విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-40)

అయితే విరంచికి వెంటనే ఒక ఆలోచన స్పురించింది. వెంటనే టెలిఫోన్‌ డైరెక్టరీలో ముఖ్యమంత్రి బంగ్లా ఫోన్‌ నెంబర్‌ వెతికింది. అయితే తన కాల్‌ను వాళ్లు తీసుకుంటారో లేదో అనే సందేహం కలిగింది విరంచికి. అయినా ప్రయత్నించి చూద్దామని నెంబర్‌ డయల్‌ చేసి ఎదురు చూసింది. కొంత సమయం వరకు రింగ్‌ అవతల వైపు నుంచి హలో అంటూ గొంతు వినిపించింది.

ఆస్పత్రిలో ఉన్న విజయ్‌కు స్నేహితురాలిని నేను. ఒకసారి ముఖ్యమంత్రి సతీమణితో మాట్లాడాలి. దయచేసి ఆమెకు ఫోన్‌ ఇస్తారా అంటూ ఎంతో ఆర్తిగా అడిగింది విరంచి.

టెలిఫోన్‌ ఆపరేటర్‌ కాల్‌ మేడంకు కనెక్టు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. విరంచి లైన్‌లో ఎదురు చూస్తున్నది.విజయ్‌ పేరు చెప్పడంతో ఒకసారి మేడంను అడిగి చూద్దాం, ఏమంటుందో అనుకుంటూ ఆమెకు విషయం చెప్పాడు. విజయ్‌ ఫ్రండ్‌ అనగానే అన్నపూర్ణమ్మ వెంటనే ఇవ్వు అని సమాధానం చెప్పడంతో కాల్‌ కనెక్టు చేసాడు.

అమ్మా అంటూ సంబోధించిన విరంచి, అది అన్నపూర్ణమ్మ గొంతుగానే భావించింది. వెంటనే ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. ఆమెకు ఏడుపు ఆగడం లేదు. విజయ్‌, విజయ్‌ అంటూ గద్గత స్వరంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మాటలు బయటికి రావడం లేదు. అన్నపూర్ణమ్మకు కూడా దుఖ్ఖం ముంచుకు వస్తున్నది. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటలే కరువయ్యాయి. కొద్దిసేపటికి ఇరువురు తేరుకున్నారు.

అమ్మా నా పేరు విరంచి, విజయ్‌కు స్నేహితురాలిని కాదు. విజయ్‌ అంటే నాకు ప్రాణం. అంటూ బావురుమంది. ఏడుపు వల్ల ఆమె మాటలు ఆగిపోయాయి.

విజయ్‌ పేరు విన్న ప్రతిసారి ఇటువైపు ఉన్న అన్నపూర్ణమ్మకు దుఖ్ఖం పొంగుకుంటూ వచ్చింది. ఇద్దరూ మూగ వేధనను అనుభవిస్తున్నారు. వారిద్దరిని కలిపింది విజయ్‌ అనే సూత్రం. ఒకరికొకరు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడుకొని ఎరుగరు. ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఏనాడు చూసుకోలదు,కలుసుకోలేదు, కానీ ఆస్పత్రిలో ఉన్న విజయ్‌ కోసమే వారిద్దరి ఆరాటం. విరంచి వైపు నుంచి ఎక్కిళ్లు వినిపిస్తున్నాయి. రోధిస్తూనే ఉంది.

ఆమె పరిస్థితిని ఆర్థం చేసుకున్న అన్నపూర్ణమ్మ తనకుతాను సమాధానపడుతూనే ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నది.

ఏ చేద్దాం భగవంతుడు వానికి ఈ సమస్యలు తెచ్చాడు. నేను ఉదయమే వాన్ని చూసి వచ్చాను. డాక్డర్లు ప్రాణహాని లేదు త్వరగానే కోలుకుంటాడని భరోసా ఇస్తున్నారు. అధైర్యపడకమ్మా… అంటూ విజయ్‌ గురించి మంచిమాటలు చెప్పింది. కొద్దిగా తేరుకున్న విరంచి

నాకూ విజయ్‌ను చూడాలని ఉందమ్మా, అంటూ ఫోన్‌లోనే బిగ్గరగా ఏడుస్తోంది. కొద్దిసేపటి తర్వాత మీతోపాటు నన్ను ఒక్కసారి తీసుకుపోయి, విజయ్‌ను చూపించి, పుణ్యం కట్టుకోండి అంటూ వేడుకుంది.

సరేసరే. బాధపడకు. నేను వెళ్లే ముందుకు నీకు కారు పంపుతాను, బంగ్లాకు వచ్చేయి. ఇద్దరం కలిసి పోదామని హామీ ఇచ్చింది. టెలిఫోన్‌ ఆపరేటర్‌కు నీ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు… వద్దులే, నా నెంబర్‌ తీసుకో అంటూ తన సెల్‌ నెంబర్‌ ఇచ్చింది. దీంతో ఎంతో సంతోషంగా విరంచి థాక్స్‌ చెప్పింది. ఈ ఫోన్‌ కట్‌ కాగానే నాకు వెంటనే మిస్స్‌డ్‌ కాల్‌ ఇవ్వు. అంది అన్నపూర్ణమ్మ. కాదు ఆ కాల్‌ కట్‌ చేసి నీ నంబర్‌ నుంచి వెంటనే కాల్‌ చేయి అది రికార్డు అవుతుంది కదా అంటూ తాను ఫోన్‌ కట్‌ చేసింది.

విరంచి వెంటనే కాల్‌ చేసింది.ఇద్దరి మనస్సులు కొంత కుదుటపడ్డాయి. వారి మధ్య అంతా విజయ్‌ గురించే సంభాషణలు.

విజయ్‌కు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు ఉండవు, మరి నీకు క్లాస్‌మేట్‌గా పరిచయమా? లేక బంధువుగానా అంటూ అడిగింది. అన్నపూర్ణమ్మ.

రెండు కాదండీ, మా నాన్న దగ్గరకు ఒకసారి వచ్చాడు. అప్పటి నుంచి పరిచయం పెరిగింది. అప్పుడప్పుడు ఇంటికి భోజనానికి పిలిచే వాళ్లం. నా చదువు గురించి మాట్లాడేవాడు. మేం ఇద్దరం మాట్లాడుకునే ప్రతి సమయంలో మిమ్ములను ఎక్కువగా గుర్తుచేస్తుండే వాడు. మీరే ఆయనకు అమ్మ అంటూ చెప్పేవాడు… విజయ్‌ వల్ల మీరు ఆ రకంగా తెలుసు కాబట్టి ధైర్యంగా మీకు కాల్‌ చేసినా, అంది విరంచి.

అవునా. మంచిపనిచేసావు తల్లీ, వాడు నాకు కొడుకు లాంటి వాడు కాదు కొడుకే. వాడిని మేము దత్తత తీసుకుందామనుకున్నాం. వాడే ఒప్పుకోలేదు. అయినా వాడు ఒప్పుకోక పోయినా ఎప్పటికీ వాడు నా బాబే. అయితే వాడు ఎప్పుడు కూడా నీ గురించి చెప్పలేదు నాకు. కానీ తిరుపతిలో ఉన్నప్పుడనుకుంటా, నీతో మాట్టాడుతుంటే అడిగాను. ఎవరు అని, ఫ్రెండు అన్నాడు. అప్పుడు స్నేహితుడంటే ఆడ పిల్లా మగవాడా అని రెట్టించాను. అయితే నీ పేరు చెప్పలేదు కానీ అమ్మాయి అనిమాత్రం చెప్పాడు. ప్రేమ, దోమ ఏమైనా ఉంటే చెప్పు వెంటనే పెళ్లి చేసేస్తానని కూడా అడిగినా వాడు కచ్చింతంగా ఏమీ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను లే అమ్మా అన్నాడంటూ ఆ రోజు మాటలు గుర్తు చేసింది.

అవునమ్మా, ఇద్దరం ఒకరినొకరం అభిమానించుకుంటున్నాం. కలిసినప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నాం అంతే అంది విరంచి.

అంతేనా ఇంతకు ముందు విజయ్‌ అంటే నా ప్రాణం అన్నట్లుగా వినిపించింది, ప్రస్తావించింది అన్నపూర్ణమ్మ.

ఏమో అలా అన్నానా? విజయ్‌పై హత్యా ప్రయత్నం జరిగిన నాటి నుంచి నా మనస్సు అంతా శూన్యంగా కనిపిస్తున్నది. విజయ్‌ లేని లోకం అంతా చీకటిగా తోస్తున్నది. ఆస్పత్రిలో విజయ్‌ ఎలా ఉన్నోడో అని మధనపడుతున్నాను. మీరు ఆస్పత్రికి వెళ్లి చూసినట్లు మీడియాలో తెలియగానే మీతో మాట్లాడి, ఎలాగైనా విజయ్‌ను చూడాలని అనిపించింది.

నీవు కాల్‌ చేయడం వల్లనే ఇలా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. లేకుంటే నీ పరిచయం కూడా కాకపోయేది. విజయ్‌కు ఆత్మీయులందరూ నాకు దగ్గరివాళ్లే. ఇప్పుడే కారు పంపనా వస్తావా? కలసి మాట్లాడుకుందామని ఒత్తిడి చేసింది. వద్దులే అమ్మా, రేపు ఎలాగూ కలుస్తున్నాం కదా ఉదయమే మీ బంగ్లాకు వస్తాను. మా నాన్న కారులో దింపి వెళ్తారు. వద్దు నేనే కారు పంపిస్తాను. వేరే వాళ్ల వాహనాలను సెక్యూరిటీ వాళ్లు అనుమతించరు. సరే అమ్మా అంది విరంచి, మా ఇంటి లొకేషన్‌ నీ ఫోన్‌కు పంపుతున్నాను, అది డ్రైవర్‌కు చెబితే ఆయన నేరుగా మా ఇంటికి వస్తాడు. అడ్రస్‌కు కష్టం ఉండదు మళ్లీ అంది విరంచి.

అదేమిటి? నీవు డ్రైవర్‌కు అడ్రస్‌ చెప్పాల్సిన పని ఉండదా? అనుమానం వ్యక్తం చేసింది అన్నపూర్ణమ్మ. డ్రైవర్లుకు తెలుస్తుందమ్మా, లొకేషన్‌ చూసుకుంటే వాళ్లే వస్తారు. మీడ్రైవర్‌కు నా నంబర్‌ కూడా ఇవ్వండి. ఏదైనా అనుమనం వస్తే అడుగుతాడంది విరంచి.

సరే నాకు అంతగా ఈ విషయాలు తెలియవు. నేను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లను కదా, ఆయనతోనే ఎక్కడికైనా అంది.

రేపు ఉదయం బ్రేక్‌ఫాస్టుకే ఇక్కడికి వచ్చేయి. ఏమీ మొహమాటం పెట్టుకోవద్దు. విజయ్‌ ఇంటికి వస్తున్నట్లుగా రా. ఏమంటావు…డ్రైవర్‌ను ముందుగానే పంపిస్తానంటూ మరీమరీ చెప్పింది.

తప్పకుండా వస్తాను. విజయ్‌ దగ్గరకు వెళ్తున్నాం కదా,మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ వద్ద వాలిపోతాను అంది. గడుసురాలే అని నవ్వుకుంటూ అన్నపూర్ణమ్మ కాల్‌ కట్‌ చేసింది. ఈ విషయం వెంటనే భర్తకు చెప్పాలని ఆమె సిఎంకు కాల్‌ చేయమని చెప్పింది ఆపరేటర్‌కు..అయితే ప్రత్యేక సమవేశం జరుగుతున్నదని, తర్వాత కాల్‌ చేస్తానని చెప్పమన్నాడని సమాచారం వచ్చింది ఆమెకు. ఇలా చెప్పడం ఆమెకు కొత్త కాదు. మీటింగ్‌ తర్వాత తానే కాల్‌ చేస్తాడని ఆమెకు తెలుసు.

సాయంత్రం సచివాలయంకు వెళ్లిన ముఖ్యమంత్రి బిజీగా అయ్యారు. ముందుగానే చెప్పడంతో ఆయన వెళ్లేవరకు ప్రభుత్వప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుతోపాటు ఇంటలిజెన్స్‌ ఐజి, ఇతర పోలీసు అధికారులు సిఎం ఛాంబర్‌కు చేరుకున్నారు.

విజయ్‌ పై దాడి జరిగి ఇప్పటికే పది రోజులవుతున్నది. నింధితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా మీడియా మనపై దాడి చేస్తున్నది. మీడియాను అనడం కాదు కానీ ప్రజలందరూ ఇదే భావనతో ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతున్నది? రాష్ట్ర పోలీసులకు దేశంలోనే మంచిపేరున్నది.తీవ్రవాదుల ఆచూకీ ఎప్పటికప్పుడు కనిపెట్టి, వారి కార్యకలాపాలను చాలా వరకు కట్టడి చేసిన మన పోలీసులు విజయ్‌ కేసులో ఇప్పటివరకు కనీస పురోగతి సాధించలేకపోవడం నిజంగానే విచారకరం. అంటూ సిఎం కొంత ఆవేశంగానే మాట్లాడారు.

గదిలో కొంత సేపు నిశ్శబ్దం ఆవరించింది. ఎప్పుడూ లేనిది సిఎం ఇంత కోపంగా మాట్లాడటం అధికారులకు ఆశ్చర్యం వేసింది. సిఎస్‌ కలుగచేసుకొని…

సార్‌, మీరు వచ్చే ముందు ఇదే విషయం మాట్లాడుతున్నాం. డిజిపిగారు చెప్పిన విషయం ఏమిటంటే, శాఖా పరంగా రెండు సిట్‌లను ఏర్పాటు చేశారు. సంఘటన జరగగానే ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడంతోపాటు కేసులో తగిన క్లూ లభించకపోవడంతో టెక్నికల్‌ టీం ను కూడా నియమించారు. వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా, ఇంకా క్లూ లభించలేదు.

అవును సార్‌, కంట్రోల్‌ రూంతోపాటు, అసెంబ్లీ పరిసరాల్లో ఉన్న సిసి కెమరాలేవీ ఆ సమయంలో మాత్రమే పనిచేయలేదు. దీంతో పోలీసు శాఖ నుంచే ఎవరో ఈ దాడికి సహకరించినట్లుగా నాకు అనుమానం వచ్చింది. అందుకే ఈ లోపానికి కారణం ఎవరు, ఎందుకు చేసారు ఈ పని? ఇవి తెలుసుకుంటే నింధితులను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. దీనికే అధిక ప్రాధాన్యత నిస్తున్నామంటూ డిజిపి వివరించారు.

సాంకేతికంగా ఇంత ప్రగతి సాధించాం. ఇంత సమయం తీసుకుంటే ప్రజలు హర్షించరు. ఒకటి రెండు రోజుల్లో కేసు ఒక కొలిక్కి రావాలి, జాప్యం అయితే మంత్రివర్గాన్ని మొత్తంగా దూషిస్తారు ప్రజలు అన్నాడు సిఎం.

తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్‌. కుట్రదారులెవరో కానీ ఎంతో వ్యూహాత్మకంగా చేశారు. పైగా డిపార్టుమెంట్‌ కూడా సహకరించినట్లుగా ఉంది. వారెవరో ముందుగా కనిపెట్టాల్సి ఉంది. ఇంటలిజెన్స్‌ ఐజితోనూ సంప్రదించాను. ఆయన కూడా ఇదే పని మీద ఉన్నారు, మళ్లీ డిజిపి చెప్పారు.

ఇతర విషయాలపైన కూడా చర్చలు జరిగాయి. మీటింగ్‌ పూర్తి అయి అందరూ వెళ్లిపోయారు. కానీ ఇంటలిజెన్స్‌ ఐజి ఒక్కడు అక్కడే ఉండి పోయాడు.

ఊ…చెప్పు ఏమిటి కొత్త విషయాలు అడిగారు సిఎం.

అన్ని మీకు తెలుస్తున్నాయి కదా సార్‌, విజయ్‌ హత్య విషయంలో పకడ్భంఢీగా ప్లాన్‌ జరిగింది. ఏదో మిరకిల్‌ జరిగినట్లు ఉంది. లేకుంటే ఆయన బతకడం ఏమిటో, అంతుబట్టకుండా ఉంది.ఇది డాక్టర్ల కృషి అని నేను అనుకోవడం లేదు. ఏదేవుడో ఆయనకు తోడుగా ఉన్నట్లున్నాడు. ఢిల్లీలో కూడా ఆయన చనిపోయాడు. శవం మార్చూరీలోనే పెట్టి, ఆచూకీ కోసం అన్ని రాష్ట్రాలకు వివరాలు పంపారు ఢిల్లీ హోంశాఖ వారు. ఇటీవలే నాకు ఆ ఫైల్‌ కనిపించింది. రోడ్డు ప్రమాదంలో కారు ఎగిరిపడి డ్రైవర్‌ కూడా చనిపోయారు. కారు మొత్తం ఆనవాలు దొరకకుండా కాలిపోయింది. కొంత దూరంలో విజయ్‌ శవం పడి ఉందని, ఆ ఫైల్‌లో ఫోటోలతో పాటు ఉంది. అది ముమ్మాటికీ విజయ్‌ ఫోటోనే.

తుఫాన్‌ సహాయక కార్యక్రమాల్లో మనం బిజీగా ఉండి కొద్ది రోజులు విజయ్‌ గురించి తెలుసుకోలేదు. నిజంగా ఆ కొద్ది రోజుల్లో ఏదో జరిగింది. ఏమైందో ఏమో కాని తర్వాత విజయ్ ఢిల్లీలోని మన భవన్‌కు వచ్చి, నగరానికి రావడం అంతా విచిత్రమే..తర్వాతి పరిణామాలు మీకు తెలిసిందే.

అవున్నట్లుగా తలూపాడు ముఖ్యమంత్రి. జరిగిందేదో జరిగింది. ఇక విజయ్‌ గురించి నీవు ఏమీ పట్టించుకోవద్దు. అర్థమైందనుకుంటా. ప్రజలు విజయ్‌ వెంట ఉన్నారు. అధిష్ఠానం కూడా విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నది. ఈ దాడి జరిగిన తర్వాత ఢల్లీి నేతల నుంచి అనేక కాల్స్‌ వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నది. అందుకే ఈ మీటింగ్‌. ఇక ఎలంటి పనులు వద్దు అని హెచ్చరించాడు సిఎం. సరే సర్‌ అంటూ ఐజి వెళ్లిపోయాడు.

భార్య కాల్‌ చేసిన విషయం పిఎ చెప్పాడు. వెంటనే తన ఫోన్‌ నుంచే ఆమెకు కాల్‌ చేసాడు. ఫోన్‌ తీసుకోగానే ఎంతో సంతోషంగా విరంచి విషయం చెప్పింది భార్య. ఉదయమే ఆమెను పిలిచినట్లుగా ఆస్పత్రికి కలిసి వెళ్దామని చెప్పినట్లుగా ఆమె వివరిస్తుండటం ముఖ్యమంత్రికి కొత్తగా తోచింది. ఇప్పటివరకు ఎంతో విచారంగా ఉన్న పూర్ణ ఇప్పుడు ఎంతో ఉల్లాసంగా మాట్లాడటం నిజంగా ఆయనకు ఆనందం కలిగింది. భార్య సుఖ,సంతోషంకంటే తనకు ఏదీ ముఖ్యం కాదని అప్పుడు అనిపించింది జానకి రామయ్యకు

కొద్దిసేపు ఒంటరిగా కూర్చున్నాడు. భార్యకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే విషయంపై ఆలోచనలు వస్తున్నాయి. భార్య కోరుతున్న రెండు విషయాలపై ఆయన దృష్టి మళ్లింది. వీలునామా రాయించాలా వద్దా. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. అదే విధంగా దత్తత అంశంపై కూడా. దత్తత తీసుకుంటే అటోమెటిక్‌గా తన రాజకీయ వారసునిగా ప్రకటించినట్లు అవుతుంది. ఇది ఎంతవరకు సముచితమో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రాజకీయంగా ప్రస్తుతం విజయ్‌ తనకంటే కొంత పైఎత్తులోనే ఉన్నట్లు. ప్రజాధరణ మరింతగా పెరుగుతున్నట్లుగా వెల్లడవుతున్నది. అధిష్ఠానవర్గంకూడా తన కంటే విజయ్‌ వైపే మొగ్గు చూపుతున్నది. తాను ఢాంబికానికి పోతున్నా, వాస్తవం ఇదే.తన మనస్సుకు తానే సర్దిచెప్పుకున్నాడు.

వీలునామాపై కూడా ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో భార్యను సంతోషపెట్టడానికి వెంటనే వీలునామా రాయిస్తే…? ఈ ఆలోచన సబబుగానే తోచింది. ఇంకా కొద్ది రోజులు చూద్దామా? కోలుకుంటున్న విజయ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా భార్య చేతికి ఇస్తే ఆమె మరింతగా సంతోష పడుతుందని ఆయన ఊహించాడు. ముందుగా రడీ చేసి పెట్టమని మాత్రం అడ్వకేట్‌కు కాల్‌ చేసి చెప్పాడు. తాను ఎప్పుడు తీసుకు రావాలని చెబితే ఆరోజు బంగ్లాకు తేవాలని లాయర్‌కు వివరించి, కాల్‌ కట్‌ చేసాడు.

మనస్సు తేలికగా అనిపించింది. అంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఆయన ఫీల్‌ అవుతున్నాడు. నిజంగానే పూర్ణ సంతోష పడుతుందని అనుకోగానే ఆయన పెదవులపై చిరునవ్వు వచ్చింది. తనలో తానే నవ్వుకున్నారు సిఎం. ఇన్నాళ్లుగా తాను అనుభవించిన అన్ని బాధలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా ఉంది ఆయన మానసిక స్థితి. పిఎకు కాల్‌ చేసి కాఫీ పంపమని చెప్పాడు.

కాఫీ తాగుతూ సిఎం తన సతీమణికి ఆనందంగా కాల్‌ చేసాడు. ఇంటికి బయలు దేరుతున్నానని చెప్పాడు. ఎటైనా బయటికి పోదామా? సినిమా చూద్దామా అంటూ మాట్లాడుతున్న భర్త దోరణి అన్నపూర్ణమ్మకు వింతగా అనిపించింది. అదే మాట అంది భర్తతో.

ఏమీ లేదు చానా రోజులైంది కదా అందుకే ఏదైనా హోటల్‌కు వెళ్లి, భోజనం చేసి సరదాగా సినిమా చూద్దామన్నాను అంతే అని తనమాటలను సమర్థించుకునేందుకు అన్నట్లుగా మాట్లాడారు సిఎం.

ఏమంటున్నారు మీరు. విజయ్‌ ఆస్పత్రిలో ఉండగా మనకు సరదాలేమిటండీ. బాబు గురించి మీకు ఏ మాత్రం బెంగ లేనట్లుగా ఉంది. ఇంకా నయం ఎవరైనా మనలను బయట చూస్తే ఏమనుకుంటారో అనే ధ్యాస కూడా లేనట్లుంది. పోనియండి, అయితే మనం రేపు విరంచితో కలిసి ఆస్పత్రికి వెళ్తున్నాం. మీకు తీరిక లేకుంటే మేమిద్దరమే వెళ్తాం. మీ అధికారులకు ముందుగానే చెప్పండి. కుదరదు, కాదు అనకండీ అంది అన్నపూర్ణమ్మ.

లేదులే.. నేనూ వస్తాను. ఇప్పుడే వార్నింగ్‌ ఇచ్చావుగా…నేను రాకుంటే ప్రజలు ఏమనుకుంటారో నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఇక విజయ్‌ గురించి, నీలాగనే నేనూ ఆలోచిస్తాను సరేనా అన్నాడు సిఎం.

తన భర్తలో వచ్చిన ఈ మార్పుకు ఆమె ఎంతో సంతోషించింది. ఇప్పటివరకు ఏనాడు విజయ్‌ విషయమై ఇలాంటి మాటలు చెప్పలేదు సిఎం. దాడి తర్వాత ఆయనలో కూడా విజయ్‌ పట్ల అభిమానం పెరిగినందుకు ఆనందపడిరది అన్నపూర్ణమ్మ.

త్వరగానే ఇంటికి వస్తున్నాను. ఆఫీసులో ఈ రోజుకు అన్ని కార్యక్రమాలు ముగిసినట్లే అంటూ సిఎం ఫోన్‌ పెట్టేసాడు.

ఆ వెంటనే ముఖ్యమంత్రికి ఆస్పత్రి నుంచి కాల్‌ అంటూ పిఎ కాల్‌ కనెక్టు చేసాడు. నిమ్స్‌ డైరెక్టర్‌ లైన్‌లో ఉన్నాడు.

నమస్తే సార్‌, శుభ వార్త. విజయ్‌ కోమా నుంచి బయటికి వచ్చాడు. అందరినీ గుర్తుపడుతున్నాడు. రేపు ఉదయం పదిగంటల తర్వాత స్పెషల్‌ రూంకు మార్చుతున్నాం. చాలా తొందరగా కోలుకునేలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి. ఇంత పెద్ద శస్త్రచికిత్స జరిగినా ప్రస్తుతం విజయ్‌ ఎంతో చురుకుగా కనిపిస్తున్నాడు. మీరు రావాలనుకుంటే పదకొండు గంటలకు రావచ్చు సార్‌.

అలాగే వస్తాం. అయితే విజయ్‌ స్పెషల్‌ రూం కొంత పెద్దదిగా ఉండాలి. బెడ్‌ రూం వేరుగా మీటింగ్‌ రూం వేరుగా ఉండే విధంగా విశాలమైన గదిని కేటాయించండి. ఆయన ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు అక్కడే ఉండాలి. ఢిల్లీ నుంచి కూడా ఆయనను పరామర్శించేందుకు పెద్దలు రావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి.

అలాగే సార్‌ మంచి గదినే కేటాయిస్తామనడంతో సిఎం కాల్‌ కట్‌ చేసాడు.

ఆ వెంటనే భార్యకు ఈ విషయం చెప్పాలనిపించింది. కాల్‌ చేసాడు. పూర్ణ, విజయ్‌ గురించి నీకో మంచి వార్త. నాకు ఏమి ఇస్తావు చెప్పు అంటూ ఊరించాడు.

అబ్బ ముందు చెప్పండి, నా దగ్గర ఏముంది మీకు ఇవ్వడానికి, త్వరగా చెప్పండి అంటూ ఫోన్‌లో ఆరాటపడిరది అన్నపూర్ణమ్మ.

విజయ్‌ ఇక దాదాపు కోలుకున్నట్లే. అందరినీ గుర్తుపడుతున్నాడట. కోమా నుంచి బయటపడ్డాడు. ఇప్పుడే ఆస్పత్రి నుంచి కాల్‌ వచ్చింది. వెంటనే నీకు చెబుతున్నా. అంటూ సంతోషంగా ఫోన్‌ పెట్టేసాడు.

అన్నపూర్ణమ్మ ఆనందానికి అంతేలేదు. వెంటనే దేవుని గది ముందుకు వెళ్లి మొక్కింది. చెంపలు వేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత విరంచి మిస్‌డ్‌ కాల్‌ నంబర్‌ చూసి ఫోన్‌ చేసింది.

విజయ్‌ ఆరోగ్యం మరింత మెరుగైందని, మనం రేపు వెళ్లే గుర్తుపట్టి మాట్లాడే అవకాశం ఉందని ఆమె చెప్పడంతో విరంచి ఉద్వేగంతో అమ్మా ఎంత మంచి మాట చెప్పారనుకుంటూ ఫోన్‌లోనే ఆమెకు ముద్దులు పెట్టింది. ఆనందంతో ఆమెకు మాటలు రావడం లేదు. కంటినుంచి ఆనందబాష్పాలు రాలుతున్నాయి. ఇది చూసి తల్లి కంగారుగా విరించి దగ్గరకు రాగా , ఏమీ పర్వాలేదంటూ సంజ్ఞ చేసింది.

సరే అమ్మ రేపు ఉదయం తొందరగా రడీ అయి ఉంటా అంటూ కాల్‌ కట్‌ చేసింది. విజయ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటుండగా, మరింత చల్లనివార్త తెలియడంతో విరంచి మనస్సులోనే దేవునికి వేలసార్లు మొక్కుకుంది. కూతురు ముఖంలో కనిపిస్తున్న వెలుగు చూసిన తల్లి…

ఏమిటమ్మా విషయం చాలా మురిపంగా కనిపిస్తున్నావు, అంటూ ఆరా తీసింది.

(సశేషం)

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-39)

Leave A Reply

Your email address will not be published.