కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు : 38 మంది మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికుల బస్సు సిధి జిల్లా పట్నా వద్ద అదుపు తప్పి వతెనపై నుంచి కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో అందులో ఉన్న 38 మంది ప్రయాణికుల మృతి చెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతయిన వారిలో 7గురిని కాపాడినట్లు ఎస్పీ పంకజ్ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 38 మంది మృతదేహాలను బయటకు వెలికితీశారు. బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో.. మిగతా వారందరూ గల్లంతు అయ్యారు. క్రేన్ సహాయంతో కాలువలో పడి ఉన్న బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బన్‌సాగర్ డ్యాం నుంచి కాలువకు నీటి విడుదలను ఆపేశారు. ప్రమాదానికి గురైన బస్సు సిధి నుంచి సాత్నా వైపు వెళ్తుండగా.. డ్రైవర్ అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఇవాళ హోంమంత్రి అమిత్‌షా మధ్యప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.