స్కూళ్లు తెరిచారు.. ఒక్క విద్యార్థి కూడా రాలేదు!
హైదరాబాద్: గత సంవత్సరం (2020) మార్చి నుంచి దేశవ్యాప్తంగా మూత పడిన పాఠశాలలు కొన్ని రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభమైనాయి. జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని మూడు రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచారు. ఇవాళ కేరళ, కర్ణాటక, అసోంలో కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభించారు. ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యాసంస్థలను పునరుద్ధరించారు. అయితే, కొన్ని స్కూళ్లకు మాత్రం ఒక్క విద్యార్థి కూడా రాలేదట. న్యూఇయర్ సెలవు అని భావించి ఉంటారా? లేక కరోనా వైరస్, మరోవైపు కరోనా కొత్త స్ట్రెయిన్ భయంతో పిల్లలను స్కూళ్లకు పంపడానికి విద్యార్థులు వెనకడుగు వేశారా? అనే విషయం తెలియడం లేదు. కానీ విద్యార్థులు లేక స్కూళ్లు బోసిపోయాయి. ఇక, పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు చేసేదేమీ లేక కాలక్షేపంతో రోజంతా గడిపారు. అయితే, అసోం రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఈ రోజు ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదని డిస్‌పూర్‌లోని ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ వెల్లడించారు.