విజయుడు (ధారావాహిక నవల పార్ట్-48)

భూలోకంలో విజయ్ అవసరం తీరిందా…
శేషశయనవాసుడు యోగనిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి మాత్రం విజయ్ ప్రతికదలికను కనిపెడుతున్నది.తనను ఎవరు హత్యచేయించారో కుట్ర విడిపోవడంతోపాటు తన బంధువుల గురించి కూడా తెలుసుకున్న విజయ్ పట్ల ఆమెకు సానుభూతి కలుగుతున్నది.
దేవా… విజయ్ సందేహం తీరింది… ఇక ఆ జీవి అవసరం భూలోకంలో ముగిసినట్లే కనిపిస్తున్నది కదా…ఏమిటి స్వామి మీ తదుపరి ఆదేశం.
మీరు ఆశీర్వదించి ప్రసాదించిన పునర్జన్మ తో తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు జీవి. వైకుంఠంలో మన వద్దకు వచ్చి వెళ్లింది ఆ సందేహ నివృత్తికోసమే కదా.. అయినా స్వామి నింధితులెవరో, కుట్రదారులెవరో తెలిసినా మౌనంగా ఉండిపోతున్న ఆ జీవి, స్థిత ప్రగ్నతను అభినందించకుండా ఉండలేక పోతున్నాను. పైగా వెంటనే కేసుపెట్టకుండా, పోలీసు అధికారితో మాట తీసుకోవడం కూడా గొప్ప విషయమే…మానవ సహజ ఆగ్రహం కూడా రాలేదు. ఎంతో సంయమనం పాటిస్తున్నాడు. అంతా మీ ఆశీర్వాద బలమే అనుకుంటున్నాను. మళ్లీ అంది శ్రీలక్ష్మీ దేవి.
ఏమో స్వామి మీరు ఏదీ చెప్పరు. ఇది గమనించారా…విజయ్ తల్లిదండ్రుల పేర్లు యాదృచ్చికంగా మన పేర్లే. శ్రీహరి, లక్ష్మీదేవి అట. జీవి ఎంత గౌరవంగా తలచుకుంటున్నాడు వారి పేర్లు. ఇప్పుడు మనమే ఆ జీవికి తల్లిదండ్రులం అంటూ దేవదేవుని ముఖంలోకి చూసింది.
చిరునవ్వు నవ్వాడు శ్రీమన్నారాయణుడు.
మరొకటి గమనించారా దేవా…మీ దర్శన భాగ్యం లభించిన తర్వాత విజయ్ జీవన విధానమే మారిపోయింది. భక్తిప్రపత్తులు పెరిగాయి. అప్పటివరకు తన క్వార్టర్స్‌లో పూజగది ఉన్నా అందులో ఏ దేవుని చిత్రపటం కూడా లేదు.
కానీ తిరిగి భూలోకంలోకి వెళ్లగానే ఇక్కడ మీ రూపం ఎలా చూసాడో, అలాంటి చిత్రపటాన్ని తెచ్చుకొని, పూజామందిరంలో పెట్టుకొని రోజూ శుచిగా మీకు పూజలు చేస్తున్నాడు. పూర్తిగా మీ భక్తుడుగా మారిపోయాడు.
నిజమే అన్నట్లుగా తలపంకించాడు శ్రీహరి.
మీ కరుణాకటాక్ష వీక్షణాలు జీవిపై ఉన్నన్ని రోజులు ఎలాంటి ఉపద్రవం వచ్చినా తట్టుకొని భూలోకంలో నిలదొక్కుకొని,నిలబడిపోతాడని, ప్రత్యర్థులు చేసే ఏ కుట్రలు పనిచేయవని మరోసారి రుజువు అయింది దేవా అంటూ చెప్పుకుపోతున్నది లక్ష్మీదేవి.
ప్రజా సేవకు అంకిత భావంతో పనిచేయాలనే తలంపుతో వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నాడు విజయ్ ..ఆ జీవిని చూస్తే అసలు పెళ్లి చేసుకొని సంసార సుఖాలను అనుభవించాలనే తలంపు కూడా ఉన్నట్లుగా అనిపించడం లేదు.
ఏ మహత్కార్యం కోసం తన జీవితాన్ని అంకితం ఇవ్వాలని జీవి తలపోస్తున్నాడో కానీ తనను ప్రాణంగా ప్రేమిస్తూ, తన నీడన బతికేయాలని ఆరాటపడుతూ, ఆశపడుతున్న తన ప్రేయసికి ఎలా న్యాయం చేస్తాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది, సెలవిస్తారా అంటూ ప్రశ్నలపైన ప్రశ్నలు సంధిస్తున్న లక్ష్మీదేవిని గమనిస్తున్నాడు మహా విష్ణువు.
భూలోకంలో ప్రేయసీ,ప్రియుల ప్రవర్తనలకు భిన్నంగా వారు వ్యవహరిస్తున్నారు. వివాహబంధంతో పెనవేసుకు పోవడానికి తొందరపడటం లేదు, కానీ వారి మధ్య ప్రేమానురాగాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఎందుకు దూరదూరంగా ఉండాలనుకుంటున్నారో…
కృష్ణావతారంలో మీరు అష్టమహిళలతోపాటు పదివేల గోపికలపై అనురాగం చూపారు.కానీ రాధపై కురిపించిన ప్రేమ వేరు. అయితే వారు రాధామాధవుల ప్రణయ వృత్తాంతాన్ని మాత్రమే అదర్శంగా తీసుకుంటున్నారేమో…దీనికే కట్టుబడి ఉంటారా? భవిష్యత్తులో అందరిలాగా మూడుముళ్ల బంధంతో కలిసిపోతారా? అనుకుంటున్నది శ్రీదేవి.
ఏమిటీ, దేవీగారికి ఆ జీవి మీద ఇంత ఆసక్తి పుట్టుకొచ్చింది అంటూ చిలిపిగా ప్రశ్నించాడు.
మీరేమిటి స్వామి, నా ప్రశ్నకు మరో ప్రశ్నతోనే సమాధానం చెబుతున్నారంటూ బుంగమూతిపెట్టింది.
స్త్రీ సహజమైన అలక…అనుకుంటూ, ఆ జీవి గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నావని అడిగాడు.
నా ఆరాటమే కానీ…అంతా తెలిసిన మీరు చెప్పరు విధి లిఖితం అనే అవకాశాలు లేవు. రెండుసార్లు ఆ జీవికి ప్రాణదానం చేశారు. భూలోకంలో ఇప్పటివరకు ఏ జీవికి లభించని మహద్భాగ్యం ఆ జీవికి కలిగింది. ఏదో పరమార్థం ఆశించి, మీరు కాపాడుతున్నారనిపిస్తున్నది. అవును కదా సర్వేశ్వరా…
ఆమెకు సమాధానంగా లభించికపోయినా, భూలోకంలో ఆ జీవి ఏవో మహత్కార్యాలు సాధిస్తారనుకుంటుంది. స్వామి ఆశీర్వాద బలం జీవిని ఉన్నత శిఖరాలపై కూర్చోబెడుతుంది. ఇక ఆ జీవికి అన్ని శుభాలే జరుగుతాయని ఆశిస్తున్నది మహాదేవి.
మహాలక్ష్మి దేవికి పలు అనుమానాలున్నా, శ్రీమన్నారాయణుడు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడని కూడా ఆమెకు తెలుసు. విజయ్ ధర్మ మార్గంలో పయనిస్తున్నంత కాలం ఆజీవికి దైవ బలం తోడుగా ఉంటుందని స్వామి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
సంసార ఊభిలో పడితే మానవ సహజ తప్పిదాలు జరుగుతాయని, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సి వస్తుందనే ముందు జాగ్రత్తతోనే ఎలాంటి బంధాలకు తావివ్వకుండా విజయ్ వివాహానికి కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదా?అని స్వామికి మరో ప్రశ్న వేసింది.
మరి విరంచి భవిష్యత్తు ఏమిటి? విజయ్‌ను ప్రాణం కంటే మిన్నగా భావిస్తున్నందున, ఆమె జీవితాంతం కన్యగానే మిగిలిపోవాల్సిందేనా? ఎన్నికలు, పిహెచ్‌డి పూర్తి వంటి అంశాలను ప్రస్తావించి పెళ్లిని వాయిదా వేయించిన విజయ్‌లో తిరిగి మార్పు వస్తుందా?
తన జీవితం కంటే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకే విజయ్ ఎందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు?
ఆ పార్టీ అధిష్ఠాన వర్గం విజయ్‌పైనే మొత్తం భారం పెట్టబోతున్నదా?
ప్రస్తుత ముఖ్యమంత్రి జానకి రామయ్య భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది?
వారసులు లేరని ఎప్పుడు ఆవేధనతో కుమిలిపోతున్న అన్నపూర్ణమ్మ అభీష్టం ఎలా నెరవేరబోతున్నది? అన్ని ప్రశ్నలే, కాలమే వీటికి సమాధానం చెప్పగలదని భావించింది శ్రీమహాలక్ష్మీదేవి.
(సశేషం)