ప్రియనేతకు తుదివీడ్కోలు

న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్‌లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
(ప్రణబ్ చిత్రపటానికి రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు)
పశ్చిమబెంగాల్‌లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది.