జలమండలిలో ఘనంగా 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS) :జలమండలిలో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ శ్రీ.ఎం.దాన కిషోర్, ఐఏఎస్ గారు బోర్డు అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని అలపించారు. అనంతరం బోర్డు అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో పనిచేస్తున్న సీవరేజి కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై అవగాహన కల్పించడానికి “భద్రతా పక్షోత్సవాలను” రేపటి నుండి ప్రాంరంభిస్తున్నామని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఆగష్టు 16 నుండి 30 వరకు, పక్షం రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమాల్లో కార్మికులకు మురుగునీటి నిర్వహణ లో చేయాల్సిన, చేయకూడని పనులు, పారిశుధ్యం పనులు చేపట్టే సమయంలో అవలంబించాల్సిన పద్దతులతో పాటు పారిశుధ్యం పనుల్లో ఎస్వోపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గైడ్ లైన్స్ అమలు పై, భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మ్యాన్ హోళ్ళను శుద్ధి చేసేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినపుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. జలమండలి పరిధిలోని సెక్షన్, డివిజన్, సబ్ డివిజన్ల వారీగా సీవరేజి కార్మికులందరికి ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, డైరెక్టర్ ఆపరేషన్స్-2 ఎం. స్వామి, టెక్నికల్ డైరెక్టర్ పి. రవి, సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు, జలమండలి వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసి యేషన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తో పాటు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.