విషాదం: ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి

అరకు (CLiC2NEWS): ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విషాద ఘటన విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ మండలం సిమిలిగూడకు చెందిన శెట్టి సంజీవ్ గిరిజన సహాకర సంస్థలో ఒప్పంద సెల్స్‌మేన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సురేఖ(34), కుమార్తె సుసన(10), కుమారులు సర్వీన్(8), సిరీల్(4) ఉన్నారు. కుటుంబంతో సహా సంజీవ్ అరకులోయలోని `సి` కాలనీలో నివాసం ఉంటున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరి దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేఖ.. భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తాను కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. మనసుని కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ ఘటనా స్థలానికి పరిస్థితిని సమీక్షించారు.
