అర్హులందరికీ దళిత బంధు అందిస్తాం: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్ (CLiC2NEWS): నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. దళితబంధుపై ఎవ్వరూ చెప్పుడు మాటలు వినవద్దని సూచించారు. ‘దళితబంధు విషయంలో అపోహలు, అనుమానాలు అక్కర్లేదు. రైతుబంధు ప్రారంభించినప్పుడు ఇదే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇలాగే మాట్లాడారు. రైతుబంధును కరోనా కాలంలో కూడా అమలు చేశాం. హుజూరాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే.. నేడు దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. దళిత బంధు ఎన్నికలప్పుడు ప్రారంభించడం లేదు. గత సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ అనే కార్యక్రమాన్నిఈ ఏడాది ప్రారంభిస్తున్నామని చెప్పారు. మార్గదర్శకాలు విడుదలవుతాయని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అప్పుడు ఏ ఎన్నికలు లేవు’ అని మంత్రి అన్నారు.
సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభం కాబోతుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆర్ సభలో 15 మందికి అందిస్తామని.. అనంతరం అందరికి అందజేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను సీఎం ఎంపిక చేశారని ఆయన అన్నారు. భాజపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరుశాతం అందిస్తామన్నారు.
దళిత బంధుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారని హరీశ్ అన్నారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తోందని.. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ ఇప్పించాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేస్తే పాలాభిషేకం చేస్తామని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు.