మహిళా స్టార్ బాక్సర్ సరితా దేవికి కరోనా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెలబ్రెటీలను వదలడం లేదు. భారత మహిళా స్టార్ బాక్సర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ సరితా దేవికి కరోనా వైరస్ సోకింది. సరితాతో పాటు ఆమె భర్త తోబియా సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. అయితే సరితా దేవి కొడుకు తోమ్‌తిన్‌కి మాత్రం నెగటివ్‌గా వచ్చింది.
కాగా ”నాకు, నా భర్తకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేకున్నా కరోనా సోకింది. ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఇప్పుడు మేమిద్దరం కొవిడ్ కేంద్రానికి వెళ్తున్నాం. వారం రోజులుగా మమ్మల్ని కలిసిన వారందరూ వెంటనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లాలని కోరుతున్నా” అని సరితా దేవి సూచించారు. జాతీయ బాక్సింగ్ శిక్షణ శిబిరం పాటియాలాలో నడుస్తున్నా కరోనా కారణంగా సరితా దేవి తన స్వస్థలమైన ఇంపాల్‌లో ఉంది. మరోవైపు సైక్లిస్ట్ త్రియాషా పాల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.