హిందువు ఎవరైనా.. వాళ్లు దేశభక్తులే..

హైదరాబాద్: హిందూ మతానికి చెందినవారు ఎవరైనా.. వాళ్లంతా దేశభక్తులే అని రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశభక్తి గురించి మహాత్మా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఊటంకిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. తన ధర్మం నుంచే దేశభక్తి ఉద్భవిస్తుందని గాంధీ అన్నారు. అయితే శుక్రవారం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ మాట్లాడుతూ.. గాంధీజీని అనుకరించేందుకు సంఘ్ చూస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తుల్ని మరొకరు అనుకరించలేరన్నారు. మేకింగ్ ఆఫ్ ఎ హిందూ ప్యాట్రియాట్.. బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్ అన్న పుస్తకాన్ని భగవత్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని జేకే బజాజ్, ఎండీ శ్రీనివాస్ రాశారు. గాంధీపై రాసిన పరిశోధనాత్మక గ్రంధం ఈ పుస్తకం అని, తనకు మాత్రం ధర్మం, దేశభక్తి ఒకటే అని, ఆధ్యాత్మికత నుంచే మాతృభూమి పట్ల ప్రేమ పుడుతుందన్నారు.