విజయుడు (ధారావాహిక నవల పార్ట్-4)
మామాలు షర్టు వేసుకొని ఉంటే అది ఎక్కడ కుట్టించాడో టెయిలర్ సింబల్ ఉంటే దాని ద్వారా కొంత సమాచారం తెలిసేది. దీంతో లభించే సమాచారం ఆధారంగా మృతుని స్వరాష్ట్రం తెలిసేది. సెల్‌పోన్ కూడా మృత దేహం వద్ద కానీ, సమీపంలో కాని, ఆయన బట్టలలో కానీ లభించకపోవడంతో శవం తాలూకూ ఏ ఆధారం లభించనట్లే అయింది. బహుశ ఆయన సెల్‌ఫోన్ కూడా కారులో ఉండి పూర్తిగా దగ్ధం అయి ఉంటుందని ఎస్‌ఐ అంచనాకు వచ్చి కొద్ది సేపు మౌనంగా ఉండిపోయాడు. చేసేది ఏమి లేక తన పై ఆఫీసర్ ఇన్స్ పెక్టర్ మహేశ్ తివారికి ఫోన్ చేశాడు.
సార్ ఢిల్లీ శివారు ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది, ఒక కారు ఆగ్రా నుంచి హస్తినకు వస్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొని వేగంగా వెళ్లిపోయింది. ఇక్కడ సిసి కెమరాల కవరేజి కూడా లేదు. కారు పూర్తిగా దగ్దం కావడంతోపాటు అందులో డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి నామరూపాలు కూడా కనిపిండం లేదు. కారు కూడా ఎలాంటి ఆనవాలు లేకుండా ఉంది.
అంతఘోరంగా జరిగిందా ప్రమాదం..?
అవును సాబ్..! ఎంతగా అంటే కారు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసుకునే నెంబర్ కూడా కనిపించడం లేదు.
కారులో ఎందరు ప్రయాణిస్తున్నారో తెలిసిందా..?
అయితే సాబ్ ఇదే ప్రమాదంలో మరో వ్యక్తి కూడా మరణించాడు. ఆయన ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. ఎవరో ఆ వ్యక్తిని కారు నుంచి తీసి పైన నుంచి కింద పడవేసినట్లుగా ప్రమాదం జరిగింది. కారు డోర్ ఊడిపోయి ఆ వ్యక్తి అతి వేగంగా కిందపడటంతో మృత్యువాతపడ్డాడు. ఎక్కడ నుంచి వచ్చాడో, ఎవరో ఏ మాత్రం తెలియడం లేదు. అంతా మిష్టరీగా ఉంది. డ్రైవర్ పూర్తిగా తగలబడి పోవడం, ఈ వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారం లభించకపోవడంతో ఏమి చేయాలో నాకు తెలియడం లేదు సాబ్!
అవునా నేను వెంటనే బయలు దేరుతున్నాను. నీవు పంచనామా చేస్తూ ఉండు.. అలాగే సాబ్! అంటూ ఎస్‌ఐ కాల్‌కట్ చేశాడు.
ఫోన్ పెట్టేశాడే కాని ఎలా ముందుకు పోవాలో ఎస్‌ఐకి అంతు చిక్కడం లేదు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఏకొద్దిగా దొరికినా బాగుండు.. ఇది సాధారణ ప్రమాదం కాదు. లారీ వాడు కావాలలే రాంగ్ రూట్‌లో వచ్చి హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే కారును ఢీకొట్టాడు అంటే ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య చేసి ఉంటాడు. లారీ ఎవరిది, డ్రైవర్ ఎవరు, హత్య చేయాలని ఎవరు పురికొల్పి ఉంటారు. ఢిల్లీ వాసులా లేక ఇతర రాష్ట్రాల వారా..? స్వంత రాష్ట్రంలో మర్డర్ చేయిస్తే పట్టుబడతామని ఈ వ్యక్తి ఢిల్లీ రావడాన్ని తెలుసుకొని హత్య చేయించి ఉంటారా..? అయితే ఏ రాష్ట్రం వాడు కావచ్చు. మృతుడు రాజకీయ నాయకుడా?.. వ్యాపారస్తుడా? లేక మత్తు మందులు సరఫరా చేసేవాడా? వ్యాపారంలో విభేదాలు వచ్చి హత్య చేయించారా? తదితర ప్రశ్నలతో ఎస్‌ఐ బుర్ర వేడెక్కింది. సమాధానాలు లభించని ఆందోళనలో ఆయన అలాగే కిందనే కూర్చుండి పోయాడు. ఇంతలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మహేశ్ తివారి ఆక్కడికి చేరుకున్నారు. నిరుత్తరుడై చూస్తున్న ఎస్‌ఐని సమీపంచడంతో వెంటనే లేచి సెల్యూట్ చేసి తనకు వచ్చిన అన్ని సందేహాలను సిఐకి వివరించారు. క్రైం సీన్ ఆసాంతం పరిశీలించిన సిఐకి కూడా ఏమి తోచలేదు.
దర్యాప్తులో అన్ని విషయాలు ఆలస్యంగా అయినా వెల్లడి అవుతాయి. కానీ మృతుని వివరాలు మనకు ఎంతో ముఖ్యం. అందుకే ఈ మృత దేహాన్ని అనాథ శవంగా భావించవద్దు. మనం అనాథ శవాలకు అంత్యక్రియలు చేయించడం సర్వసాధారణమే అయినప్పటికీ ఈ శవం విషయంలో మిష్టరీ ఛేదించాలి మనం. అందుకే పోస్టు మార్టం తర్వాత కొన్నిరోజుల వరకు మార్చురీలోనే శవాన్ని భద్రపర్చాలని డాక్టర్లను కోరుదాం. అది మూడు నాలుగు వారాలైనా పర్వాలేదు అంటూ సిఐ తన సబ్బందికి ఆదేశాలిచ్చి ఇది తనకు పెద్ద సవాల్‌గా భావించి కేసును టేకప్ చేశారు. పంచనామా చేసి, శవాన్ని ఆస్పత్రికి చేరేవేసే ప్రయత్నంలో ఎస్‌ఐ నిమగ్నమయ్యారు. ఏ ఒక్క క్లూ కూడా లభించని ఈ కేసును సిఐ ఎలా ఛేదిస్తారో? నిందిదులను పట్టుకోగలమో లేదో… పాపం ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడ శవమయ్యాడు అనుకుంటూ ఎస్‌ఐ తన విధులు నిర్వర్తించారు.
కారును లారీ ఢీ కొనడంతో కారు డోర్ తెరుచుకొని కొంత దూరంగా పడిపోయి మరణించిన విజయ్ చివరి శ్వాస తీసుకున్నాడు. ఆ వెంటనే విజయ్‌కు ఏవో మాటు వినబడుతున్నాయి. ఇదేమిటి నేను ఇంకా బతికే ఉన్నానా? బ్రమ పడుతున్నానా? ఈ మాటలు ఎవరివి? ఎలా వినిపిస్తున్నాయి? తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది? అసలు ఏమి జరుగుతున్నదో అంతుబట్టని స్థితిలో విజయ్ ముందు దైవ దూతలిద్దరు ప్రత్యక్షమయ్యారు. ఇదేమిటి, కలా నిజమా అన్నట్లుగా మరోసారి విజయ్ వారిద్దరిని తేరపార చూస్తున్నారు. దైవ దూతలు తాము వచ్చిన పనిని నిర్వర్తించే క్రమంలో ఉండగా మరో ఇద్దరు భటులు అక్కడకు చేరుకున్నారు. చూడగా వారు యమ భటులుగా గోచరించారు. అచ్చంగా సినిమాలో చూసినట్లుగా యమ భటుల వేశధారణ ఉండటం విజయ్‌కు ఆశ్చర్యం వేసింది. తానుచనిపోయింది నిజమని విజయ్‌కు అప్పుడు దృవీకరణ అయింది. అయితే ఇదంతా తాను ఎలా చూడగలుగుతున్నాడు? చనిపోయిన వారందరికీ ఇది సాధ్యమవుతుందా? నాకు మాత్రమే ఈ అవకాశం లభించిందా? లభిస్తే కారణం ఏమై ఉంటుంది? ముందుగా వచ్చిన దైవ దూతలు ఏమి చేయబోతున్నారు. ఒకే శవం వద్దకు వేరువేరుగా వారు ఎందుకు వచ్చారు? అన్ని ప్రశ్నలే… ఈ అంశం కంటే విజయ్‌కు తన మరణం విషయమే అధికంగా కృంగ తీసింది. తానుకారులో ప్రయాణిస్తూ ఉండటా అతి వేగంగా లారీ ఢీకొనడం సరే… హత్య చేయాలనే లారీ తమపైకి దూసుకు వచ్చింది.. నన్ను చంపాలని ఎవరికి ఉంటుంది… ఎందుకు నన్ను హత్య చేసి ఉంటారు? హంతకులు ఎవరు? లారీ ఢీ అనేది సాధారణమే కానీ అందుకు ప్రేరేపించిన వారే కీలకం వారిని ఎలా కనిపెట్టాలి. ఇదే నాకు తీరని సమస్య. పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఎప్పుడో వివరాలు బయటపెడతారు. అదీ కూడా సక్రమంగా చేస్తే, ఆధారాలు లభిస్తే.. లేకుంటా కేసు ఎప్పటికీ పెండింగ్‌లో పడిపోతుంది.
కానీ అదంతా ఎప్పటికి తేలుతుందో అంటూ విజయ్ తనలో తానే మధనపడుతున్నాడు. ఈ సమయంలోనే యమ భటులకు దేవ దూతల మధ్య జరుగుతున్న సంభాషణ వైపు ఆయన దృష్టి మళ్లింది. ఈ జీవిని వైకుంఠం తీసుకురావాలనేది ఆజ్ఞ. మరి మీరు ఎందుకు వచ్చారంటూ యమ భటులను ప్రశ్నించారు దైవ దూతలు. భూలోకంలో ఏ ప్రాణికి అంతిమ ఘడియలు ప్రాప్తించిన తాము ఆ జీవి ప్రాణాలను యమ లోకానికి తీసుకు వెళ్లడం మా విధి. అందుకే మేం రావాల్సివచ్చిందని ప్రత్యుత్తరం ఇచ్చారు.
అయితే మీరు వచ్చారు కాబట్టి ఇక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ జీవిని మాతో పాటు తోడ్కొని పోనట్లయితే చిత్రగుప్తుల వారు మాపై ఆగ్రహం వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. అందుకని మేం ఒకసారి ఈ జీవిని యమసభలోకి తీసుకు వెళ్లి మీ ప్రస్తావన తెచ్చి, వెంటనే జీవిని మీ సమక్షానికి తోడ్కొని వస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేస్తాం అనుజ్ఞనివ్వడంటూ యమ దూతలు వేడుకున్నారు.
ఏమిటీ శ్రీమన్నారాయణుని ఆదేశాలకే తిరస్కారమా? యమలోకంలో భటులకు క్రమశిక్షణ నేర్పలేదా ఆ చిత్రగుప్తుడు. వెంటనే యమ ధర్మరాజుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందంటూ దైవ దూతలు అగ్రహం వ్యక్తం చేశారు.
మన్నించండి, మన్నించండి అంటూ అభ్యర్థించిన యమ భటులు తమ ఈ ప్రస్తావనకు కారణం వివరించే ప్రయత్నం చేశారు. బ్రహ్మ దేవుడు చేసిన ప్రతి సృష్టికి కూడా యమలోకంలో రికార్డులుంటాయి. ఒక జీవి పుట్టుకకు సంబంధించి సత్యలోకంలో రికార్డులుంటుండగా తిరిగి ఆ జీవి తన మరణం తర్వాత ఆ లెక్క యమలోకంలో రికార్డు కావాల్సిందే. ఇది పెద్దలు చేసిన నిర్ణయమే. అందుకే యమలోకపు అధిపతి యమధర్మరాజు ముఖ్యంగా భూలోకంలో ప్రాణాలు విడిచిన వారందరి గణాంకాలను నమోదు చేస్తున్నారు. ఇందులో తేడా వస్తే యమధర్మరాజు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు భాద్యత వహించాల్సి ఉంటుంది. ఇది వారు ఏర్పాటు చేసిన నియమమే. బ్రహ్మదేవుని సృష్టి గణాంకాలకు, యమలోకం రికార్డులు సరిపోల్చే సంద్రాయం కొనసాగుతున్నది. కాబట్టి ముందుగా ఈ జీవిని చిత్ర గుప్తుల వారి వద్ద ప్రవేశ పెట్టాలని మేం ఇక్కడికి వచ్చామే తప్ప… శ్రీమన్నారాయణను ఆదేశాలను పాటించకపోవడం అనేది ఉండదని వివరించారు… యమభటులు
ఈ జీవి మరణం సంభవించే సమయలో మూడు సార్లు నారాయణ, నారాయణ నారాయణ అటూ శ్రీ మహావిష్ణువును ధ్యానించారు. పైగా ఈ జీవి జీవితం అనే అకౌంట్‌లో పాపకార్యాలు కనిపించలేదు కదా అందుకే ఈ జీవిని మే తీసుకుపోక తప్పదు. ఇది నారాయణాజ్ఞగా మీ చిత్రగుప్తునికి తెలియజేయండి అంటూ వారు ముందుకు కదిలారు. దేవ దూతలు, యమభటులు సంభాషణ అంతా విజయ్‌కు అవగతమవుతూనే ఉంది. యమపురికి కాకుండా తనను నేరుగా వైకుంఠానికే తీసుకువెళ్తున్న తీరుతో ఆయనకు ఎంతో ఆనందం వేసింది. పైగా పాపాలు చేసిన వారే యమలోకానికి వెళ్తారని భూలోకంలో అందరూ చెపుకునే మాట. వారి సంభాషణల ద్వారా నేడు పాపం చేయని వ్యక్తిగా పేరున్నట్లే. అమ్మయ్య ఇది ఎంత పుణ్య ఫలం. పైగా నేరుగా వైకుంఠం వెళ్లి సాక్షాత్తు శ్రీమన్నారయణున్ని దర్శించుకునే మహాభాగ్యం కలుగుతున్నదన్నమాట. ఎన్నో పూజలు చేసి, వ్రతాలు చేసిన వారికి కూడా వైకుంఠ ప్రవేశం లభించదని, ఏ కొద్దిమందికి అరుదుగా ఈ అవకాశం లభిస్తుందని తాను విన్న, సినిమాలు చూసిన కథలు విజయ్‌కు జ్ఞప్తికి వచ్చాయి. ఇంత ఆనందంలోనూ విజయ్‌లో తన హత్య సంఘటనకు బాధ్యులెవరు, కారణం ఏమిటనే అంతర్మదనం కొనసాగుతూనే ఉంది.
జీవిని వైకుంఠానికి తీసుకు వెళ్తున్న దైవ దూతలను మాటల్లో పెట్టి ఏదైనా సమాచారం రాబట్టాలని ఆ సమయంలోనూ విజయ్‌కు అనిపించింది.
(సశేషం)
తప్పకచదవండి episode -3: విజయుడు (ధారావాహిక నవల పార్ట్-3)