రైతుల ఉద్యమానికి మద్దతుగా డీఐజీ ఉద్యోగానికి రాజీనామా..

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ స‌ర్కార్ తీసుకొచ్చిన కొత్త‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళ‌న కొన‌సాగుతోంది. వారికి అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్దతు పెరుగుతోంది. తాజాగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. పంజాబ్‌ జైళ్ల శాఖ డీఐజీ అయిన లక్మీందర్ సింగ్ జఖర్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను హోం శాఖ కార్యదర్శికి పంపించారు. రాజీనామా చేసిన విషయాన్ని ఏడీజీపీ (జైలు) పీకే సిన్హా ధ్రువీకరించారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో దేశంలోని రైతులు కలత చెందుతున్నారని, వారికి బాసటగా నిలిచేందుకు డీఐజీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో లక్మీందర్ తెలిపారు. ‘నేను ఒక రైతు కొడుకును, రైతుల ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. అందుకే డీఐజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఢిల్లీ వెళ్లి రైతు సోదరులతో హక్కుల కోసం పోరాడటానికి వీలుగా వెంటనే విధుల నుంచి విడుదల చేయండి’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.