మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ
నిండు కుండలా హిమాయత్‌సాగర్ జలాశయం
హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన ఈ జలాశయ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హిమాయత్‌సాగర్‌లోకి మూసీ వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు.
గేట్లు ఎత్తితే వరద నీరంతా మూసీలోకి చేరనుంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లోకి 1,666 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. ప్రస్తుత ఈ జలాశయం నీటిమట్టం 1762.60 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1784.60 అడుగులకు చేరింది.
పరిస్థితి ఇలానే కొనసాగితే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేందకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.