ముగిసిన నాయిని అంత్యక్రియలు

పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్ : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో జూబ్లీహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానంలో ఆయ‌న అంతిమ‌సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ‌యాత్ర‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంత్య‌క్రియ‌ల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా పోలీసులు గౌర‌వ సూచ‌కంగా గాల్లోకి కాల్పులు జ‌రిపారు. శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, మంత్రులు కెటిఆర్‌, ఈట‌ల‌, త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, టిఆర్ ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత కెశ‌వ‌రావు, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ త‌దిత‌రుల‌తో పాటు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

(త‌ప్ప‌క‌చ‌ద‌వండి: నాయిని కన్నుమూత)

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా పని చేసిన నాయిని అంచెలంచెలుగా హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అక్కడ నుంచి 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అటు కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి రాణించి రాష్ట్రంలో తనదైనముద్ర వేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసి కార్మికులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

 

Leave A Reply

Your email address will not be published.