చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించడం సంతోషదాయకం..
ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకరరావు..

మండపేట (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోని అన్ని జిల్లాలలో కోవిడ్ బారిన పడి ఆక్సిజన్ అందక చనిపోతున్న ప్రజల కష్టాలను చూచి తన సొంత డబ్బులతో ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం పట్ల ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకర రావు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక్క చిరంజీవికే దక్కుతుందని ప్రశంసించారు. చాలామంది కోటీశ్వరులు ఉండవచ్చు. కానీ సాయం చేసే గుణం ఉండాలని అందులో చిరంజీవి కులం మతం పార్టీలు భేదం లేకుండా ఆక్సిజన్ అందక చనిపోకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంను అందరూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా చిరంజీవిని అభినందించాలని అన్నారు. తద్వారా చిరంజీవికి నైతిక మద్దతు పెరిగి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా చిరంజీవి లాంటి వ్యక్తి ఈ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గాని ఈ వార్తలను ప్రచురించక పోవడం దురదృష్టకరమని, ఇదంతా పక్షపాతంతోనే జరుగుతుందని కామన ఆక్షేపించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ సంస్థలు చేపట్టినా, ఏ వ్యక్తులు చేసినా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మీడియా పైన, ప్రభుత్వం పైన, నాయకుల పైన ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాలని కామన హితవు పలికారు.
చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు కోట్లాది మంది ప్రజలు తమ సంతోషాన్ని వెలిబుచ్చుతుంటే స్వార్థ రాజకీయాలతో కొన్ని శక్తులు చిరంజీవి సేవా కార్యక్రమాలను గుర్తించకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. చిరంజీవి కోట్లాది ప్రజల మనసును దోచుకున్న ఏకైక వ్యక్తి అని ప్రశంసించారు. చిరంజీవి సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కామన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు కష్టాల్లో సేవలు చేసే భాగ్యాన్ని చిరంజీవికి భగవంతుడు ప్రసాదించాలని కామన ప్రార్థించారు.