వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ
హైదరాబాద్ (CLiC2NEWS): సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే.
దాదాపు 7 గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సాప్‌తో పాటు మిగతా సేవలు పునరుద్ధరించబడ్డాయి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. గంటల తరబడి నానా హైరానా పడ్డారు.
సర్వర్లలో సమస్య కారణంగానే ఫేస్‌బుక్ తదితరాల సేవలు ఆగిపోయాయని భావిస్తున్నారు. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను రమారమి 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైమాటే. వీటి సేవలు స్తంభించిపోవడంతో ట్విటర్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఇతర మాధ్యమాలకు తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. 3 అప్లికేషన్లకు ఫేస్‌బుక్ మాతృసంస్థ కావడం, అన్నీ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు కొన్ని గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.