ఐదుగురు చొరబాటుదారులు హతం
కాల్చి చంపిన బిఎస్‌ఫ్ జవాన్లు

న్యూఢిల్లీ: పొరుగుదేశం నుంచి భారత్ భూబాగంలోకి అక్రమచొరబాటలు కొనసాగుతూనే ఉన్నయి. తాజాగా పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బిఎస్‌ఎఫ్ జవానులు కాల్చి చంపారు. తార్న్ తరన్ జిల్లా ఖేమ్‌కరన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బిఎస్‌ఎఫ్ జవానులు గుర్తించారు. అడ్డుకునే క్రమంలో భారత జవాన్లపై వారు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా చొరబాటు దారులపై కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. సరిహద్దుల వెంట గస్తీ పెంచినట్లు అధికారులు తెలిపారు.