విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-49)

హస్తినలో రాజకీయ మంత్రాంగం

రాష్ట్ర రాజకీయాలు బ్రష్టుపట్టాయని, నాయకత్వ మార్పు అవసరమని భావించిన అధిష్ఠానం విజయ్‌తో చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులపై పూర్తి స్థాయి రిపోర్టు పార్టీ అధినేత వద్ద ఉంది. ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత విజయ్‌ సిఎం బంగ్లాకు వెళ్లి కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవడానికి కారణాలపై వివరణ పరిశీలించిన తర్వాతనే పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై విశ్వాసం కలిగింది. సిఎంకు, విజయ్‌కు మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని, ఎవరి రాజకీయ దారి వారిదేనని, నిరూపించే దృష్టాంతాలు వెల్లడి కావడంతో ఈ సమస్యకు తావు లేకుండా పోయింది.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే వెంటనే నాయకత్వ మార్పు అవసరమని మీటింగ్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ వివరించారు. అవినీతి,అక్రమార్కులతో జానకి రామయ్య మంత్రివర్గం నిండిపోయిందని, ఆ టీం వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు పెరుగుతున్నదని చెప్పారు. అయితే విజయ్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆయనపై ప్రజల్లో అభిమానం అధికంగా ఉందనే విషయాన్ని కూడా ఆయన తెలిపారు.

జానకి రామయ్యను రాజీనామా కోరడం తరుణోపాయమని భావించారు కానీ కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా ఈ మార్పు పార్టీపరంగా ఆత్మహత్యా సదృశ్యమేనని,కొత్త నాయకుడు వస్తే అసంతృప్తి ఇతర సమస్యలు వస్తాయని మరో నేత అభిప్రాయపడ్డారు.

జానకి రామయ్యను కొనసాగిస్తూనే పార్టీ ప్రచార బాధ్యతను విజయ్‌కు అప్పగించడం ప్రయోజనకరంగా ఉంటుందని మీటింగ్‌లో నిర్ణయించారు. ఈ మేరకు విజయ్‌ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని, తనకు సహకరించే వారితో ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కూడా ఆయన ఇవ్వాలనే సూచన వచ్చింది. పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేలా పట్టుదలతో కృషి చేయాలని అధినేత ప్రత్యేకంగా విజయ్‌తో మాట్లాడుతూ చెప్పాడు.

మీటింగ్‌లో అగ్రనేతల ముందు ఏమి మాట్లాడాలో వెంటనే అర్థం కాలేదు విజయ్‌కు. అందరి మాటలను శ్రద్ధగా విన్నాడు. చివరలో ఆయన మాట్లాడేందుకు అవకాశం లభించింది.

రాష్ట్రంలో ప్రచార పర్యటన భాద్యతను తనకు అప్పగించడంపై కృతజ్ఞతలు చెప్పాడు. అయితే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడమం సముచితంగా ఉంటుందని, ఈ మేరకు నిస్వార్థంగా సేవ చేస్తున్న యువకులను గుర్తించడం కూడా అవసరమని, ఈ ప్రక్రియంతా పూర్తి చేయడానికి మీకు అభ్యంతరం లేకపోతే…నేను ఒక టీంను ఏర్పాటు చేస్తానని ప్రతిపాదించాడు విజయ్‌.

తాను ప్రచారం ప్రారంభించే వరకు అభ్యర్థుల పేర్లు ఖరారు అయితే వారిని ప్రజలకు పరిచయం చేయవచ్చన్నారు. ప్రస్తుత శాసనసభ్యులందరినీ మార్చాల్సిన అవసరం ఉండదని, ఇప్పటికే యువ ఎంఎల్‌ఎలు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారని, వారిని కొనసాగించడంతోపాటు కొత్త అభ్యర్థులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ విషయంలో పూర్తిస్వేచ్ఛ నీకు ఉంటుందని అధినేత చెప్పడంతో చర్చలు సంతృప్తిగా సాగాయి. తర్వాత మీడియా సమావేశంలో విజయ్‌ కూడా మాట్లాడారు.

రాజకీయాల కంటే, విజయ్‌పై జరిగిన దాడి, ప్రాణాలతో తిరిగి రావడం పైనే మీడియా ఎక్కువ ప్రశ్నలు సంధించింది. అంతా దైవ కృప అంటూ సంక్షిప్తంగా సమాధానం చెప్పాడు విజయ్‌.

పార్టీలో విజయ్‌కు కీలక బాధ్య‌త‌లు అప్పగించిన వార్త కంటే విజయ్‌ పునర్జన్మ వార్తకే అధిక ప్రాధాన్యతనిచ్చి జాతీయ పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి.

ముందుకు వచ్చిన పాత కేసు

రోడ్డు ప్రమాదం పేరుతో విజయ్‌ను హత్య చేసిన కేసు ఫైల్‌ను చూస్తున్నాడు ఢిల్లీలో ఇన్స్‌పెక్టర్‌ తివారి. ఆ రోజు పత్రికల్లో వచ్చిన ఫోటోలను పరిశీలిస్తున్నాడు.

సందేహం లేదు. తన ఫైల్‌లోని ఫోటో కూడా అదే. చనిపోయిన వ్యక్తి నేడు సజీవంగా ఎలా ఉన్నాడు. మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. బహుశ ఇది కూడా అదేనా..అనుమానం నివృత్తి చేసుకుంటే కానీ నిద్రపట్టదు. ఇన్నాళ్లు ఆ కేసుపై దృష్టి పెట్టకపోవడం తన తప్పు అనుకున్నాడు. వెంటనే ఫైల్‌ తీసుకొని ప్రభుత్వ భవన్‌కు వచ్చి, రెసిడెంట్‌ కమిషనర్‌ను కలిసాడు తివారి.

ఈ సంఘటన జరిగిన సమయంలో విజయ్ ఢిల్లీలో ఉన్నాడా లేదా అనేది నిర్దారించుకునేందుకే తివారి భవన్‌కు వచ్చాడు. ప్రమాదం జరిగిన కొద్ది రోజులకు విజయ్‌ తనను కలిసిన విషయం, టికెట్లు బుక్‌ చేయించిడంతో ఢిల్లీ నుంచి వెళ్లిన విషయం నిజమేనని చెప్పాడు కమిషనర్‌. ప్రభుత్వ భవన్‌లో ఆయన బస చేయలేదని తెలియడంతో ఎక్కడ ఆ కొద్ది రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తివారి.

దుర్ఘటన జరిగిన తర్వాత దీనికి సంబంధించిన కేసులు లేదా ఫిర్యాదులు ఏమైనా వచ్చాయో పోలీసు స్టేషన్‌లో వాకబ్‌ చేసాడు. అయితే కారుతోపాటు డ్రైవర్‌ కూడా మాయమైనట్లు ఊబర్‌ కారు అద్దెకు ఇచ్చే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఉపకరించింది తివారికి. ఏ ఫోన్‌ నంబర్‌ నుంచి కారు బుక్‌ అయిందో కారు ఎక్కడికి వెళ్లిందో వివరాలు కావాలని,ఫిర్యాదు ఇచ్చిన వారిని కోరాడు తివారి. ప్రమాదం జరిగిన తేదీన కారు లాడ్జీకి వెళ్లిందని, దాని అడ్రస్‌తోపాటు ఫోన్‌ నెంబర్‌ను వారి నుంచి లభించింది. వెంటనే లాడ్జీకి వెళ్లి విచారించడంతో విజయ్‌ అక్కడ బసచేసిన విషయం వెల్లడైంది. ఫోన్‌ నంబర్‌ కూడా విజయ్‌ పేరుతోనే ఉంది.

దీంతో చనిపోయిన విజయ్‌, ప్రస్తుతం ఉన్న విజయ్‌ ఒక్కరేనని సిఐ తివారికి అర్థం అయింది కానీ…శవాన్ని తామే తరలించి, ఆస్పత్రిలో మార్చురీలో భద్రపర్చిన తర్వాత మళ్లీ ఎలా…ఎలా…

ఈ విధంగా పత్రికల్లో కనిపిస్తున్నాడో అంతుబట్టలేదు తివారికి. వెంటనే హైదరాబాద్‌కు వచ్చి విచారణ ప్రారంభించాడు. డిజిపి అపాయింట్‌మెంట్‌ తీసుకొని కలిసాడు. ఫైలు చూపించి, విజయ్‌ వివరాలపై చర్చలు జరిపారు. విజయ్‌ హత్మకు గురైన తర్వాత ఆయన ఫోటో గుర్తింపు కోసం పత్రికల్లో వచ్చిన వార్తలతోపాటు తాను అన్ని రాష్ట్రాల పోలీసు కార్యాలయాలకు పంపిన నోట్‌ను కూడా తివారి చూపెట్టారు.

అంతా స్పష్టంగా కనిపిస్తున్నా, డిజిపికి ఏమీ అర్థం కావడం లేదు. ఏమి జరిగి ఉంటుందో ఆయన ఊహించలేకపోతున్నాడు. ఏదో దైవ శక్తి ఆయనను కాపాడి ఉంటుందనుకుంటూ…రెండు రివాల్వర్ల నిండా ఉన్న తూటాలు పేల్చినా బతికి బట్టకట్టాడు విజయ్‌. ఢిల్లీలో అలా జరిగింది, ఇక్కడ ఇలా…ఎలా సాధ్యమో తెలియదు కానీ నిజంగానే విజయ్‌ను ఆ దేవదేవుడే రక్షిస్తున్నారని… విశ్వసించక తప్పలేదు, డిజిపికి.

మానవమాత్రులుగా పోలీసులం మనమేమి చేయలేము, చనిపోయారని మీ దగ్గర ఆధారాలు పక్కాగా ఉన్నాయి, ఇది ఎంత నిజమో మన కళ్ల ముందే విజయ్‌ తిరగాడుతున్న విషయంకూడా అంతే వాస్తవం. మృత్యుంజయుడు ఆయన. నీకు ఒక్కసారి తెలుసు, నాకు మరోసారి తెలిసింది. ఢిల్లీ సంఘటనపై విచారణల పేరుతో కేసును ఇంకా కొనసాగించడంలో అర్థం ఉందని నేను భావించడం లేదు అంటూ తివారి వైపు చూసాడు డిజిపి.

తివారికీ బోధపడిరది. దైవ కృపకు పాత్రుడయ్యాడు విజయ్‌. కేసు పరిశోధనలంటూ నేను పడుతున్నది వృధా ప్రయాసేనని నిర్ణయానికి వచ్చాడు. ఇక వస్తాను సార్‌ అంటూ బయటకు వచ్చాడు. అదే సాయంత్రం ఢిల్లీ విమానం ఎక్కాడు. ఫైల్‌ను క్లోజ్‌ చేయడం కంటే దాన్ని కూడా అగ్నికి ఆహుతి చేయడమే మంచిదనుకున్నాడు తివారి.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-48)

Leave A Reply

Your email address will not be published.