హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మంచినీరు స‌ర‌ఫ‌రాకు 24 గంట‌లు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు. మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్ – 3కి సంబంధించి ఇక్రిశాట్‌ వ‌ద్ద 1200 ఎంఎం డ‌యా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌కు మ‌ర‌మ్మ‌త్తులు జ‌ర‌పాల్సి ఉంది. నీటి లీకేజీలు అరిక‌ట్ట‌డానికి గానూ ఈ ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది.

న‌వంబ‌ర్ 2వ తేదీ ఉద‌యం 6 గంటల నుండి 3 వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌నులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటల వరకు సింగూరు ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నున్న ప్రాంతాలు

జ‌ల‌మండలి డివిజ‌న్ 9, 15, 24 డివిజ‌న్ల ప‌రిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, చందాన‌గ‌ర్‌, పాపిరెడ్డి కాల‌నీ, రాజీవ్ గృహ‌క‌ల్ప‌, న‌ల్ల‌గండ్ల‌, హుడా కాల‌నీ, గోప‌న్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, గుల్‌మ‌హ‌ర్ పార్కు, నెహ్రు న‌గ‌ర్‌, గోపిన‌గ‌ర్‌, దూబే కాల‌నీలకు నీటి స‌ర‌ఫ‌రా ఉండ‌దు. గోపాల్ న‌గ‌ర్‌, మ‌యూరి న‌గ‌ర్‌, మాదాపూర్‌, ఎస్ఎంఆర్‌, గోకుల్ ప్లాట్స్‌, మ‌లేషియా టౌన్‌షిప్, బోర‌బండ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాల్లో లోప్రెష‌ర్‌తో నీటి జ‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది. కావున‌ నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.