రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం..!
బీజేపీ రాష్ట్ర ప్రధానాధికారి కర్రి చిట్టిబాబు..
ఇసుక పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం..
గృహ నిర్మాణాలకు కేంద్రం సాయం ఇస్తుంటే ప్రస్తావనే లేదు..
మండపేట: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలతో దేశమంతా అభివృద్ధి సాధిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రగతి జాడే లేదని బీజేపీ రాష్ట్ర పదాధికారి కర్రి చిట్టిబాబు విమర్శించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జోనల్ ప్రబారీ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజులతో కలిసి మండపేటలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి తిరోగమన బాట పట్టిందని దుయ్యబట్టారు. అభివృద్ధి మాటే లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ కార్యక్రమాలు కింద చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరుతో రూ 1.80 లక్షలు అందజేస్తుంది అన్నారు. వైఎస్సార్ గృహ నిర్మాణాల్లో మట్టి నింపడానికి ఎన్ఆర్ఈజిఎస్ పథకం నిధులు వాడుకొని కేంద్రం ప్రస్తావన తేకపోవడం దారుణం అన్నారు. జగన్ తన తండ్రి పేరు మీద ఇళ్లు నిర్మించడం తప్పు కాదని అయితే తమ వంతుగా లక్షా ఇరవై వేలు ఇచ్చి మొత్తం మూడు లక్షలతో ఇళ్లు నిర్మిస్తే మంచిది అన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేసి 5 యూనిట్లు లారీ 24 వేలు చేసి కోట్లాది రూపాయలు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. యూనిట్ ఇసుక ధర వెయ్యి నిర్ణయించి అమ్మితే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఆ విధంగానైనా ప్రభుత్వానికి కోట్లు ఆదాయం వచ్చి పడుతుందన్నారు. ఇసుక ధర పెంపు వల్ల కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఇసుక ర్యాంపులు పాటలు నిర్వహిస్తే మంచిదని హితవు చెప్పారు. ఇదిలా ఉంటే రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ రైతులకు అందాల్సిన రాయితీలు ఇవ్వకుండా కూడా మోసం చేశారన్నారు. క్వింటా ధాన్యానికి 1450 రూపాయాలు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి మాట తప్పి మోసగించిందని ఆరోపించారు. ధాన్యం చేతికొచ్చాక 1100 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోవడం ఎంత దారుణమని వ్యాఖ్యానించారు. రైతు ప్రభుత్వం అని చెబుతున్న వైసీపీ రైతులను ఆదుకున్నది గోరంతే అని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన ఎద్దేవ చేశారు.