వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు
హైదరాబాద్ : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వానలకు తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాత భవనాలను తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టర్లను, పోలీసు శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి వరకు వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తంచేశారు.
రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎండీ ప్రభాకర్‌రావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన విద్యుత్ సౌధకు చేరుకొని గ్రిడ్ సమస్య తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయచర్యలు చేపట్టాలని, సమాంతరంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
హైదరాబాద్ రామాంతపూర్ చెరువు నిండి రోడ్ల మీదకి నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. చెరువు నిండి సమీప కాలనీల్లోకి నీరు వెళ్తుంది. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్వందులు పడుతున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసినది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగర రోడ్లపైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్ వద్ద సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలి అధికారులను ఆదేశించారు. చదవండి : చూస్తుండగానే వరద నీటిలో వ్యక్తి గల్లంతు!
హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోయిన కార్లు..
#WATCH: A vehicle washes away in Dammaiguda area of Hyderabad following heavy rain in the city. #Telangana (13.11) pic.twitter.com/B6Jvyu665Z
— ANI (@ANI) October 13, 2020
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. మంగళవారం రోజంతా భారీ వర్షం నమోదు కావడంతో.. రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. అయితే రాత్రిపూట పలు ప్రాంతాల్లో కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దమ్మాయిగూడలో ఇండ్ల మధ్య వరద నీరు హోరెత్తించడంతో అక్కడ ఉన్న ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీలో కూడా రెండు వాహనాలు కొట్టుకుపోయాయి.
హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు
- ఘట్కేసర్-32 సెం.మీ, హయత్‌నగర్- 29.8 సెం.మీ వర్షపాతం
- హస్తినాపురం-28.4 సెం.మీ, సరూర్‌నగర్- 27.3 సెం.మీ వర్షపాతం
- అబ్దుల్లాపూర్‌మెట్-26.6 సెం.మీ, కీసర- 26.3 సెం.మీ వర్షపాతం
- ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ, ఓయూ-25.6 సెం.మీ వర్షపాతం
- ఉప్పల్- 25.6 సెం.మీ, మేడిపల్లి-24.2 సెం.మీ వర్షపాతం నమోదు
- కందికల్‌గేట్-23.9 సెం.మీ, రామంతాపూర్ 23.2 సెం.మీ వర్షపాతం
- బేగంపేట్-23.2 సెం.మీ, మల్కాజ్గిరి-22.6 సెం.మీ వర్షపాతం నమోదు
- అల్వాల్ 22.1 సెం.మీ, ఆసిఫ్‌నగర్, సైదాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం
- కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం నమోదు
[…] వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు […]