విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-43)

హస్తినలో మంతనాలు

హస్తినలో పార్టీ కార్యలయం అది. పార్టీ అధ్యక్షుడు ఇతర కీలక నేతలు సమావేశమయ్యారు. ఇతర విషయాల కంటే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైనే వారి చర్చ కేంద్రీకృతమైంది. ముఖ్యంగా శాసనసభ్యుడు విజయ్‌పై దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నింధితులను పట్టుకోలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అయింది.

అక్కడ నుంచే ముక్యమంత్రికి కాల్‌ చేసాడు పార్టీ అధినేత.

పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న విజయ్‌పై హత్యాప్రయత్నం చేసిన కేసులో దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించాడు.

పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సార్‌, ఒకటి రెండు రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని వివరణ ఇచ్చాడు ముఖ్యమంత్రి.

ఆయన సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ,త్వరగా విచారణ జరిపించి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించాడు.

విజయ్‌ కోలుకోగానే ఆయనకే పార్టీ పరంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆ మీటింగ్‌లో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నందున నాయకత్వ మార్పు కూడా అవసరమనే చర్చ జరిగింది.

శాపనసభ కాలపరిమితి ఇక ఏడెనిమిది నెలలే ఉన్నందున దానికిసమయం కాదని, అయితే రాష్ట్ర వ్యాప్తం పర్యటనలు జరిపి, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను మాత్రం విజయ్‌కు అప్పగించాలని కూడా చర్చ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ ఈ విషయంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కూడా సూచించారు. ప్రచార యాత్ర విజయ్‌ చేపడితే దీనికి యువ శాసనసభ్యులందరి మద్దతు ఉండటంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సహకరిస్తారని అభిప్రాయపడ్డారు.

విజయ్‌ పూర్తిగా కోలుకోగానే ఆయనను ఢిల్లీకి పిలిపించి అన్ని బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధ్యక్షుడు అన్నారు. ఇతర నేతలు కూడా ఇదే మంచిదని, విజయ్‌ నేతృత్వంలో పార్టీ ఆ రాష్ట్రంలో పదిలంగా ఉంటుందని, తిరిగి అధికారంలోకి రావడం కూడా తధ్యమని పలువురు పేర్కొన్నారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత విజయ్‌ తన క్వార్టర్స్‌కు వెళ్లకుండా ముఖ్యమంత్రి బంగ్లాలో ఉండటపై తమకు అందిన సమాచారాన్ని అధ్యక్షుల దృష్టికి తెచ్చాడు మరో నాయకుడు.

అవునా, ఇదేలా సాధ్యం. విజయ్‌ పట్ల అంతగా శ్రద్ధ ఉంటే, కేసు జాప్యంపై సిఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించాడు. ఏది ఏమైనా విజయ్‌ అక్కడ ఎందుకు ఉంటున్నాడో వివరాలు సేకరించి, రిపోర్టు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.

ఆస్పత్రి నుంచి నేరుగా విజయ్‌ బంగ్లాకు వెళ్లిన విషయంపై పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఆయన అధ్యక్షునికి చూపాడు.

సరే కానీయండి, ఏ పరిస్థితుల్లో విజయ్‌ అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. కారణాలు తెలియాలి మనకు. ముఖ్యమంత్రి తెర వెనుక కార్యకలాపాల్లో విజయ్‌ పాత్ర ఏమైనా ఉందో ఆరా తీయండి. ఇద్దరు ఒకే తాసులో ముక్కలైతే మనం వేరే సమర్థనాయకున్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ జాగ్రత్తగా తెలుసుకోండి. ఇప్పటివరకు మనకు వచ్చిన సమాచారం అంతా విజయ్‌ నిప్పు అని అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడని, పైగా మంత్రుల అవినీతిని అసెంబ్లీలో కూడా ఎండగట్టిన ఘటికుడని…మరి ఇదేమిటో అర్థం కావడం లేదు. అందుకే ఒకటి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాతనే ఆలోచిద్దామంటూ మీటింగ్‌ ముగించాడు.

ముఖ్యమంత్రి బంగ్లాలో ఉండి విజయ్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫోన్స్‌ ద్వారా తన సహచరులతో అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. పిఎ నగేష్‌ను కూడా బంగ్లాకే పిలుస్తున్నాడు. తనపై హత్యాయత్నం జరిగిన నాటి నుంచి వచ్చిన వేలాది మెసేజీలు, ఈమెయిల్స్‌కు ,థాక్స్‌ పంపించే పనిని నగేష్‌కు అప్పగించి, తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

ఈ మెసేజీలను ముందుగా జిల్లాల వారీగా విభజించాలని ఆదేశాలిచ్చాడు. జిల్లాలు వీలైతే, గ్రామ, మండల స్థాయికి కూడా వివరాలు నమోదు చేయిస్తున్నాడు. తనను అభిమానించే వారి పేర్లు, గ్రామాల వారీగా ఉంటే తాను రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ వారిని స్వయంగా కలుసుకొనే అవకాశం ఉంటుందని విజయ్‌ ఉద్ధేశ్యం. పైగా డ్యాటా అంతా కంప్యూటరీకరిస్తున్నందున అంతా భద్రంగా ఉంటుంది. అయితే ఈపని అంత తొందరగా పూర్తి కావడం లేదు. దగ్గరుండి చూసుకుంటూ విజయ్‌ కొంత తీరిక లేకుండా ఉంటున్నాడు.

ఎన్నికల సంవత్సరం కావడంతో విజయ్‌ ఇక రాజకీయాలకు అధిక సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాకు వచ్చిన నాటి నుంచి విరంచి తనకు చేదోడువాదోడుగానే ఉంటున్నది. కంప్యూటర్‌ పనిలోనూ సహకరిస్తున్నది. విజయ్‌ నిద్రపోయే వరకు ఆయన వెన్నంటి ఉంటున్న విరంచికి తన పిహెచ్‌డి థీసిస్‌ రాయడం కూడా అంత ముఖ్యం కాదని అనుకుంటున్నది. గతంలో వారు ప్రేమికులుగా కనిపించగా ప్రస్తుతం వారు స్నేహితులుగానే మెలుగుతున్నట్లున్నారు.

విరంచి ప్రతి రోజు వచ్చి వెళ్తున్నప్పటికీ వారిద్దరి మధ్య గతంలో ఉన్నంత సాన్నిహిత్యం కనిపించడం లేదు. ఆమె రావడం విజయ్‌తోపాటు కూర్చొనడం, కలిసి టిఫిన్స్‌, భోజనం చేయడం వరకే. మాటలు కూడా తగ్గిపోతున్నాయి. దూరం నుంచే ఇదంతా గమనించిన అన్నపూర్ణమ్మ కూడా వారి విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. విజయ్‌ తన రాజకీయంలో నిమగ్నం అవుతున్నందున ప్రేమ,దోమకు అవకాశం లేకుండా పోతున్నదనే అనుకుంది ఆమె.

అయితే విజయ్‌ ముందు ఉంటే చాలు, విరంచి ఏదో లోకంలోకి వెళ్లిపోతుంటుంది. తెలియని పారవశ్యం ఆమెను కమ్మేస్తుంది. శ్రీకృష్ణుని వేణు గానానికి ఆకర్షితురాలైన రాధకు, తనకు తాను విరంచి పోల్చుకుంటున్నది. విజయ్‌ను చూస్తే చాలనే తృప్తి ఆమెకు ఏర్పడుతున్నది. ఇదే సందర్భంలో విజయ్‌ కూడా తన రోజువారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా, విరంచి సాన్నిహిత్యంలో ఆయన పరవశించిపోతున్నారు. తెలియని బంధమేదో వారిద్దరి మనస్సులను కలుపుతున్న భావన కలుగుతున్నది. ఇదేమి బంధమో కానీ, కేవలం చూపులతోనే కాలం గడిచిపోతున్నది. అయితే మరేదో కావాలనే తపన కూడా వారికి కలగడం లేదు. విజయ్‌కు కూడా గుర్తుకు వచ్చింది. తాను చదివిన ప్లోటోనిక్‌ లవ్‌( అమలిన శృంగారం) ఇదేమోనని.

పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అనుకున్న విజయ్‌ ఇక తన క్వార్టర్స్‌కు వెళ్లాలని చాలసార్లు అనుకున్నాడు. కానీ అక్కడికి వెలితే విరంచి రావడం బాగుండదు. ఎవరైనా చూస్తే ఇతరత్రా ప్రచారం వస్తుంది. అందుకే బంగ్లా వదిలి పోవాలనే నిర్ణయాన్ని వదులుకుంటున్నాడు.కానీ ఎన్ని రోజులు? తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఇక తప్పదనే భావన వచ్చిన తర్వాత అన్నపూర్ణమ్మ వద్ద ఈ విషయం ప్రస్తావించాడు విజయ్‌.

అమ్మా…నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను కదా..ఇక క్వార్టర్స్‌కు పోవాలి. అన్నాడు

ఎందుకురా, ఇక్కడ నీకు ఏమి ఇబ్బంది ఉంది. అయినా నీవు ఉన్నది ఎవరింట్లో కాదు,అమ్మ దగ్గర ఉండటానికి మొహమాటం దేనికి అంటూ నిలదీసినంత పనిచేసింది ఆమె.

కాదమ్మా, అర్థం చేసుకో, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఎన్నికల సంవత్సరం. పైగా రోజూ నా వద్దకు వివిధ పనుల కోసం ఎక్కువ మంది వస్తుంటారు. వారందరినీ ఇక్కడకు రమ్మనడం సెక్యూరిటీ దృష్ట్యా మంచిది కాదు అర్థం చేసుకోవమ్మా. అంటూ అభ్యర్థించాడు.

ఊహూ… నీవు ఎన్ని అయినా చెప్పు. ఇక ఎప్పటికీ ఇక్కడ ఉండాల్సిందే. తప్పదు అంటూ పట్టుపట్టింది. అన్నపూర్ణమ్మ.
ఎలా అమ్మను ఒప్పించాలో అర్థం కావడం లేదు, విజయ్‌కు…

నీ ప్రేమ తర్వాతనే నాకు ఏదైనా, కానీ రాజకీయాలు కదమ్మా, అంటూ బతిమాలుతున్నాడు…

ఏ రాజకీయాలు వద్దు, సిఎం గారున్నారుగా ఆయన చూసుకుంటారు, నీకు ప్రత్యేకంగా ఏ వ్యాపకం లేకుండా ఇక్కడే ఉండిపో. అమ్మ కోసం అంది మళ్లీ..

ఇంకా సాగదీస్తే అమ్మకు ఆగ్రహం వస్తుందని ఊరుకున్నాడు విజయ్‌.

రాత్రి భోజనం సమయంలో సిఎం సమక్షంలో మళ్లీ విషయం ప్రస్తావించాడు.

చూడండీ సార్‌, అమ్మ వినడం లేదు.మీరైనా చెప్పండి. ఇప్పటికే క్వార్టర్స్‌కు చాలా మంది రోజూ వచ్చి నిరాశతో వెళ్తున్నారని నగేష్‌ చెబుతున్నాడు. వారందరు ఇక్కడికి రాలేరు కదా, అందుకే అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నా అంటూ సహేతుకమైన కారణాలు చెప్పాడు విజయ్‌.

సాలోచనగా చూసిన జానకి రామయ్య…

నీవు అంటున్నది నిజమే..కానీ అంటుండగానే అన్నపూర్ణమ్మ అందుకుంది.

ఏమంటున్నారు మీరు, వాడికి రాజకీయాలు ఎందుకు , మీరున్నారుగా, వాడు ఇక్కడే ప్రశాంతంగా కాలం గడుపితే చాలు. తొందరలో పెళ్లి చేద్దాం. వారిద్దరు చిలకా గోరింకలుగా ఇంట్లో తిరుగుతుంటే మనకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది. మన వద్ద తరగని ఆస్తి ఉంది. ఇంకా వాడు సంపాదించాల్సిన అవసరం ఏముంది. అంటూ తన వాదనను కొనసాగించింది.

విజయ్‌ పట్ల అన్నపూర్ణమ్మ పెంచుకుంటున్న మమకారాన్ని చూస్తున్నది అక్కడే ఉన్న విరంచి.

కాదు, పూర్ణ. రాజకీయాలు అలా ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్‌కు పెద్దయెత్తున ప్రజల ఆదరణ ఉంది. వాని ఎదుగుదలను మనం ఆపకూడదు. పెరిగే

మొక్కకు మరింత నీరుపోసి, ఎరువు వేసి పెంచినట్లే రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉన్న విజయ్‌కు మనం ఆశీర్వదించాలే కానీ మన ప్రేమ వాని ఎదుగుదలకు అడ్డుకారాదు. వాడు ఇదే నగరంలో ఉంటున్నాడు కదా,వాన్ని చూడాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు నీవు, వెళ్లి రావచ్చు. డ్రైవర్లు ఉన్నారు, కావాలంటే ఒకన్ని నీ కోసం కేటాయిస్తాను కూడా…అంటూ జానకి రామయ్య ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తున్నాడు.

దీంతో ఆమె కొద్దిగా మెత్తపడిరది.

మీరు ఎన్ని అయినా చెప్పండి. బంగ్లాలో వాడు ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. వాడు పోవడానికి వీలు లేదు అంతే అంది.

అమ్మా నేను కూడా నీ దగ్గరికి వచ్చి పోతుంటాను. నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా, ఒప్పుకో అమ్మ అంటూ గారాలు పోయాడు విజయ్‌.

తప్పలేదు అన్నపూర్ణమ్మకు. సరే అక్కడ టైంకు భోజనం చేయాలి. నాకు రోజుకోసారి ఫోన్‌ చేయాలి. లేవగానే నాకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పాలి. గుడ్‌ నైట్‌ చెప్పిన తర్వాతనే నీవు నిద్రపోవాలి.అంటే షరతులు ప్రారంభించింది.

ఆమె ఒప్పుకున్నదే చాలన్నట్లుగా …

సరే అమ్మ. తప్పకుండా అన్నాడు విజయ్‌..

విరంచి అక్కడే ఉండి అంతా గమనిస్తున్నది. తన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఫీల్‌ అయింది. బంగ్లాలో విజయ్‌ ఉన్నంత కాలం తాను ఎప్పుడంటే

అప్పుడు రావడానికి, పోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. అందుకే విజయ్‌ ఇక్కడే ఉండాలని మనస్సులో కోరుకుంది. క్వార్టర్స్‌లో విజయ్‌ ఉంటే అన్ని ఆంక్షలే.

అమ్మతోపాటు నాన్న కూడా అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోకపోవచ్చు. భోజనానికి పిలిస్తే ఎప్పుడో కానీ, విజయ్‌ తన వద్దకు రాకపోవచ్చు. ఇన్నాళ్లు విజయ్‌కు దగ్గరగా ఉండటంతో ఎంతో కలవిడిగా కాలం గడిచిపోయింది. తర్వాత ఎలా ఉంటుందో అనుకుంది విరంచి.

దీర్ఘాలోచనలో ఉన్న విరంచిని గమనించాడు జానకి రామయ్య.

ఏమిటమ్మా, నీవు ఏమి మాట్లాడటం లేదు అంటూ పలకరించాడు సిఎం.

ఉలిక్కిపడిరది విరంచి, పెద్దవాళ్లు మీ ఇష్టం అంటూ ముక్తసరిగా అంది.

మొత్తానికి విజయ్‌ తన మాట నెగ్గించుకున్నాడు. మర్నాడు లంచ్‌ తర్వాత తన క్వార్టర్స్‌కు బయలు దేరాడు. గన్‌మెన్‌, పిఎలు ముందుగానే బంగ్లా వద్దకువచ్చారు. విరంచిని కూడా తన ఇంటికి పంపడానికి కారు సిద్ధం చేసింది అన్నపూర్ణమ్మ. ఇద్దరు ఒకేసారి వెళ్తుండటంలో ఆమె ఒంటరిగా ఫీల్‌ అవుతూ కన్నీళ్లు తుడుచుకుంది.

విరించిని దగ్గరకు తీసుకుంటూ… బంగ్లాకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చేయి. నేనే పిలవాలని అనుకోవద్దు. రోజూ కాల్‌ చేస్తావుగా అంది.

సరేనంటూ తలూపింది విరంచి.

బంగ్లా ఒక్కసారిగా బోసిపోయినట్లు అనిపించింది అన్నపూర్ణమ్మకు. తన గదిలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. తన స్వంత కొడుకు అయితే ఇలా వెల్లిపోయే వాడు కదా అంది, అక్కడకు వచ్చిన సిఎంతో…

సముదాయించాడు ముఖ్యమంత్రి.

క్వార్టర్స్‌కు రాగానే సహచర ఎంఎల్‌ఎలకు కాల్‌ చేసాడు విజయ్‌…తనను ఆస్పత్రిలో పరామర్శించిన వారందరిలో యువ ఎంఎల్‌ఎలతో ప్రత్యేకంగా మాట్లాడాడు. కొందరు అధికారులకు కాల్‌ చేసాడు. సోషల్‌ మీడియా అందరినీ దగ్గరకు చేర్చింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెసేజీలు పంపిన వారందరికీ జవాబులు పంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

విజయ్‌ క్వార్టర్‌ ఎప్పుడు కోలాహలంగా ఉంటోంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత విజిటర్ల సంఖ్య మరింతగా పెరిగింది. ఉదయం నుంచే ప్రజలు తమతమ సమస్యలతో ఆయన ముందు వాలుతున్నారు. ఇంత బిజీలో ఉన్నప్పటికీ రోజూ అన్నపూర్ణమ్మకు కాల్‌ చేయడం మాత్రం మరవడం లేదు. విరంచికి అప్పుడప్పుడు

మాత్రమే కాల్‌ చేస్తున్నాడు. కానీ ఆమె చెంత ఉంటే ఉండే ఉత్సాహం ప్రస్తుతం విజయ్‌లో కనిపించడం లేదు. ఆమె ఎప్పుడు తన సమక్షంలోనే ఉండాలని మనస్సు

తహతహలాడుతున్నది.

విజయ్‌ బంగ్లా నుంచి వెళ్లి నాలుగైదు రోజులైంది. అన్నపూర్ణమ్మకు రోజులు భారంగా గడుస్తున్నాయి.

ఇక్కడికి వచ్చేయరి..బాబూ..నాకు ఎంతో లోటుగా ఉంటున్నది. అమ్మను వదిలి ఎలా ఉండగలుగుతున్నావురా అంటూ విజయ్‌కు కాల్‌ చేసింది ఆమె.

సరే అమ్మ రేపు మధ్యాహ్నం వచ్చేస్తా, సరేనా అన్నాడు విజయ్‌. అయితే విరంచిని కూడా పిలుస్తా, తప్పక రా అంటూ కాల్‌ కట్‌ చేసింది.

విరంచిని మళ్లీ ఇంత తొందరగా చూస్తానను కోలేదు విజయ్‌. పిహెచ్‌డి త్వరగా పూర్తి చేయమని ఆమెకు చెప్పాలి మనస్సులోనే అనుకున్నాడు.

బంగ్లాకు విజయ్‌ చేరుకోక ముందే విరించి అక్కడ ఉంది. ఎప్పుడెప్పుడు విజయ్‌ను వస్తాడా అనుకుంటూ బంగ్లా ముందు ఉన్న గార్డెన్‌లోనే తచ్చాడుతున్నది ఆమె. విజయ్‌ కారు రాగానే లేడిపిల్లల పరిగెత్తుకు వచ్చి ఆయన ముందు వాలింది. ఇద్దరు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారి కళ్లలో వేలవేల భావాలు. వారి మధ్య మాటలే కరువయ్యాయి. ఒకరినొకరు చూసుకుంటూనే లోనికి వెళ్లారు.

ఏరా ఆలస్యం అయింది. నీవు వచ్చే వరకు మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఎదురు చూస్తున్నది అమ్మాయి అంటూ వారి అనోన్యతకు మురిసిపోయింది అన్నపూర్ణమ్మ.అంతా నీకు తెలిసిందే కదమ్మా, ఢిల్లీ వాళ్లు ఫోన్‌ చేసి, ఒక్కసారి వచ్చి వెళ్లమన్నారు.ఎందుకో ఏమిటో తెలియదు. రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

 

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:  విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-42)

Leave A Reply

Your email address will not be published.