జలమండలిలో ఘనంగా మహిళా దినోత్సవం
హైదరాబాద్ (CLiC2NEWS): మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి వుమెన్స్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్(జేడబ్ల్యూఎస్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జలమండలి ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ… చరిత్రను పరిశీలిస్తే మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టే ఏ నాగరికతకు అయనా విలువ దక్కిందని పేర్కొన్నారు. మహిళకు ఇచ్చే విలువను బట్టే ఒక సమాజం, ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పవచ్చని అన్నారు. మన దేశంలో మహిళలకు అనాధిగా ఎంతో గౌరవం ఉందన్నారు. స్త్రీని దేవతగా కొలిచే సంప్రదాయం మనదన్నారు.
మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి స్వంత కాళ్లపై నిలబడాలన్నారు. ఇల్లాలిగా, తల్లిగా తమ పాత్రను పోషించడంతో పాటు దేశాభివృద్ధిలో కూడా భాగం కావాలన్నారు. మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. రాజ్యాంగం కూడా మన దేశంలో మహిళల అభ్యున్నతికి అన్ని అవకాశాలు కల్పించిందని, మహిళలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆడపిల్లలు పుడితే భారంగా భావించొద్దని, మగపిల్లలతో సమానంగా పెంచాలని సూచించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు.

జలమండలి వుమెన్స్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్(జేడబ్ల్యూఎస్‌డబ్ల్యూఏ) అధ్యక్షురాలు టీవీ సరస్వతి, ఉపాధ్యక్షురాలు ఏజే సుగంధిని, డి.శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ప్యూర్ ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ గొల్లమూడి సంధ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఆపరేషన్ డైరెక్టర్ – 2 స్వామి, ఎస్టేట్ ఆఫీసర్ జ్ఞానప్రసూనాంబ, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అసోసియేట్ ప్రసిడెంట్లు రాజ్ రెడ్డి, మహ్మద్ జహంగీర్, జనరల్ సెక్రటరీ జైరాజ్, అపోలో హాస్పిటల్ ప్రతినిధి అనురాగ్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.