విజయుడు (ధారావాహిక నవల పార్ట్-44)

ఎన్నికలు ఇంకా అయిదారు నెలల్లోనే… ఈ కాలంమంతా నాకు తీరిక ఉండదు. మీరిద్దరే కలుసుకోవాలి అంటూ పరిస్థితిని వివరించాడు విజయ్. అమ్మతోపాటు కలిసి తృప్తిగా భోజనం చేసాడు విజయ్. తనకు ఇంత మంచి భోజనం ఇక్కడే చేస్తున్నానంటూ ఆవురావురుగా తింటున్నాడు. అందుకే కదరా, ఇక్కడే ఉండిపొమ్మన్నా నీవు వినడం లేదంటూ కోప్పడింది ఆమె. ఇద్దరికీ కొసరికొసరి వడ్డించింది ఆమె. విరంచి, విజయ్‌లు ఒకరినొకరి సమక్షంలోనే ఎంతో హాయిని అనుభవిస్తున్నారు. అందులో పారవశ్యం ఉంటున్నది. బంగ్లాలో పచార్లు చేస్తున్న విజయ్‌కు పెద్ద సంఖ్యలో ఉన్న ఆల్బమ్స్ కనిపించాయి. ఇదేమిటమ్మా ఇన్ని ఉన్నాయంటూ అన్నపూర్ణమ్మను అడిగాడు.
ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం నుంచి మొన్నటివరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు అవి. గతంలో మంత్రిగా పనిచేసినవి కూడా ఉన్నాయి. అంతెందుకు ఆయన గురించి పత్రికల్లో వచ్చిన మంచి వార్తలనుకూడా ఇలా ఆల్బమ్స్‌గా చేసి ఇస్తున్నారు అధికారులు. మంత్రిగా పనిచేసిన రోజుల్లోనూ కొన్ని ఆల్బమ్స్ చేసారు.
ఫోటోలు చూపిన బంధుత్వం
వీటిని మళ్లీ ఒక్కసారైనా చూస్తున్నారా, దుమ్ము పట్టినట్లుగా ఉన్నాయి. అడిగాడు విజయ్.
లేదు బాబు. వాళ్లు తెచ్చి ఇస్తారు, అక్కడ పెడుతుంటారు.
ఇవి ఎందుకు కానీ, మీ వ్యక్తిగత ఆల్బమ్స్ ఏమీ లేవా? ముఖ్యంగా మీ పెళ్లి ఫోటోలు అంటూ ఆగిపోయాడు విజయ్.
ఇవిగో ఇక్కడ ప్రత్యేకంగా పెట్టించా వాటిని అంటూ చూపింది అన్నపూర్ణమ్మ.
పాత ఫోటోల ఆల్బమ్స్‌ను ఒక్కటొక్కటిగా చూస్తున్నాడు విజయ్, పక్కనే విరంచి ఉంది.
పెళ్లి ఫోటోలలో ఒక దగ్గర సడన్‌గా అమ్మా, నాన్న అంటూ ఆగి పోయాడు విజయ్. తనకు తెలియకుండానే ఉద్వేగంతో బయటకు వచ్చినవి, ఆ మాటలు.. తర్వాత ఎవరూ వినలేదుగా అన్నట్లుగా చుట్టూ చూసాడు. విరంచి తప్ప ఎవరూ లేరు. ఉలికిపాటు పడింది విరంచి.
విజయ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ ఫోటోలకు విజయ్‌కు ఏదో సంబంధం ఉందని అనుకుంది. అదే అడగాలని ప్రయత్నిస్తూ ఆగిపోయింది. అయితే ఆ ఫోటోలను విజయ్ గుర్తు పట్టారని, అమ్మ, నాన్న అనుకున్నాడని మాత్రం గ్రహించింది విరంచి.
ఈ లోగా అన్నపూర్ణమ్మ అక్కడకు వచ్చింది. ఆ ఫోటోనే చూస్తూ ఆగిపోయిన విజయ్‌తో ఈ ఆల్బమ్ మా పెళ్లి నాటిది. వీళ్లంతా సిఎం గారి దగ్గర బంధువులు. వీరేమో ఆయన అక్క, భావ గారు, వీళ్లేమో ఆయన తమ్ముడు, ఆయన భార్య. అంటూ చెప్పుకు పోతున్నది ఆమె.
విజయ్ లో కలవరం. అంటే, అంటే సిఎం గారి తమ్ముడు మా నాన్న… అయితే సిఎం నాకు స్వంత పెద్దనాన్న…పెద్దమ్మ అని మనస్సులో అనుకుంటూ అన్నపూర్ణమ్మ వైపు చూస్తున్నాడు.
ఏరా కొత్తగా చూస్తున్నావు. అమ్మను ఎప్పుడూ చూడనట్లు అంది.
విజయ్‌కు ఆమె మాటలు వినబడనట్లుగా అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు. దీంతో ఆమె వీపుపై ఒక్కటి వేసి, ఏమిటి బాబు అలా ఉన్నావు అంటూ దగ్గర కూర్చుంది అన్నపూర్ణమ్మ.
ఆ… ఆ… ఏమీ లేదు. మిమ్ములను మొదటి చూసినప్పడే ఎంతో ఆత్మీయత ఏర్పడిరది. దీనికి ప్రత్యేక కారణం ఏముందో కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మీపై మమకారం పెరుగుతూనే వస్తున్నది. మీరు అంతే అప్యాయతతో చూస్తున్నారంటుండగా విజయ్ కళ్లలో నీళ్లు వచ్చాయి.
అయ్యో ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు. అంటూ ఆమె తన చీర కొంగుతో కన్నీళ్లు తుడిచింది. విజయ్ అలాగే ఆమె పాదాలను తాకాడు.
బాబు అంటూ లేవదీసి, అక్కున చేర్చుకుంది ఆమె.
వారిద్దరి అనురాగం విరంచిని కూడా కదిలించి వేసింది.
కొద్ది సేపు అక్కడ మౌనం రాజ్యం చేసింది. ఎవరూ ఏమి మాట్లాడలేకపోతున్నారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని భావించిన విజయ్ టాపిక్‌ను మార్చారు.
ఇక నేను వెళ్తాను అమ్మా, రాత్రి వరకు ఉండాలనుకొని వచ్చాను కానీ సాయంత్రం ఫ్రెండ్స్‌తో మీటింగ్ ఉంది, వారు క్వార్టర్స్‌కు వస్తున్నారంటూ అక్కడ నుంచి బయలు దేరడానికి ఏదో ఒకటి చెప్పాలని లేని మీటింగ్‌ను చెప్పాడు విజయ్.
విజయ్‌లో ఈ మార్పుకు ఆశ్యర్య పోతున్నది విరంచి.
మీటింగ్ లేదు, గీటింగ్ లేదు. వాళ్లకు కాల్ చేసి చెప్పు. రేపు రమ్మని, వచ్చి మూడు గంటలైనా కాలేదు. రాత్రి ఢన్నిర్ చేసి పోవాల్సిందే అని పట్టుపట్టింది ఆమె. లేదు వద్దు అంటూ చెబుతున్నా లేదమ్మా వెళ్లాలని సముదాయించడంతోపాటు విరంచినికూడా ఇంటి వద్ద దిగబెడతాను, మాట్లాడుకుంటూ వెళ్తామని చెప్పాడు విజయ్.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఓకే చెప్పింది.
విరంచి, విజయ్ కారులో పక్కపక్కనే కూర్చున్నారు. అయితే డ్రైవర్, గన్‌మెన్ కూడా ఉండటంలో వారి పెద్దగా మాట్లాడు కోలేదు. ముఖ్యమంత్రి /సిఎం గారు తనకు స్వయానా పెద్ద నాన్న అవుతారని తెలుసుకున్న విజయ్‌లో వింత ఆలోచనలు వస్తున్నాయి. ఇంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ తన నాన్నను సిఎంఎందుకు చేరదీయలేదో విజయ్‌కు అర్థం కాలేదు. తాను ఉద్యోగం చేసే వరకు తన కుటుంబం ఆర్థికంగా ఎన్ని బాధలు పడిరదో ఆయనకు గుర్తుకు వచ్చింది. నాన్నకు, పెద్దనాన్న మధ్య ఏదో జరిగి ఉంటుందని ఆయన ఊహించాడు. దీనిపై తర్వాత అమ్మ వద్ద సమాచారం రాబట్టాలని కూడాఅనుకున్నాడు. అయితే సిఎంతో తన బంధుత్వం విషయం బయటకు రానీయవద్దు. అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే విరంచి కనిపెట్టినట్లుగా ఉంది. అందుకే మౌనంగా నన్ను చూస్తున్నదనుకున్నాడు విజయ్.
విరంచికి చెప్పాలి, కానీ ఎలా? ఆమెకు స్పష్టంగా అర్థమైందో లేదో, చెబితే నేనే చెప్పినట్లు అవుతుందో అనుకుంటూ మధనపడుతున్న విజయ్‌ను గమనిస్తున్నది
విరంచి. కారు విరంచి ఇంటి వద్ద ఆగింది. ఆమెను ఇంటిలోపలి వరకు పంపి తిరిగి రావాలని విజయ్ అనుకున్నాడు.
ఆల్బమ్‌ను చూసినప్పటి నుంచి మీరెందుకో కలవరపడుతున్నారు. నా దగ్గర దాపరికాలు ఎందుకు చెప్పండి అంది కారు దిగి ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో విరంచి.
ఆమెను తధేకంగా చూస్తూ, అప్పుడు నీవే ఏమి వినలేదు కదా అంటూ ఎదురు ప్రశ్నించాడు విజయ్.
తనకు తెలిసినా కావాలని, ఎప్పుడు అంటూ తిరిగి ప్రశ్నించింది ఆమె.
అదే, నేను ఆల్బమ్ చూస్తూ అగిపోయిన సమయంలో విడమర్చి చెప్పాడు
అవును విన్నాను.
అంటే వారిద్దరు నా అమ్మ,నాన్నలని నీకు తెలిసిందన్నమాట. ఎవరికీ తెలియ రాదని అనుకుంటున్నాను నేను అన్నాడు విజయ్.
ఎందుకు అంత హైరానా పడుతున్నారు, ఇప్పుడు ఏమైందని, అసలు మీ ఉద్ధేశ్యం ఏమిటో నాకు అర్థమైతే కదా అంటూ విజయ్ కళ్లలోకి చూసింది విరంచి.
విరంచి నాకో మాట ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ,నేను సిఎం గారి తమ్ముని కొడుకునని ఎవరికీ చెప్పవద్దు. మనిద్దరి మధ్యనే ఈ రహస్యం ఉండాలి. ఎన్నికలు
వస్తున్నాయి కదా, ఈ విషయం బయటకు వస్తే రాజకీయంగా సమస్యలు అధికమవుతాయి అన్నాడు విజయ్.
ఆల్బమ్ చూసే సమయంలో అస్పష్టంగా అర్థం అయిన విషయం విజయ్ స్పష్టంగా చెప్పడంతో మౌనంగా విన్నది విరంచి.
అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటావు, అన్నపూర్ణమ్మ కు కూడా అంతేగా, అంది విరంచి.
అయ్యో కొంపముంచుతున్నావు. ఆమెకే అసలు తెలియవద్దు. ఇప్పటికే నన్ను దత్తత తీసుకుంటానని వత్తిడి తెస్తున్నది. తీరా ఈ విషయం బయటపడితే ఇంకేమైనా ఉందా, ఆందోళనగా అంటున్నాడు విజయ్.
మహానుభావా, నీకు ఇబ్బంది కలిగే ఏ పని నేను చేయను. ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అంటూ బుంగమూతి పెట్టింది విరంచి.
సమస్య నుంచి ఇంత తేలికగా బయటపడుతానని అనుకోని విజయ్‌కు ఆమె మాటలతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. మబ్బులన్నీ విడిపోయినట్లుగా ఉంది ఆయన మనస్సు కుదటపడిరది. ఒక్కసారిగా ఆమెను దగ్గర తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు.
ఈ హఠాత్తు పరిణామానికి విరంచి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలియని ఆనందం ఆమెలో కలిగింది. ఒక విధమైనా మైకం కమ్మింది. అంతే ఆమె కూడా తమకంతో గట్టిగా విజయ్‌ను కౌగలించుకుంది. దగ్గరైనా వారి గుండెలు గుసగుసలాడుకుంటున్నాయి. వాటి చప్పుడు కూడా వారు వినగలగుతున్నారు. ఎంతసేపు వారున్నారో అర్థంకాలేదు. వారిద్దరుఇంట్లో ప్రవేశించి మాట్లాడుకుంటున్నట్లుగా తెలియడంతో ఆమె హాల్‌లోకి రాలేదు విరంచి తల్లి. అయితే మాటలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో బయటకు వచ్చిన ఆమెకు ఆ దృశ్యం ఆశ్చర్యం వేసింది. ఆ వెంటనే మళ్లీ తన గదిలోకి వెళ్లిపోయింది. వయస్సులో ఉన్న ఇద్దరు, దీనికితోడు ఒకరిపై మరొకరికి పెరుగుతున్న అనురాగంతో పెనవేసుకుపోయిన ఈ జంటకు కొత్త అనుభవం మధురానుభూతితో ముంచెత్తుతున్నది.
కౌగలింతలోనూ ఇంత అనుభూతి ఉంటుందని వారి మరస్సులు మాట్లాడుకుంటున్నాయి. ఈ అనుభవాన్ని వదులుకోవడం ఇష్టం లేనట్లుగా ఎవరూ పట్టుసడలించుకోవడం లేదు. మరింతగా చేరువవుతున్న వారి మధ్యకు గాలి కూడా దూరడం దుర్లభంగా ఉంది. ప్రేమ మాదుర్యాన్ని గ్రోలుతున్న వారి హృదయాలు ఈ సంతోష సమయంలో మరింత ఆనంద డోలికల్లో మునిగిపోతున్నాయి.
రసానుభూతి నుంచి బయటపడుతూ, చుట్టూ చూసాడు విజయ్. చేయరానిదేదో చేసినట్లుగా భావించి, మనస్సును అదుపులోకి తెచ్చుకుంటూ మెల్లగా విడిపోవడానికి ప్రయత్నిస్తున్నా, తనకు అది సాధ్యం కావడం లేదు. విరంచి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సుఖాన్ని వదులుకోదలుచు కోలేదు ఆమె కూడా. ఈ కౌగలింత పులకింతతో ఆమె శరీరం దూదిపింజ లా తేలికైంది. ప్రియుని పరిష్వంగంలో ఇంత మాదుర్యం ఉంటుందా అనుకుంది.
కారు వేగంగా వచ్చి పోర్టికోలో నిలిచింది. అప్పుడే ఇంటికి వచ్చిన కుటుంబరావు కూడా వారిద్దరిని అలా చూసి ఆశ్యర్య పోయాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని, ఈ విషయం వారే స్యయంగా చెబుతారని ఆయన ఊహిస్తూ వచ్చాడే కానీ ఇప్పటివరకు వారిద్దరిని కదిలించలేక పోయాడు. వారి ప్రవర్తనపై ఆయనకు ఎప్పుడూ అనుమానం రాలేదు. తన గదిలోకి వెళ్తూ, ఇక వారిని సంప్రదించి ముహూర్తాలు ఖరారు చేయడమే మంచిదని అనుకున్నాడు.
హాల్‌లో ఇక ఇద్దరే మిగిలిపోయారు. అయితే ఇప్పటికీ ఆ రసానుభూతి నుంచి వారు ఇంకా తేరుకోలేదు. వారి కళ్లు ఏవో తెలియని భాషలు మాట్లాడుకుంటున్నాయి. మరింత సమయం అక్కడ ఉండటం మంచిది కాదేమో అనుకుంటూ విజయ్ వెళ్లిపోవాలని ఉద్రిక్తుడవుతుండగా, కాఫీ అంటూ విరంచి తల్లి అక్కడకు వచ్చింది.
కాఫీ ఎప్పుడు తాగాడో కాని వెంటనే కారు దగ్గరకు వచ్చి సీట్లో కూర్చోవడం, కారు బయలు దేరడం జరిగిపోయింది. వెళ్లిపోతున్న విజయ్‌ను మత్రముగ్దగా చూస్తూ ఉండిపోయింది విరంచి. కారు వెళ్లిపోగానే తన గదిలోకి వచ్చిన విరంచికి, విజయ్ భాహుళ్లో నలిగిపోయిన తన శరీరాన్ని మరీమరీ చూసుకుంటుంది. తనలో తనే మాట్లాడుకుంటూ పారవశ్యంలో మునిగిపోతున్నది. రాత్రి భోజనాల సమయం అయినప్పటికీ తన గదిలో నుంచి బయటకు రాలేదు విరంచి. తల్లి పిలుపుతో లోకంలోకి వచ్చింది. టైం చూసుకుంది. వెంటనే బాత్ రూంలోకి వెళ్లిపోయింది. స్నానం చేసి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్‌కు వచ్చిన విరంచితో …
విజయ్‌ను డిన్నర్‌కు ఉండమని చెప్పలేదా, ప్రశ్నించిన తల్లి వైపు అదోలా చూసింది విరంచి. అవును ఆ విషయమే మరిచిపోయాను అనుకుంది.
బదులివ్వలేదు విరంచి.
(సశేషం)