వచ్చే ఎన్నికల్లో నగరి నుండి పోటీ చేస్తా.. సినీనటి వాణి విశ్వనాథ్
నగరి (CLiC2NEWS): చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గంలో తనకు వేలాదిగా అభిమానులు ఉన్నారని, అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీ నటి వాణి విశ్వనాథ్ తెలిపారు. తాను ఏపార్టి నుండి పోటీ చేస్తానో చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టి అనేది ముందుగా ప్రకటిస్తానని తెలిపారు. కాగా ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం తథ్యమని ఆమె స్పష్టం చేశారు.
తన మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక తాను ఎన్నికల బరిలోకి నిలవడానికి సిద్ధపడ్డానని అన్నారు. నలుగురికి సాయం చేసే వ్యక్తికే ఇలా ఇబ్బందులు తలెత్తితే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని అన్నారు. అందుకే నగరి నియోజక వర్గం నుండి పోటీ చేయాలనుకున్నానని పేర్కొన్నారు. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పని చేశారని, నగరి ప్రాంత వాసులు తనకు సపరిచితులని వాణి విశ్వనాథ్ అన్నారు. నగరిలో తమిళ సంస్కృతి సైతం ఉందని అన్నారు. అందుకే నగరి నుండి పోటీ చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమేనన్నారు. అవసరమైతే ఇండిపెండెంట్గా నైనా పోటీ చేస్తానని ఆమె తెలిపారు.