రైతులకు మద్దతుగా కేజ్రీవాల్ నిరాహారదీక్ష

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర సర్కార్ కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వీరికి మద్దతుగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆప్ పార్టీ సభ్యులు, మద్దతుదారులు కూడా ఈ దీక్షలో పాల్గొనాలని సిఎం కోరారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా నేడు రైతు సంఘాల నేతలు నిరాహారదీక్షలు చేపట్టారు. సోమవారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆప్ పార్టీ మద్దతుదారులు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. తాను కూడా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మన నివాసాల నుండి మనం రైతులకు మద్దతిద్దామని కేజ్రీవాల్ అన్నారు. రైతు దీక్షల్లో ప్రత్యక్షంగా పాల్గనేందుకు సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని తాను అర్థం చేసుకున్నానని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధర కల్పించేలా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.