న్యాయవాదుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల బార్ అసోసియేషన్ల పిలుపు
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/high-court-bar-association.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు పిలుపునిచ్చారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నేతృత్వంలో హైదరాబాద్లో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 బార్ అసోసియేషన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. రవీందర్ రెడ్డి, DRT బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. కె. దేశ్పాండే తో పాటు జిల్లాల నుంచి హాజరైన పలువురు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు పలు సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ. 5 వేల చొప్పున స్టైఫండ్, పదేళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాల కేటాయింపు వంటి డిమాండ్ల సాధనకు అందరం కలిసి ప్రయత్నిద్దామని తెలిపారు.
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/drt-bar-preisdent.jpg)
సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలి: జికె దేశ్ పాండే
ఈ సమావేశంలో డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. కె. దేశ్ పాండే మాట్లాడుతూ.. ఈ సమావేశానికి హాజరైన సభ్యులు న్యాయవాద సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. అలాగే అసోసియేషన్ కార్యవర్గ పదవీ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉందని, ఈ కారణంగా న్యాయవాద సమస్యలను కార్యవర్గం పరిష్కరించలేకపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలపరిమితిని రెండేళ్లకు పెంచేలా బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. కోర్టు లు విధించే జరిమానాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసిందని, అ డబ్బును బార్ అసోసియేషన్లకు చెల్లించేలా న్యాయాధికారులు ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని అన్నారు.
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/bar-associations.jpg)
అలాగే ఈకార్యక్రమంలో పలువురు అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ… అసోసియేషన్ కార్యవర్గ పదవీకాల పరిమితి పెంచాల్సి ఉందని అభిప్రయాం వ్యక్తం చేశారు. కొన్ని బార్ అసోసియేషన్లు, ముఖ్యంగా మారు మూల జిల్లాల్లాకు చెందినవి ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కంటున్నాయని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. సిఆర్ పిసి 41 ఎ వల్ల సామాన్య ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండటం లేదని, దాని వల్ల న్యాయవాదులు కూడా నష్ట పోతున్నారని, దాని రద్దుకు పోరాటం చేయాల్సి ఉందన్నారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా కొంత మొత్తం ప్రభుత్వం జమచేసేలా చూడాలని విన్నవించారు.
ఈ సమావేశంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు ఉప్పాల శాంతి భూషన్ రావు, జి సంజీవ రెడ్డి జిల్లెల, సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి నవీన్ కుమార్, డి ఆర్ టి బార్ అసోసియేష్ కార్యదర్శి రాఘవులు, పలు జిల్లా లనుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.