దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ఈ సారి దీపావళి పండక్కి పెద్దగా టపాసులు మోత ఉండకపోవచ్చు. ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో టపాసులు అమ్మడంతో పాటు కాల్చడంపై కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) నిషేధించింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేగాక, నవంబరులో గతేడాది కంటే గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని తెలపింది.

దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య కాల్చేందుకు అనుమతినిచ్చింది. క్రిస్‌మస్ సహా న్యూ ఇయర్ రోజుల్లో మధ్యాహ్నం 11.55 నుండి 12.30 గంటల మధ్య మాత్రమే బాణా సంచా కాల్చేందుకు అనుమతినిస్తూ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కొవిడ్ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రైబ్యూనల్‌లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిని ట్రిబ్యునల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే టపాసుల విక్రయాలు, కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ఎన్‌జిటి..గత వారం 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రజారోగ్యం పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబర్ 30వరకు టపాసులు నిషేధించాలా వద్దా అని ఎన్‌జిటి ధర్మాసనం గత బుధవారం రాష్ట్రాల స్పందన కోరింది. కోవిడ్-19 వాయు కాలుష్యంపై నిపుణుల అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయని, పెరిగిన వాయు కాలుష్యంతో వైరస్ మరింత నష్టం కలిగించవచ్చన్నని పేర్కొంది. . కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు బాణా సంచా కాల్చడంపై నిషేధం విధించాయి.
