దారుణం.. హ‌య‌త్‌న‌గ‌ర్‌లో మహిళ మృతదేహాన్ని చెద్దరులో చుట్టి..

హైదరాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. క‌ట్టుకున్న బార్య మృత‌దేహాన్ని బాతుల చెరువు అలుగు వ‌ద్ద ప‌డేస్తుండ‌గా స్థానికులు స‌ద‌రు వ్య‌క్తుల‌ను ప‌ట్టుకుని పోలీసులుకు అప్పగించారు.
పోలీసులు క‌థ‌నం మేర‌కు..
హ‌య‌త్‌న‌గ‌ర్ పాత రోడ్డుకు స‌మీపాన హ‌నుమాన్ ఆల‌యం ద‌గ్గ‌ర డేగ శ్రీ‌ను, భార్య ల‌క్ష్మీ (30), కుమార్తె, కుమారుడు నివాసం ఉంటున్నారు. నిన్న (గురువారం) రాత్రి 10.45 గంట‌ల ప్రాంతంలో శ్రీ‌ను అత‌ని స్నేహితుడు కోడూరి వినోద్‌తో క‌లిసి ల‌క్ష్మీ మృత‌దేహాన్ని చెద్దరులో చుట్టి హయత్‌నగర్‌లోని బాతుల చెరువులో పడేస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మహిళ భర్త శ్రీనుతోపాటు వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని, దహణ సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు శ్రీను చెప్పారు. మృతురాలి ఇంటిని సిఐ సురేంద‌ర్ సిబ్బందితో క‌లిసి పరిశీలించారు. అనారోగ్యమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.