నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. సిపి రంగనాథ్

వరంగల్ (CLiC2NEWS): నాపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని వరంగల్ సిపి రంగనాథ్ అన్నారు. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సిపి రంగనాథ్ ఖండించారు. పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో దర్శనమిచ్చిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఆరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన బండి సంజయ్, ఆ పార్టీ నేతులు వరంగల్ సిపిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సిపి రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. హిందీ ప్రశ్న పత్రం మాల్ ప్రాక్టీస్ మాత్రమే.. లీకేజి కాదు. పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్ బయటికొస్తే లీకేజి కాదు. కానీ, దానికి ముందు జరిగినదంతా పరిగణనలోకి తీసుకున్నాం. దయచేసి రాజకీయాలు అంటగట్టొద్దన్నారు.
ప్రమాణం చేయమంటున్నారు. మేము ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చాం. ప్రతి కేసులో ప్రమాణం చేయాలంటే.. ఇప్పటి వరకు దాదాపు 10వేల సార్లు చేయాలన్నారు. ఈ కేసులో చేయమంటే చేస్తాం అని సిపి తెలిపారు. బండి సంజయ్ ఫోన్ మా దగ్గర లేదు. నేను ఎలాంటి సెటిల్ మెంట్, దందాలు చేయను. మా ఉద్యోగం ధర్మం మమ్మల్ని చేయనివ్వండి. సత్యం బాబు కేసు విషయంలో తనపై ఆరోపణలు చేశారన్నారు. ఆ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. అయినా ఆ కేసు అధికారి ఆయన కాదన్నారు. అది సంజయ్ తెలుసుకోవాలన్నారు.