస్తున్నాయి. ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెడుతున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేస్తున్నారని, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపివేస్తూ, రాస్తారోకోలు ఇతరత్రా ఆందోళన చేస్తున్నారని దీంతో రవాణా స్తంభించిపోతున్నదని ఫోన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందుతున్నది. విజయ్ ఆరోగ్యం క్షీణిస్తే పరిస్థితి మరింత విషమిస్తుందని డిజిపి స్వయంగా ఎప్పటికప్పుడు ఆస్పత్రికి ఫోన్ చేసి తెలుసుకుంటున్నాడు. అప్పటికే జనం పెద్దయెత్తున ఆస్పత్రికి చేరుకోవడంతో పెరగుతున్న జనసందోహాన్ని నివారించేందుకు డిజిపి, ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలిస్తున్నారు. ఆస్పత్రికి సమీపంలోకి ఎవరినీ రానీయకుండా ఎలాంటి చర్యలుతీసుకోవాలో ఆ ఏరియా డిసిపిలతో మాట్లాడారు. ఎక్కడెక్కడ బారీకేడ్స్ ఏర్పాటు చేయాలో అందరినీ అలెర్టు చేయాలని, నిమ్స్‌కు దారి తీసే రోడ్లన్నీ ఇప్పటికే బ్లాక్ కావడంతో ఇతర రూట్లకు వాటిని మళ్లించాలని ప్రణాళికా రచన చేస్తున్నారు.

ఆస్పత్రి పరిసరాలకు చేరుకున్న జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. విజయ్‌కు మద్దతుగా లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొందరు ప్రార్థనా స్థలాల్లో పూజలు చేస్తున్నారు. మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు విజయ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రినుంచి తిరిగి రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
ముఖ్యమంత్రి బంగ్లాలోనూ పరిస్థితి ఏమాత్రం వేరుగా లేదు. సిఎం తన రోజువారీ కార్యక్రమాలను వాయిదా వేసుకొని బంగ్లాకే పరిమితమై, తన సతీమణిని కనిపెట్టుకుని ఉన్నాడు. కంటికి మింటికి ఏకదారగా ఆమె ఏడుస్తుండటంతో ముఖ్యమంత్రికి అసహనంగా ఉంది. స్వంత కొడుకుపై దాడి జరిగినట్లుగా ఆమె ఫీల్ అవుతున్నది. సంఘటన కంటే ఆయనకు తన భార్య పరిస్థితిపైనే అధిక ఆందోళన కలుగుతోంది. డాక్టర్లను కూడా పిలిపించారు. నీరసంగా ఉండటంతో బిపి,షుగర్ పరీక్షలు చేశారు. రిపోర్టులు రావడానికి కొంత సమయం పడుతుందని, ఈలోగా మంచి ఆహారం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. వర్కర్లు అంతా ఆమె వద్దనే ఉండి అన్ని సపర్యలు చేస్తున్నారు.
ఎలా ఉన్నాడండీ మన విజయ్? అని అడిగిన భార్యకు ఎలాంటి విసుగు కనిపించనీయకుండా సిఎం సమాధానం చెబుతున్నాడు. ఇలా ఆమె అడగడం వందోసారో,ఇంకా ఎక్కువో…సతీమణికి జవాబు ఇవ్వడం కోసం ఆయన ఎక్కువ సార్లే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నాడు. సిఎం ఏ ఉద్ధేశ్యంలో వారితో మాట్లాడుతున్నప్పటికీ డాక్టర్లపై ఒత్తిడిపెరుగుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా అన్నిసార్లు కాల్ చేస్తుండటంతో డాక్టర్ల బృందం మరింత ఆప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు.
శరీరం నుంచి అన్ని తూటాలను వెలికి తీసామని, పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే రక్తం ఎక్కువగా పోవడంతో వెంటనే ఏమీ చెప్పలేమని డాక్టర్లు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను యధావిధిగా భార్యకు చెప్పడం లేదు. అంతా బాగుందని డాక్టర్లు శ్రద్ధగా చూస్తున్నారని మాత్రమే ఆయన చెబుతున్నారు.
మనం ఆస్పత్రికి వెళ్లి, అక్కడే ఉందాం. బాబును చూద్దామండీ అంటూ ఏడుపును పెద్దదిచేసింది. ఆస్పత్రికి మనం వెలితే డాక్టర్లకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన మాటనే పదేపదే చెబుతున్నా, ఆమె మాత్రం సమాధానపడటంలేదు. అప్పటికే మూడు రోజులైంది. ఆమె సరిగ్గా తిన్నదిలేదు, నిద్రపోయింది లేదు.
విజయ్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దాడి జరిగిన నాటి నుంచి కూడా విజయ్ చావుబతుకుతో మధ్య పోరాడుతున్నాడు. అత్యాధునిక పరికరాలతో అన్ని విధాలుగా ఆయన ప్రాణం కాపాడటానికి డాక్టర్లు శ్రమపడుతున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స సాగుతున్నది. ఇరవై నాలుగు గంటలు కూడా డాక్టర్ల బృందం విజయ్‌ను కనిపెట్టుకొని ఉంటున్నది.
పోలీసు కంట్రోల్ రూంకు కూతవేటు దూరంలోనే విజయ్‌పై జరిగిన అమానుష దాడి,హత్యా ప్రయత్నం కేసు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అధికార పార్టీ శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని దుస్థితికి కారణం ఏమిటనేది డిజిపికి కూడా అర్ధంకాలేదు. ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి నింధితుల ఆచూకీకి చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ, పోలీసు కంట్రోల్ సమీపంలో జరిగిన ఈ దాడికి పాల్పడిన అగంతకులను కనిపెట్టేందుకు సిసి ఫుటేజీని ముందుగా పరిశీలించారు. సరిగ్గా ఆ సమయం నుంచి పది నిమిషాల వరకు సిసి కెమారాల్లో ఈ దృశ్యాలు రికార్డు కాకపోవడం గమనార్హం. సంబంధిత శాఖాధికారులతో డిజిపి చర్చలు జరిపారు. ఎందుకు ఇలా జరిగిందనే విషయంలో కనీస స్పష్టత రాలేదు. సాంకేతిక లోపం వల్ల జరిగి ఉంటుందనే వాదనను డిజిపి అంగీకరించలేదు. ఇప్పటివరకు ఏ రోజు కనిపించని టెక్నికల్ ఫాల్టు , దాడి సమయంలో ఎందుకు జరిగిందో దర్యాప్తు చేయాలని కూడా ఆయన ఆదేశించాడు. ఉన్నత స్థాయిలో ఎవరిదో ప్రమేయం ఉన్నందునే ఇలాంటి సమస్య వచ్చి ఉంటుందని, ఇందులో తప్పనిసరిగా కుట్ర కోణం దాగి ఉందని డిజిపి అభిప్రాయపడుతున్నారు.
కుటుంబరావు ఇంట్లో విరంచి కూడా నిద్రాహారాలకు దూరం అయింది. ఆస్పత్రికి వెళ్లి చూడటానికి ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. నిమ్స్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కొత్తగా బయటి నుంచి వచ్చే వారిని కూడా పోలీసులు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే లోనికి పంపుతున్నారు.
కానీ ఎమర్జెన్సీ కేసులు విషయంలో పోలీసులు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డాక్టర్లు నిరంతర శమ్ర ఫలించిందా? దైవ కృప వల్లనా, తెలియదు కానీ అయిదో రోజున విజయ్ ఆస్పత్రిలో కళ్లు తెరిచారు. తమ కృషి విజయవంతం అయిందనే సంతృప్తి డాక్టర్ల బృందంలో కనిపించింది. ఈ సమాచారాన్ని ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలిపారు. విజయ్ కోలుకునే అవకాశం ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పంధిస్తున్నదని నిమ్స్ డైరెక్టర్ వెంటనే ముఖ్యమంత్రికి వివరించారు. కొద్ది రోజుల్లో మెరుగుపడే ఛాన్స్ ఉందని, ప్రాణాపాయం లేదని చెప్పారు.
అతి కీలక ఈ సమాచారం తెలిసిన సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో ఆనందం కంటే ఆశ్చర్యమే అధికంగా కనిపించింది. అన్ని రౌండ్ల కాల్పులు జరిగి రెండు రివాల్వర్లలో ఉన్న తూటాలన్నీ చాతిలో జొరబడ్డా ఇన్నాళ్లపాటు బతికి ఉండటమే గగనం అయితే, కోలుకునే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పడంతో సిఎం మెదడు మొద్దుబారింది.
ముఖ్యమంత్రి వెంటనే తన కార్యదర్శికి కాల్ చేసి, నిమ్స్‌లో విజయ్ ను చూడటానికి వెళ్లాలని, డాక్టర్లతో సంప్రదించి,సమయం ఖరారు చేయాలని సూచించారు.
ఆస్పత్రిలో విజయ్ కోలుకుంటున్నాడని, ఇప్పుడే డాక్టర్లు చెప్పారని తన సతీమణికి చెప్పారు సిఎం. ఆమె విప్పారిన ముఖంలో దిగ్గున లేచి సంతోషంగా భర్త దగ్గరకు వచ్చి అతుక్కుంది. ఎంత మంచి వార్త చెప్పారంటూ భర్త ముఖంపై ముద్దు పెట్టింది.ఆమె కన్నుల నుంచి ఆనందబాష్పాలు వచ్చాయి. భార్య ఈ ప్రవర్తన సిఎంను ఆలోచనలో పడవేసింది. ఇటీవలి కాలంలో తన భార్య ఈ విధంగా తనకు ముద్దుపెట్టుకున్న సందర్భం కూడా లేదు.
సంతానం లేదనే బెంగతో అన్నపూర్ణమ్మ దశాబ్దకాలంగా నిస్తేజంగా కాలం గడుపుతున్నది. తమ కుటుంబంతో విజయ్ కు పరిచయం ఏర్పడిన తర్వాత ఎందుకో ఆమె మాతృ హృదయంలో కొత్త ఆశ చిగురించింది. విజయ్‌ను మొదటి సారి చూసినప్పటి నుంచి ఎందుకే ఆయన పట్ల పుత్ర ప్రేమ కలిగింది. అందుకే భర్తతో చెప్పి విజయ్‌ను భోజనానికి బంగ్లాకు ఆహ్వానించింది. విజయ్‌ను చూస్తే తనకు పిల్లలు లేరని అనిపించేది కాదు ఆమెకు. అందుకే వీలునామాపై అంతగా పట్టుపట్టింది. కానీ సిఎం ఇప్పటివరకు ఈ పని పూర్తి చేయలేదని ఆమెకు తెలియదు.
విజయ్ అంటే వీరాభిమానం కలిగిన యువ ఎంఎల్‌ఎలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ దాడి సాధారణమైంది కాదని,ప్రభుత్వంలోని కీలక నేతల హస్తం ఉందని వారు విశ్వసిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిలదీద్దామని, కుట్రకోణం బయటకు తీయాలని డిమాండ్ చేయాలని పట్టుబడుతున్న శాసనసభ్యులను రంజిత్, వివేక్ తదితరులు సముదాయించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయ్ ఆరోగ్యం మనకు ప్రధానం…పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత విజయ్‌తో కూడా చర్చించి,ప్రభుత్వంపై దాడిని కొనసాగిద్దామని వారు నిర్ణయించుకున్నారు.
పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు డిజిపి. అతి కీలకమైన అసెంబ్లీ సమీపంలో సిసి కెమరాలు ఎలా పనిచేయలేదనేది వారి అతి ప్రధానమైన ఎజెండా…పైగా పోలీసు కంట్రోల్ రూం అక్కడే ఉండటం, వివిఐపిలు ఎక్కువగా ఈ రూట్‌లో తిరుగుతుండే మార్గంలో ఈ లోపం ఎలా జరిగింది? ఎందుకు జరిగిందో ముందుగా దర్యాప్తు చేసి, వాస్తవాలు వెలుగులోకి తెస్తే, విజయ్ గారి హంతకులెవరో దానంతట అదే తెలుస్తుందనేది డిజిపి వాదన. సాంకేతిక విభాగం అధికారులు కూడా అక్కడే ఉన్న ఎవరూ నిర్ధిష్టమైన కారణాలను చెప్పలేకపోతున్నారు. అదే రూట్‌లో విజయ్ వస్తాడని, అతన్ని తుదముట్టిచాలనే ప్రణాళికతోనే ఈ కుట్ర జరిగిందని డిజిపి చేస్తున్న వాదనను ఎవరూ ఖండిరచలేకపోతున్నారు. హత్య ప్లాన్ ప్రకారమే జరిగింది.మనం పసిగట్టలేకపోతున్నాం. మన పోలీసు శాఖవారు కూడా సహాయం చేయకుండా సిసి కెమరాలను అదే సమయానికి ఆపివేయడం సాధ్యం కాదు. ఇంటి దొంగల పనే ఇది అంటూ అందరి ముఖాలను చూసాడు డిజిపి. సమావేశం గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికీ అర్థం కావడం లేదు.
కేసు పరిశోధనలో డిజిపి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గన్‌మెన్ ఉన్నా ఫలితం లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడి, ఆ తర్వాత విజయ్ ఇదే రూట్‌లో ఏ సమయానికి వస్తాడో కచ్చితమైన సమాచారంతో అగంతకులు నిర్థిష్ట ప్రణాళికతో కాల్పులు జరిపినారు కాబట్టి, దీనికి మన శాఖ నుంచి ఎవరు సహకరించారో… దర్యాప్తు చేసేందుకు మరో స్పెషల్ టీంను ఏర్పాటు చేసాడు డిజిపి. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని, పోలీసు శాఖ వారిని కలిపి ప్రత్యేక బృందం ప్రకటించి,వెంటనే బాధ్యతలను చేపట్టాలని వారి పేర్లను ప్రకటిస్తూ కాలపరిమితిని విధించాడు.
వైద్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విజయ్ ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాణ హాని లేదని తెలియడంతో సిఎం సమస్య నుంచి తాత్కాలికంగా గట్టెక్కినట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో ఇక ప్రజలు ఆందోళన బాటపట్టకుండా ఉంటుందని భావించాడు. అయితే నిమ్స్ వద్దకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రాకపోకలు తగ్గడం లేదు. పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ఆస్పత్రి వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు పోలీసులు.
(సశేషం)
