Corona: విద్యుత్ బిల్లులు భయం.. ఉద్యోగుల్లో ఆందోళన!
ఎక్కడ ఎవరోన్నారో తెలియని స్థితి.. ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తియ్యడం కష్టమే?

మండపేట (CLiC2NEWS): కరోనా విజృంభిస్తున్న వేళ ఇంటింటికి వెళ్లి విద్యుత్ బిల్లులు తీయాలంటే భయమేస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసున్నారు. ఏ ఇంట్లో కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో తెలియదని ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం ఆందోళన కలిగిస్తోందని బిల్లు రీడర్స్ ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం బిల్లులు తీయలేమంటూ రాష్ట్ర నాయకులు ప్రకటన చేసిన నేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో కూడా వారికి సర్దిచెప్పారు. కరోనా బాధితులు ఉన్న నివాసాలు, రెడ్ జోన్ ఉన్న ప్రాంతాలకు మినహా బిల్లులు తీయడానికి అంగీకరించారు. గతేడాది కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఒక నెల బిల్లు తీయడానికి అవకాశం లేకపోవడంతో వినియోగదారులకు అది భారంగానే మారిందని అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ బిల్లులను రెండు విభాగాలుగా తేదీలను ఖరారు చేసి తీస్తుంటారు. మొదటి బ్యాచ్ నెల తొలివారంలో 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు, రెండో దశలో 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బిల్లులు తీస్తారు. ఆయా తేదీలలో కనుక తీస్తే వినియోగదారులకు స్లాబ్ రేటు ప్రకారమే బిల్లులు వస్తాయి.
గడువు దాటిన తరువాత తీస్తే స్లాబు రేటు దాటిపోయి బిల్లులు మోతతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు. ఇదే పరిస్థితి గత కరోనాలో రావడంతో రెట్టింపు బిల్లును వచ్చి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌కో అధికారులు బిల్లు రీడర్స్ అసోసియేషన్ ఉద్యోగులతో మాట్లాడారు.
ప్రమాదకర పరిస్థి తిలో ప్రతి ఇంటికి వెళ్లి బిల్లు తీసే తమను కరోనా వారియర్స్‌గా ప్రకటించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.