Yaas Cyclone: అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సిఎం జగన్ ఆదేశం

అమరావతి(CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ యాస్ తుపాను ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎపి సిఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఆయ‌న వాతావ‌ర‌ణశాఖ నివేదిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అందుకనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాలని తెలిపారు. విశాఖ‌ప‌ట్నం,విజ‌య‌న‌గ‌రం,‌శ్రీకాకుళం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఈరోజు సిఎం క్యాంప్ కార్య‌ల‌యం నుంచి ‌స‌మీక్ష నిర్వ‌హించారు. సిఎస్ ఆదిత్య‌నాథ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మూడు జిల్లాల ప‌రిస్థితుల‌ను సిఎంకు వివ‌రించారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా తుపాను ప్రభావం కనిపించలేదని సిఎస్‌ తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్‌ రోగులు లేకుండా అన్ని రకాల చర్యలూ తీసుకున్నామన్నారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడ్డ పక్షంలో జనరేటర్లు, డీజిల్‌ సిద్ధంగా ఉంచామని సిఎస్‌ వివరించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి బత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనరు హెచ్‌.అరుణ్‌కుమార్‌ పాల్గన్నారు.

12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం

రానున్న 12 గంట‌లో యాస్ తుఫాను తీవ్రంగా మార‌నున్న‌ట్లు వాతావర‌ణ శాఖ తెలిపింది. దీని వ‌ల‌న రాష్ట్రంలోని ఉత్త‌రాంధ్ర జిల్లాలు,యానాం ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న ‘యాస్‌’ తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు 220 కిలోమీటర్ల దూరంలో.. బాలాసోర్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయదిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందని తెలిపారు. యాస్‌ తుపాను రేపు ఉత్తర ఒడిశా – బెంగాల్‌ సాగర్‌ఐలాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు అధికారులు. తుపాను ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండోనెంబర్‌ ప్రమాద హెచ్చరికలు.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

Leave A Reply

Your email address will not be published.