జర్మనీలో కొత్త వైరస్!
బెర్లిన్: ఇప్పడు కరోనాతో ప్రపంచం కకావికలం అవుతోంది. కోవిడ్-19కి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జర్మనీలో కొత్త వైరస్ వెలుగుచూసింది. జర్మనిలో వ్యాపిస్తున్న వైరస్ వల్ల స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది ఒక అడివి పంది మృతదేహంలో కనిపించిందని, పంది మాంసాన్ని ఎగుమతి, దిగుమతి చేసుకునే దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇది జర్మనీలోని బ్రాండెన్బర్గ్ రాష్ట్రంలో ఈ వైరస్ మొదట వెలుగు చూసిందని జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పోలిష్ సరిహద్దు సమీపంలో దొరికిన అడవి పంది మృతదేహంలో గుర్తించినట్లు పేర్కొంది. జర్మనీ జంతు ఆరోగ్య సంస్థలో దీనిపై మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి జూలియా క్లోక్నెర్ వెల్లడించారు.
స్వైన్ ఫీవర్ వైరస్ అనేది ప్రధానంగా అడవి పందుల్లో కనిపిస్తుంది. అనారోగ్య, ఆరోగ్యకరమైన జంతువుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా, అలాగే వైరస్ సోకిన మాంసాన్ని కలిగి ఉన్న చెత్తను తినడం ద్వారా పందులకు వ్యాపిస్తుంది. మృదువైన పేల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, ఇది మనుషులకు ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పోలాండ్లో ఇటీవల ఈ వైరస్ కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి. అక్కడ పందుల్లో దాదాపు 3,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న జర్మనీని స్వైన్ ఫీవర్ వైరస్ వ్యాప్తి కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. కరోనాతో దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు స్వైన్ ఫీవర్తో ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తగులనున్నది. వివిధ దేశాలకు పందులను జర్మనీ ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా చైనాకు పందుల అతిపెద్ద ఎగుమతిదారు జర్మనీనే. ఇప్పుడు స్వైన్ ఫీవర్ కేసు నమోదైనందున ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లనుంది. జర్మనీ పందుల ఎగుమతిని నిషేధిస్తే అమెరికాకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయఫడుతున్నారు. కాగా కరోనాతో అన్ని దేశాలలానే జర్మనీ కూడా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో దాదాపు 3 వేలకుపైగా ఈ కొత్త వైరస్ కేసులు నమోదుకావడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. చూడాలి మరి ఈ వైరస్ ఎటు దారితీస్తుందో!