విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-45)

విజయ్‌ గుర్తుకు రాగానే ఆమె మొఖ కవలికలు మారిపోయాయి. పెద్దగా మాట్లాడకుండానే భోజనం చేసి, తన గదికిచేరుకుంది.కళ్లు మూసినా, తెరిచినా విజయ్‌ రూపమే కనిపిస్తున్నది. ఏవో ఊహలు, ఏవేవో ఊసులతో మనస్సంతా నిండిపోవడంతో ఎప్పుడు నిద్ర పోయిందో ఆమెకు తెలియదు.

క్వార్టర్స్‌కు వెళ్లిన విజయ్‌ తనలోతనే మధనపడుతున్నాడు.తొందరపడ్డానని పశ్చాత్తాపడుతున్నాడు. తన భావాలకనుగుణంగా నడుచుకుంటానని చెప్పిన విరంచి మాటలకు ముచ్చటేసి, కౌగలించుకున్నానని, కానీ దీని వల్ల విరంచి మనస్సును కష్టపెట్టానేమోనని ఆయనలో ఆందోళన ప్రారంభమైంది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన పెద్దవాళ్ల కంటపడినందున పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆయన ఊహించుకుంటున్నాడు. విరంచి అంటే తనకు ప్రేమ ఉన్న విషయం వాళ్లు కనిపెట్టి ఉంటారు కానీ తాను అలా తొందరపడకుండా ఉండాల్సింది కాదని అనుకున్నాడు. అయితే ఆమెను హత్తుకోవడంతో లభించిన ఆనందాన్ని మాత్రం వదులుకోదలుచుకోలేదు విజయ్‌. ఆ మధురానుభూతిని నెమరు వేసుకుంటూ ఎంతసేపు అలా కూర్చుండిపోయాడో టైం కూడా చూసుకోలేదు. పిఎ నగేష్‌ ఇక నేను వెళ్తున్నాను సార్‌ అంటూ చెప్పడంతో ఉలిక్కిపడి లేచి, సరే అన్నట్లుగా తలూపాడు.

విజయ్‌కు, విరంచితో లభించిన కొత్త అనుభూతికి తోడు ముఖ్యమంత్రి జానకి రామయ్య తన తండ్రి స్వయాన సోదరుడని తెలిసిన విషయం కూడా పదేపదే జ్ఞపికి వస్తున్నది.తనకు ఎవరూ లేరని ఇన్నాళ్లుగా ఒంటరిగా ఫీల్‌ అవుతున్న సమయంలో ఒక్క రోజే రెండు విషయాలు జరిగాయనే ఆలోచన రాగానే విజయ్‌ మనస్సు తేలికైంది. ఆల్బమ్‌లో తల్లిదండ్రుల ఫోటోలుండటం వల్ల సులువుగా గుర్తుపట్టగలిగాడు. అయితే రెండు కుటుంబాలు ఎందుకు విడిపోయి దూరంగా ఉన్నాయో అమ్మను అడిగి వివరంగా తెలుసుకోవాలని అనుకున్నాడు విజయ్‌. ఇక విరంచి గురించి వచ్చిన తలపులతో రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు విజయ్‌.

రాత్రి ఏ సమయంలో నిద్రపోయినప్పటికీ తెల్లవారకముందే లేచి, కాలకృత్యాల తర్వాత యోగసాధన చేయడం,శుచిగా స్నానం చేసి పూజలు చేయడం అలవాటుగా మారింది. ప్రార్థనా మందిరంలో పెట్టిన శ్రీమన్నారాయణుని ప్రతిమను చూడగానే తన రెండు చేతులు వాటంతటవే దగ్గరవుతుంటాయి.

పాలకడలిలో శేషశయ్యపై పవళించిన ఆ దేవదేవుని చిత్రపటం అంటే ఆయనకు ఇష్టం. భక్తిప్రపత్తులతో ప్రణమిల్లుతాడు ప్రతిరోజు.

దాదాపు రెండు వారాల పాటు సిఎం బంగ్లాలో ష‌డ్రసోపేతంగా భోజనాలు లభించాయి విజయ్‌కు. ఇక తన క్వార్టర్స్‌లో చేసే భోజనం, టిఫిన్‌ పెద్దగా సహించడం లేదు. ఆ రుచులే వేరు కదా అనుకుంటున్నాడు. తప్పదు ఇదే తినాల్సిందే అనుకుంటూ ఉన్నదానితో తృప్తిపడక తప్పలేదు.

ఢిల్లీలో తనపై జరిగిన హత్యా ప్రయత్నం కారణాలు, కారకులను ఇంకా తెలుసుకోకముందే, మరో దాడి జరిగి రెండోసారి పునర్జన్మ పొందిన పరిస్థితులు మాత్రం విజయ్‌లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారో స్వయంగా తెలుసుకునే ప్రయత్నంలో విఫలం కావడం కూడా ఆయనకు ఆందోళన కలిగిస్తున్నది. తాను పరిశోధించడం కంటే పోలీసు అధికారుల సహకారం తీసుకోవాలని, డిజిపి గారిని కలిసి, ఢల్లీి కేసు వివరాలను కూడా చెప్పాలని అనుకున్నాడు.
కుట్రకేసు బట్టబయలు
పోలీసు కంట్రోల్‌ రూం అతి సమీపంలో పట్టపగలు తనపై జరిగిన హత్యా ప్రయత్నం కేసును రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ పెద్దసవాల్‌గా తీసుకొని దర్యాప్తును సాగించాడు. రెండు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతిరోజు తానే స్వయంగా పర్యవేక్షించాడు. ముఖ్యమంత్రి జానకి రామయ్యకు ప్రీతిపాత్రుడు, అధికార పార్టీ శాసనసభ్యునిపైనే హత్యాప్రయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించడంతో దర్యాప్తు ఎంతగా వేగవంతం చేసినప్పటికీ ఆలస్యం జరగడం పోలీసు శాఖకే తలవంపుగా ఆయన భావిస్తున్నాడు. పైగా ఎవరికీ హాని చేయని విజయ్‌ను ఎవరు,ఎందుకు చంపాలనుకున్నారో ప్రారంభం నుంచి డిజిపికి అంతుబట్టలేదు. రాజకీయ కారణాలే కావచ్చని ఆయన ఊహించాడు. పైగా ఆయన అనుకున్నట్లుగానే స్వంత డిపార్టుమెంట్‌ నుంచి సహకారం లభించినందునే నింధితులు పకడ్భందీగా ఈ దాడి చేయగలిగారని వెల్లడైంది. అయితే ఈ విషయాలను నేరుగా విజయ్‌కు ముందుగా చెప్పాలని భావించిన డిజిపి, తానే ఆయనకు కాల్‌ చేసాడు. ఈ రోజు మీకు తీరిక ఉంటే సాయంత్రం ఒకసారి ఆఫీసుకు రావాలని కోరాడు.

తానే డిజిపిని సంప్రదించాలనుకుంటే ఆయన నుంచి పిలుపు రావడంతో వెంటనే అంగీకరించి, సాయంత్రం పోలీసు కార్యాలయానికి వెళ్లాడు. విజయ్‌ను సాధారంగా ఆహ్వానించిన డిజిపి కేసు వివరాలు ఎలా చెప్పాలా అన్నట్లుగా చూస్తున్నాడు. హంతకుల ఆచూకీ ఏమైనా తెలిసిందా సార్‌ అంటూ విజయ్‌ కొంత ఆతురతతోనే ప్రస్తావించాడు.

విజయ్‌ గారు, కేసు పరిశీలిస్తే హంతకులు ఎవరనేది అంత కీలకం కాదనిపిస్తున్నది. డబ్బులిస్తే ఎవరినైనా చంపడానికి కొందరుంటారు ఎక్కడైనా…అసలు ప్రమాదం కుట్రదారుల నుంచే. వారు ఈ హంతకులు కాకపోతే వేరే వారిని కూడా ఎంపిక చేసుకొని పనికి పురమాయిస్తారు. ముందుగా వారిని పట్టుకోవాలి అన్నాడు డిజిపి.

నేను ఎవరికి అన్యాయం చేసినట్లుగా నాకైతే గుర్తులేదు.ఎవరు చేయిస్తున్నారంటారు, కారణాలు ఏముంటాయి…అడిగాడు విజయ్‌.

ఎవరో ప్రయివేట్‌ వ్యక్తులు చేయిస్తే మా శాఖ ఎప్పుడో ఈ కేసును ఛేదించేది విజయ్‌గారు. కంచే చేను మేసినట్లుగా,పోలీసు శాఖలో ఉన్నత స్థానంలో ఉన్న వారే, మీలాంటి ఉత్తమ నేతపై దాడికి నాయకత్వం వహించారంటే మొదట నాకు నమ్మశక్యం
కాలేదు, కానీ మీ కేసులో నమ్మగూడని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

అవునా.. ఎలాంటి నిజాలంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు విజయ్‌.

ముఠాతగాదాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. రాజకీయ నాయాకులకు తమ స్వంత నియోజకవర్గం వారి నుంచే అధిక ప్రమాదం ఉంటుంది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకు నేతల అనుచరులను మట్టిగరిపిస్తారు, వీలుదొరికితే నాయకున్ని కూడా హతమార్చుతారు. మీ నియోజక వర్గంలో ఇలాంటి సంఘటనలుండే అవకాశం లేదు.పోలీసుల దృష్టిలో ఇతర అన్ని నియోజక వర్గాలకంటే మీ స్థానం మరింత ప్రశాతంగా ఉంటుంది. దీంతో మీపై దాడి ఇతర ప్రాంతాల వారిదని, రాజకీయ లక్ష్యం కోసమే హత్యకు ప్లాన్‌ చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగించాం. అదే నిజమని రూఢీ అయింది.

నాకు ఏ రాజకీయ నేతతో కూడా ప్రత్యక్షంగా ఎలాంటి వైరం లేదే. నా మార్గం వేరు. ఎవరితోనూ శతృత్వం పెంచుకునే పనులు నేను చేయను కూదా. ప్రజాధనం కొల్లగొడుతున్న స్వార్థపరుల విషయంలో మాత్రం కఠినంగా ఉంటున్నాను. ఇది కూడా వారి వ్యక్తిగత పనులపై కాదు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలనే నేను పరిగణలోకి తీసుకుంటాను. దీనికి నాపై కక్ష పెంచుకుంటారని అనుకోవడం లేదని విజయ్‌ అభిప్రాయపడ్డాడు.

అవును, ఇలాంటి చర్యలకు శతృత్వం పెరగదు కానీ, మీ ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో పెరుగుతున్న పాపులారిటీనే మీకు శత్రువుగా మారిందని మా దర్యాప్తులో తేలింది. మీ ఎదుగుదల వారికి అడ్డంకిగా మారుతుండటంతో మీ అడ్డు తొలగించుకునేందుకు ఈ ప్రయత్నం చేసినట్లుగా రుజువు అయిందన్నారు డిజిపి.

నా పాపులారిటీ పెరగడం వల్ల మాపార్టీకే అధిక ప్రయోజనం కలుగుతుంది, ఇది మా పార్టీ నేతలకు మేలు జరిగే వ్యవహారమే. ఇక ప్రతిపక్షాలకు చెందిన నేతలకు నేరుగా నష్టం జరిగేది లేదు. వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో పదేళ్లవరకుకూడా మా పార్టీకి ప్రత్యామ్నాయం కాలేరు. ఇది వాస్తవం, మీకు కూడా తెలుసు.

ప్రతిపక్షాల విషయంలో మీరు ఊహిస్తున్నది వందశాతం కరెక్టు. కానీ మీ స్వంత పార్టీ వారి నుంచి వచ్చే ప్రమాదం మీరు అంచనా వేయలేకపోయారు. అదే కొంప ముంచిందని తలపట్టుకున్నాడు డిజిపి.

నివ్వెరపోయాడు విజయ్‌…మా పార్టీల వారి పని ఇదా…ఆందోళనగా ప్రశ్నించాడు విజయ్‌.వెంటనే సమాధానం చెప్పలేదు డిజిపి. మరి కుట్రదారులు ఎవరండీ, మాజీ మంత్రులు, అదే నా వల్ల పదవి పోయిన ఇద్దరు మంత్రుల్లో ఒకరా?….కాదు..పాపం వారిద్దరికీ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. తప్పు చేసినట్లుగా వారికీ తెలుసు.పైగా మరో నాలుగు తరాలకు సరిపోయేటంత సంపాధించారు, అవినీతి అనేది రుజువు కానీ విషయమని, కొద్ది సంవత్సరాలు కేసు కొనసాగుతుందని వారికి తెలుసు. పై స్థాయిలో ఖర్చు పెట్టి మళ్లీ పదవులు పొందవచ్చని వారు భావిస్తున్నారే తప్ప మిమ్ములను హత్య చేయాలనే అంత ఆగ్రహం పెంచుకోలేదు. హత్య కేసులో ఇరుక్కుంటే వచ్చే పరిణామాలు వారికి తెలుసు అంటూ వివరణ ఇచ్చాడు ఉన్నత పోలీసు అధికారి.

అయితే నన్ను చంపాలనేంత కోపం ఎవరికి వచ్చింది,ఎందుకో చెప్పండి, ఎవరు నా శత్రువు అంటూ ఆవేశపడ్డాడు విజయ్‌.

మీరు ఆవేశపడవద్దు. ఆందోళనకు గురికావద్దు. దాడి తర్వాత చావుబతుకల పోరాటంలో విజయుడుగా బయటపడగలిగారు. అన్ని తూటాలు తగిలిన తర్వాత మానవమాత్రులెవరూ తిరిగి ప్రాణాలతో తిరగలేరు. మా పోలీసు చరిత్రలో మీ కేసు ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఛాతిని బుల్లెట్లతో జల్లెడ చేసిన సందర్భంలో ఆ క్షణంలో ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయి. కానీ మీరు ఎలా బతికి బట్టకట్టారో మాకెవరికీ అంతుబట్టడం లేదు. ఏ దేవుడో మిమ్ములను కాపాడుతున్నారు. అంటూ చేతులు ఒక్కదగ్గరికి చేర్చి పైకిచూస్తూ దండం పెట్టాడు డిజిపి.

దీంతో తనపై ఢిల్లీలో జరిగిన హత్యా ప్రయత్నం, లారీ ఢీకొని డ్రైవర్‌ మరణం,కారు దగ్దం వివరాలు డిజిపికి చెప్పి ప్రయోజనం లేదని, నాటి పునర్జన్మ విషయం కూడా ఆయనకు చెప్పి, దర్యాప్తు సాగించమని కోరినా ఇదే ఫలితం ఉండవచ్చని విజయ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో ఆ వివరాలేవీ వెల్లడిరచలేదు. విజయ్‌. ముందుగా ఈ కేసు తేలనీ అనుకుంటూ…

కేసు పూర్వాపరాలపై ఎందుకో మీరు సూటిగా సమాధానం చెప్పడం లేదు. పైగా నింధితులను పట్టుకొని, కుట్రదారులను తెలుసుకొని నేరుగా కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా…ముందుగా నన్ను పిలిచి ఈ వివరాలు ఎందుకు చెబుతున్నారో అర్థంకావడం లేదు. ఎంతటి కఠోర సత్యం అయినా తెలుసుకొని తట్టుకునే స్థాయి నాకుంది. అనుమానించక చెప్పండి అన్నాడు విజయ్‌.

చెబుతాను కానీ మీరు నాకో మాట ఇవ్వండి. మేము కేసు పెట్టి, అరెస్టులు చేసే వరకు ఈ విషయం మీ వద్ద రహస్యంగా ఉండాలి. కనీసం మీ ప్రేయస్సికి లేదా సిఎం సతీమణికూడా చెప్పవద్దు.మీ సహచర శాసనసభ్యులకు కూడా…అంటున్న డిజిపి వైపు మరింత ఆశ్యర్యంగా చూస్తున్నాడు విజయ్‌.

అంత రహస్యం ఏమిటి సార్‌, హంతకులనో లేదా కుట్రదారులనో… పట్టుకున్న మీరు,వారిని విచారిస్తున్నారా…లేక అంటూ సందేహంగా డిజిపిని చూసాడు.

నిజం చెప్పాలంటే వారెవరో అన్నీ తెలిసినా… వారిపై మేం ఇంకా కేసు పెట్టలేదు, కాబట్టి, అరెస్టు కాదు కదా కనీసం కష్టడిలోకి తీసుకోలేదు. విషయ తీవ్రత దృష్ట్యా ముందుగా మీకు చెబుతున్నాను. అయితే మీరు నాకు మాట ఇచ్చినట్లుగా ఎవరికీ చెప్పరు కదా?

ముందటి కాళ్లకు బంధం వేస్తున్న డిజిపిని అదోలా చూసాడు విజయ్‌…మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. కానీ కేసు వివరాలను మేం ముందుగా మీడియాకు చెప్పిన తర్వాతనే వివరాలు బయటకు రావాలి. మీరంతట మీరు ఎవరికీ చెప్పవద్దనేదే మా రిక్వెస్టు.

సరే అంగీకరిస్తున్నాను.చెప్పండి అంటూ తలపంకించాడు విజయ్‌.

 

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-44)

Leave A Reply

Your email address will not be published.