కే4 పులికి ఒంట్లో బాగోలేదా..?

మంచిర్యాల (భీమారం‌): గ‌త కొంత కాలంగా మంచిర్యాల తూర్పు మండ‌లాల్లో సంచ‌రిస్తున్న కె4 పెద్ద‌పులి ఆరోగ్యం బాగాలేద‌ని అధికారులు తెలిపారు. దీంతో మరో పులి దానికి ఆహారం అందిస్తోంది. శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. రెండేళ్ల క్రితం ఈ ఏరియాకి వచ్చిన ఆడపులికి వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్ల‌తో పులి శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. పులికి చుట్టుకున్న‌ ఉచ్చుని తొలగించేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలించలేదు. దాంతో పులికి చికిత్స చేయించాలనే ఆలోచనని అటవీశాఖ పక్కకు పెట్టింది. భీమారం సమీపంలోని గుట్టల మధ్య నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్‌ నీటివనరులు పెద్దపులికి అనుకూలంగా మారాయి. ప్రాజెక్ట్‌కు అతి సమీపంలో ఉన్న పులిఒర్రెలో పెద్దపులి నివాసం ఏర్పర్చుకొని అక్కడనుంచి చెన్నూర్‌ మండలం బుద్దారం, కోటపల్లి మండలంలోని అడవుల్లో సంచరిస్తోంది. అయితే సంవత్సరం క్రితం వచ్చిన మగపులి ఆడపులిని అక్కున చేర్చుకుంది. కొన్నాళ్ల పాటు రెండు వేర్వేరుగా తిరిగి వచ్చి ఆవాసానికి చేరుకునేవి. ప్రతిరోజు వేర్వేరుగా ఆహారం వేటాడి తినేవి. కాగా ఆడపులి శరీరం చుట్టూ ఉన్న ఇనుప వైరు కారణంగా అది ఇంతవరకూ గర్భం దాల్చడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆరునెలల నుంచి కే4 ఆడపులి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆహారం కోసం వేట కూడా చేయలేని స్థితికి అది చేరుకుందని అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కాజిపల్లి వద్ద రెండు పశువులను చంపిన మ‌గ‌పులి వెంట ఉన్న ఆడ‌పులి ఒక ఆవుని అప్పగించిందని అధికారులు తెలిపారు. కాజిపల్లి వద్ద రెండు గేదెలను హతమార్చిన పులులు సాయంత్రం గొల్లవాగు ప్రాజక్ట్‌ సమీపంలోని వాగుకి వచ్చాయని చేపల వేటకు వెళ్లిన వారు పేర్కొన్నారు.గ తంలో వేర్వేరుగా సంచరించిన పులులు ఇప్పుడు జతకట్టి తిరుగుతుండటంతో భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఈ స‌మీప గ్రామ‌లకు కూత‌వేటు దూరంలోనే అడ‌వులు ఉన్నాయి. ప్ర‌తిరోజు ప‌శువులు, మేక‌ల మంద‌లు, గొర్ల మందలు, త‌దిత‌ర ప‌నుల కోసం ప్ర‌జ‌లు అడ‌విలోకి వెళ్తూనే ఉంటారు. ఈ జంట పులుల సంచారం గ్రామ‌స్తుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది.

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం..

Leave A Reply

Your email address will not be published.