భారత్‌లో 20 `స్ట్రెయిన్` కేసులు!

న్యూఢిల్లీ : కొత్త రకం స్ట్రెయిన్‌ కరోనా కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆరు కేసుల్ని అధికారికంగా గుర్తించగా, మరో 14 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్థారణైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 18, 19 కేసులను గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు పేర్కొన్నాయి. కొత్త వైరస్‌ను నిర్థారించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఏడు ల్యాబ్‌లు ఇప్పటికే ఫలితాన్ని వెల్లడించాయి. బెంగళూరులోని నిమ్హాన్స్‌ ప్రయోగశాలలో ఏడు, హైదరాబాద్‌లోని సిపిఎంబిలో రెండు, పూణెలోని ఎన్‌ఐవిలో ఒకటి, ఢిల్లీలోని ఎన్‌సిడిసిలో ఎనిమిది, ఢిల్లీలోని ఐజిఐబిలో ఒకటి, కళ్యాణిలోని ఎన్‌ఐబిజిలో ఒక కేసు నిర్థారణైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ధ్రువీకరించింది. బాధితులను ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్‌కు పంపినట్లు కేంద్రం తెలిపింది. వీరిని కలిసిన వారిని గుర్తించి, క్వారంటైన్‌కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త వైరస్‌ కేసులు నిర్థారణ కావడంతో ఆయా రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తమయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.