కుటుంబం చీలిందంటే.. చేజేతులా జగనన్న చేసుకున్నదే: షర్మిల

కాకినాడ (CLiC2NEWS): : రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ ఎపి సిఎం జగన్ చేసిన వాఖ్యలను వైఎస్ షర్మిల స్పందించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎపి కాంగ్రెస్ చీఫ్ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అభివృద్ది లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సిఎం జగనేనని అన్నారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదేనన్నారు. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం. వైఎస్ ఎస్ ఆర్ పార్టి ఇబ్బందుల్లో ఉన్నపుడు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారందరికీ మంత్రులను చేస్తానని మోసం చేసినట్లు తెలిపారు.
పార్టీ కోసం నెలల తరబడి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, సమైక్యాంధ్ర కోసం కూడా పాదయాత్ర చేశానని తెలిపారు. కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంద, వానల్లో రోడ్ల మీదే ఉన్నానని.. ఎపుడు అవసరమొస్తే అపుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపుకు ప్రచారం చేశానన్నారు. సిఎం అయిన రోజు జగన్ మారిపోయారని, తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా ఫర్వాలేదని.. రాజశేఖర్ రెడ్డి పేరు ఆశయాలు నిలబెడితే చాలనుకున్నానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏనాడూ జగనన్న ఉద్యమం చేయలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినదే లేదన్నారు. ఈ రోజు ఎపికి రాజధాని ఉందా.. లేదా..అని ప్రశ్నించారు. వైఎస్ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్‌ను సిఎం చేశారన్నారు. రైతును రాజశేఖర్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారని, ఆయన ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగని.. ఇపుడు దండగగా మారిందన్నారు. ఎంతో మంది ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేస్తే.. జగన్ సిఎం అయ్యారన్నారు.