విజయుడు (ధారావాహిక నవల పార్ట్-52)

ముఖ్యమంత్రిగా రికార్డులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ పదవీబాధ్యతలు తీసుకున్న అచిరకాలంలోనే అటు అభివృద్ది, ఇటు సంక్షేమ రంగాల్లో చేపట్టిన అనేక కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. దైవ కృపతో ఆయన తలపెట్టిన ప్రాజెకులన్నీ సకాలంలో పూర్తి అయ్యాయి. యువ మంత్రులు రంజిత్, వివేక్ తదితరులు నిస్వార్థంగా ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మంత్రివర్గంలో 90 శాతం యువకులకే అవకాశం ఇవ్వడంతో వారంతా అంకిత భావంతో పనిచేస్తున్నారు. అవినీతికి ఆమడదూరంలో ఉండటంతో పాలనా యంత్రాంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అయింది. యధారాజ,తథా ప్రజా అన్నట్లుగా మంత్రులు, ముఖ్యమంత్రి నిజాయితీగా వ్యవహరిస్తుండటంతో అధికారులందరిలోనూ అకౌంటబులిటీ పెరిగింది. ఇది నేరుగా రాష్ట్ర ఆదాయంపై కనిపించింది. పన్నుల ఎగవేత లేదు, సకాలంలో ఖజానాకు పన్నులు జమ అవుతున్నాయి. ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరగడంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నది. కనీసం నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి కూడా ప్రతిపక్షాలకు అవకాశం వచ్చే సమస్యలు ఏవీ రావడం లేదు. ఎప్పటికప్పుడు ఎంఎల్‌ఎలతోనూ సంప్రదిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ క్షేత్ర స్థాయిలో ఎవరికీ ఇబ్బందులు లేని పరిస్థితిని తీసుకు వస్తున్నాడు. ఏ ప్రాంతం నుంచి విజ్ఞాపనలు రాకముందే ఇంటలిజెన్స్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతోనూ సమాచారం సేకరించి ఏ కార్యక్రమానికి అంతరాయం జరగకుండా చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మూడురెట్లు పెరిగింది. దీంతో ప్రజల అవసరాలకనుగుణంగా అభివృద్ధి పనుల జోరు పెంచింది ప్రభుత్వం. ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరగడంతో వృద్ధి రేటు జాతీయ సగటుకు మూడు రెట్లు అధికంగా ఉండటంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆశ్యర్యం వ్యక్తం చేసింది. దేశంలోని 29రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం మినహా, మిగిలిన 28 రాష్ట్రాలు ఏ రంగంలోనూ పోటీపడలేకపోతున్నాయి. పారిశ్రామిక రంగానికి అధిక ప్రోత్సాహకాలు అందించడంతో ఇతర రాష్ట్రాలను వదిలి విజయ్ ఆహ్వానం మేరకు అత్యధిక స్థాయిలో పరిశ్రమలు స్థాపించారు. దీంతో నిరుద్యోగ సమస్య తగ్గిపోయింది. మారిన ఈ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి మంత్రుల బృందాలు వచ్చి, విజయ్‌తో సంప్రదించాయి.
అవినీతి రహిత పాలనతోనే ఇవన్ని సాధ్యమని, అంకిత భావంతో పనిచేసే మంత్రివర్గ సహచరులు తనకు లభించారని విజయ్ అందరిని కలుపుకొని పోవడంలో ఉన్నవిజయ రహస్యాన్ని వెల్లడించారు. అయితే దీనికి దీర్ఘకాలిక ప్రణాళికతోపాటు వ్యూహరచనతో పాటు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కూడా అవసరమని, అధికార యంత్రాంగాన్ని భాగస్వాములు చేసుకొని పోతే తప్ప ఇది సాధ్యం కాదని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా వివరించారు. ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్లకు పూర్తి అధికారంతోపాటు బాధ్యతలను అప్పగించామన్నారు.దీంతో వారు తమతమ కిందిస్థాయి అధికారులపై పూర్తి ఆధిపత్యంలో పనులు చేయిస్తున్నారని,అనసవర రాజకీయ జోక్యాన్ని నివారించామన్నారు. పోలీసు యంత్రాంగం పటిష్టంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణతోనే పారిశ్రామిక ప్రగతి దోహదపడుతుందని, రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులుంటాయనే భరోసాతోనే ఇతర దేశాల నుంచి ఔత్సాహికులు వచ్చి పెట్టుబడులు పెడతారని, తమ రాష్ట్ర ప్రగతిని సోదాహరణంగా వివరించాడు విజయ్.
కేంద్ర ప్రణాళికా సంఘం నిపుణులుండే నీతి అయోగ్ నుంచి కూడా ప్రత్యేక బృందం రాష్ట్రం సందర్శించి, జరుగుతున్న అభివృద్ధి పనులకు కితాబు ఇచ్చింది. పన్నులు వసూలు అవుతున్న విధానాన్ని వారు ప్రత్యేకంగా గమనించారు. క్షేత్రస్థాయిలో వారు కొన్ని వ్యాపార సంస్థలను తనిఖీ చేశారు. ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లులు ఇస్తున్నారు. లేనట్లయితే ప్రజలే స్వచ్ఛందంగా బిల్లులను డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల్లోనూ అకౌంటబులిటీ కనిపించడం నీతిఆయోగ్ నిపుణులకు ఆశ్చర్యం వేసింది.ప్రతి ఒక్కరు తమ ప్రభుత్వం, తమ ప్రగతికి కృషి చేస్తున్నదనే విశ్వాసంతో బాధ్యతగా వ్యవహరించడం, వారు ప్రత్యక్షంగా చూశారు. అవినీతి అనేది లేకపోవడంతో ఎసిబి అధికారులకు పనిలేకుండా పోవడంతో ఈ శాఖతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంటు విభాగాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పర్యటన ముగించుకొని వెళ్లిన తర్వాత వారు ఇదే విషయాన్ని ప్రధానికి వివరిస్తూ పూర్తి స్థాయి రిపోర్టును సమర్పించారు. దీంతో ప్రధాని కూడా ఆశ్యర్యపోయారు. ఒక రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి కొనసాగడానికి కారణం ఒకే ఒక్కడు. ముఖ్యమంత్రి విజయ్ ఆలోచనల వల్లనే ఇది సాధ్యం అయిందని ప్రధానికి అవగతమైంది. దీంతో అన్ని కార్యక్రమాలపై ప్రత్యేకంగా పరిశీలన జరిపారు. విజయ్ పరిపాలన ఒక వినూత్నంగా జరుగుతున్నదని ప్రధాని అన్ని పథకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పటికీ…విజయ్ రాష్ట్రంలో జరిగిన ప్రతి కార్యక్రమాలపై వస్తున్న సమాచారాన్ని క్రోఢీకరించి, తనకు సమగ్ర రిపోర్టు ఇవ్వాలని ప్రధాన మంత్రికూడా తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న సమావేశం అది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల కూడా ఉన్న ఈ మీటింగ్ ఎజెండా ప్రత్యేకంగా ఉంది. విజయ్ అవలంభిస్తున్న విధానాలను ఇతర అన్ని రాష్ట్రాలకు విస్తరించడం ఎలా? కేంద్ర స్థాయిలోనూ వీలైన అన్ని శాఖల్లో ఈ విధానాలనే అమలు చేయడానికి మార్గాలు వెతకాలనే అంశాలపై ప్రధాని సమావేశం ఏర్పాటు చేశారు.
తన రాష్ట్రంలో సాధిస్తున్న ప్రగతికి,తాము అవలంభిస్తున్న విధానాలను వివరించాడు విజయ్.
నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారుల ఎంపిక కీలకమని, శాంతిభద్రతలు అదుపులో ఉంటే పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుందని ఇది ఏ రాష్ట్రానికి అయినా, దేశానికి అయినా కీలకమని విజయ్ ప్రస్తావించారు.
ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంటే పన్నుల ద్వారా లభించే ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందన్నారు. వస్తువులు కొనుగోలు చేసిన వారందరూ వ్యాపారుల నుంచి రషీదులు తీసుకుంటారు, పన్ను ఎగవేత దారుల సమాచారం అందిస్తారు. పక్కవాడు తప్పు చేస్తే వెంటనే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎక్కడికక్కడ జవాబుదారితనం పెరుగుతుంది. మా రాష్ట్ర రెవెన్యూ రికార్డు స్థాయిలో పెరగడానికి ఇదే మూలం.
జిల్లాల కలెక్టర్ల పనితీరు కూడా సుపరిపాలనకు దోహదం చేస్తుంది.జిల్లా స్థాయిలో ఏ సమస్య ఉన్నా,కలెక్టర్ ద్వారా అది పరిష్కారం కావాలి.
కలెక్టర్ చురుకుగా పనిచేస్తే ఆయన తర్వాతి అధికారులు గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు జరుగుతాయి. కలెక్టర్స్ తో ముఖ్యమంత్రి నేరుగా సంభాషించాలి.
మీఅందరికీ నేనొక ఉదాహరణ చెబుతాను… సిఎంగా భాద్యతలు స్వీకరించిన తర్వాత నాలుగు నెలలు నేను రోజు రెండు గంటల పాటు తమతమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను నేరుగా కలిసేవాన్ని. వాటిని తగిన చర్యల కోసం, కలెక్టర్లకే పంపించాల్సి వచ్చేది. అయితే కలెక్టర్లు అక్కడికక్కడ ఈ చర్యలు తీసుకుంటే వ్యయప్రయాసాలతో నగరానికి వచ్చి ప్రజలు నన్నుకలవడం ఎందుకు అని ఆలోచించాను. ఇక నుంచి జిల్లాల్లోనే అందరి న్యాయమైన సమస్యలు పరిష్కారమవుతాయని ప్రకటించాను.అవి సాధ్యం కానట్లయితేనే నన్ను కలవాలని,ఈ మేరకు వారు ముందుగా కలెక్టర్ వద్ద ప్రయత్నించినట్లుగా రుజువులు తేవాలని చెప్పాను. ఎక్కడైతే కలెక్టర్లు పనిచేయడం లేదో వారిని బదిలీ చేయడం కంటే వారి సర్వీసు బుక్‌లో రెడ్ మార్కు పెట్టాలని మా ప్రధాన కార్యదర్శి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.
కలెక్టర్లు తమ పేరుకు మచ్ఛ రాకుండా తన కింది అధికారులను సమర్థవంతగా పనిచేయిస్తారని, అదే విధంగా ప్రతి స్థాయిలో అకౌంటబులిటీని పెంచడం వల్లనే తమ రాష్ట్రంలో సత్ఫలితాలు సాధించామని విజయ్ సోధారణంగా వివరించారు.
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు వచ్చిన ముఖ్యమంత్రులు విజయ్‌ను అభినందనలతో ముంచెత్తారు. దేశంలో రోల్‌మోడల్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్న విజయ్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ దేశ వ్యాప్తంగా పార్టీతరపున ప్రచారంలోకి దింపాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నది. ఈ మేరకు ఆయనకు అవసరమైన హంగులు సమకూర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తర్వాతి ప్రధాని విజయ్ అనే విధంగా మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
సశేషం)