జలమండలిలో మహిళా దినోత్సవపు వేడుకలు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సురభి వాణి హజరయ్యారు. జలమండలి ఎండీ దానకిశోర్ తో పాటు జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
భారతీయ కుటుంబ సంస్కృతి గొప్పదని, అందులో మహిళల పాత్ర మరువలేనిదని సురభి వాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. పట్టుదలతో పనిచేయాలన్నారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో స్త్రీలకు వారి కుటుంబ సభ్యులు తోడ్పాటు అందించాలని కోరారు.
ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సృష్టిలో మహిళలు లేకుంటే జీవనం లేదని అన్నారు. వాటర్ బోర్డులో పనిచేసే మహిళా ఉద్యోగులు.. ఇంట్లో ఉండి ఎంత పని చేస్తున్నారో.. ఇక్కడా అంతకంటే ప్రాముఖ్యమైన పని చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగలకు పలు రకాల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. జలమండలి ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏ.జె. సుగంధిని, జనరల్ సెక్రటరీ బిల్కిస్ బాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ నటి కొండపల్లి రూత్ అలేఖ్య, యువ ఫ్యాషన్ డిజైనర్ యామిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ పి. రవి కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్, తెలంగాణ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్, జనరల్ సెక్రటరీ జయరాజ్, టీజీవో నాయకురాలు బండారు రేచల్ లతో పాటు బోర్డు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.