విజయుడు (ధారావాహిక నవల పార్ట్-7)

విజయ్ మృత దేహం వద్దకు వచ్చిన దేవదూతలలో ఒకరు, వైకుంఠం నుంచి అమరావతికి ఆ జీవిని తోడ్కొని వెళ్లారు. దేవదేవుని ఆజ్ఞగా తమ నగరికి వచ్చిన విజయ్‌కు అతిధి మర్యాదలలో ఏ లోటు లేకుండా, అపూర్వ స్వాగతమే లభించింది. దేవేంద్రుడు ఆ సమయంలో సభలో ఉన్నారు. అష్ట దిక్పాలురు సహితం వైకుంఠం నుంచి వచ్చిన జీవి గురించి వింతగా చర్చించుకున్నారు. ఒకసారి వైకుంఠంలో శ్రీహరి దర్శన భాగ్యం లభించిన తర్వాత స్వర్గానికి రావడడమేమిటనే గుసగుసలు వినిపించాయి. పెద్దల నిర్ణయం మనెకందుకన్నట్లుగా ఎవరికి వారు సమాధానం చెప్పుకున్నారు. సభ ముగిసిన తర్వాత స్వర్గాధిపతి, తన భటులను పిలిచి స్వర్గంలో ఈ జీవికి ఎలాంటి అంతరాయాలు లేకుండా విహరించేలా చూడాలని, దగ్గరుండి అతిధిని చూసుకోవాలని ఆదేశించారు. సువిశాల స్వర్గంలో ఎక్కడ నుంచి ఎటు వెళ్లాలో తెలియని విజయ్‌కు భటులు దారి చూపుతూ,అక్కడి విశేషాలను వివరించే ప్రయత్నం చేశారు. ముందుగా ఇంద్రభవనాన్ని కళ్లార్పకుండా చూసిన విజయ్‌కు…భూలోకంలో ఉన్న ఆకాశహర్మ్యాలు గుర్తుకు వచ్చాయి. అయితే మన భవనాలకు దేవలోకంలో ఉన్న భవనాలకు ఏ మాత్రం పోలిక లేదని రూఢిచేసుకున్నాడు.
స్వర్గంలో ప్రతి గృహం ప్రత్యేక నగిషీలతో అలంకార ప్రాయంగా,దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఎక్కడ చూసిన నందనవనం తలపించేలా ప్రతి గృహం ముందు పూల తోటలు, వృక్షాలున్నాయి. ఎంతైనా దేవతలు కదా అనుకున్నాడు విజయ్. అప్సరసకన్యకామణుల దివ్యకాంతులు కనువిందు చేస్తుండగా వియ్ వారి అందచందాలకు ముగ్దుడయ్యాడు. ఎటు చూసినా ముగ్ద మనోహర దృశ్యాలే.. వేయి కళ్లుంటే ఎంత బాగుండేదేమో అన్నట్లుగా విజయ్ ప్రతినిమిషాన్ని సద్వినియోగం చేసుకునేలా అమరావతి అంతా కలియతిరిగారు. గంధర్వుల కేళీ విలాసాలు కూడా ఆయన కంటికి గోచరమవుతూనే ఉన్నాయి. వైకుంఠపురం నుంచి వచ్చినందున విజయ్‌కు ఎక్కడికి వెళ్లినా నిరోధించే వారేలేరు. అందుకే శచీ దేవి విహరించే మందిరాలకు తోడు ఉద్యానవనంలోకి కూడా ఈ జీవి యధేచ్చగా వెల్లగలిగాడు. కల్ప వృక్షమైన పారిజాతం నీడలోకి విజయ్ రాగానే కలిగిన అనుభూతితో.. ఆె ఏమీ పరిమళం… అనుకున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే ఈ వృక్ష చ్ఛాయలో నిలబడి ఉన్నప్పటికీ ఆ అనుభూతితో ఉన్నాడే కానీ ఏదైనా..కోరిక కోరుకోవాలనే తలంపు కూడా రాలేదు. అధిక సమయమే విజయ్ అక్కడ ఉండి ఒక్కో వృక్ష సౌందర్యాన్ని ఆస్వాదించాడు. అదే విధంగా కామధేనువును సందర్శించుకున్న సమయంలోనూ ఏ అభీష్టం గుర్తుకు కూడా రాలేదు. దేవేంద్రుని వాహనం అయిన ఐరావతం చూసి శ్వేతచ్ఛాయతో మెరిసిపోతున్న ఆ బలిష్టీయమైన ఏనుగు శరీర సౌష్టవం విజయ్‌కు ఆశ్చర్యం కలిగించింది. భూలోకంలో తాను చూసిన సర్కస్ ఏనుగులు, జూల్లో ఉన్న ఏనుగులకు ఎక్కడా పొంతన లేదనిపించింది.
దేవ లేకం అది.స్వర్గం… దేవేంద్రలోకం అంటే ఇలా ఉంటుందా, సినిమాల్లో వేసిన సెట్టింగ్స్‌ను ఇప్పటివరకు చూసిన విజయ్‌కు ఈ నగర అందాలను పై నుంచి చూస్తూ మైమరిచిపోయాడు. ఎంతటి భాగ్యం లభించింది నాకు. శ్రీమన్నారాయణుడి కరుణతో ఇక్కడకు రాగలిగాను కానీ అన్యులెవరికీ ఇది సాధ్యం కాదు…
అలా చూస్తూ ఉండి పోయాడు కొద్ది సేపు. అమరావతిని ఆశాంతం పరిశీలించి, ఆ తలంపులను నెమరువేసుకుంటూ, ఒక చోట నిలుచున్నాడు విజయ్. ఈలోగా ఆయన ముందు ఇంద్రుని దూత నిలబడి ఉన్నాడు. దేవేంద్రుడు సభ తీరి ఉన్నారు. మిమ్ములను అక్కడికి తోడ్కొని రమ్మని ఆజ్ఞ అంటూ ముందుకు దోవ తీసాడు.
మహేంద్రుని సభ లో అష్ట దిక్పాలకులతోపాటు దేవతల కుల గురువు బృహస్పతి, ఇతర ఆచార్యులు ఆసీనులై ఉన్నారు. సభా మధ్యమునకు విజయ్ రాగానే అక్కడే ఉన్న భటులు ఉచితాసనాన్ని చూపి అలంకరించమని కోరారు. స్వర్గంలో ఇలాంటి అవకాశం తనకు లభించడంపై విజయ్ లోలోన ఉబ్బితబ్బిబైయ్యాడు. చుట్టూ పరిస్థితిని ఒకసారి పరీక్షించాడు. కలలో కూడా ఊహించని సంఘటన ఇది. ఒక్కో దేవత ఒక్కో రూపంలో దర్శన మిచ్చారు. పైగా దేవతలందరూ ఒక చోట ఉండి తనను ఆశీర్వదిస్తున్నారని విజయ్ తలపోశారు. గందర్వ కన్యలు అతిధులకు ఉచిత రీతిన మర్యాదలు చేస్తున్నారు. విజయ్ గౌరవార్థమా అన్నట్లుగా ఇంద్ర సభ కొలువు తీరినట్లుగా ఆయన భావించాడు. ఆవెంటనే చెవులకు ఇంపైన సంగీతం ప్రారంభమైంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ తోపాటు ఎవరెవరో నాట్యకత్తెలు ఈ సంగీతానికి అనుగుణంగా అభినయించారు. వారి అందచందాలు, రూప లావణ్యం, అభినయం విజయ్‌ను కట్టిపడేసింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. సభ ఎప్పుడు ముగిసిందో తెలియనంత మైమరిచి పోయాడు విజయ్.. తర్వాత దేవేంద్రుడు స్వయంగా విజయ్‌ను తన మందిరానికి తోడ్కొని వెళ్లి అమరావతి విశేషాలను ఆయన మఖత: వినేందుకు ఉత్సాహం చూపారు. తాను విన్నవి, కన్నవి ఇంద్రునికి వివరించిన విజయ్, తన ఇతర సందేహాలను ప్రస్తావించేందుకు అనుమతి కోరారు. మా ప్రభు శ్రీహరి నివాసం నుంచి వచ్చిన అతిధి మీరు..నిరభ్యంతరంగా మాట్లాడండి అని దేవేంద్రుడు అనుమతి ఇవ్వడంతో కొంత మొహమాటంగానే విజయ్ సంభాషణలు ప్రారంభించారు.
దేవ లోకంలో ఎందరో అప్సరసలున్నారు. మీ కొలువులో రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అపురూప అందగత్తెలను కూడా నేను చూశాను. పైగా మీ పట్ట మహిషి ఇంద్రాణి దేవతలందరికంటే సుందరీమణి,అపురూప లావణ్యమణిగా విన్నాను.అతిలోక సైందర్యమంతా మీ లోకంలో ఉండగా, ముని భార్య అహల్య లో మీరు ఆశించిన అందాలేమిటో నాకు అంతుబట్టడం లేదు దేవేంద్ర అంటూ పిడుగు పేల్చాడు విజయ్.
(సశేషం)