కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ సొత్తుగా చెప్పుకోవడం సిగ్గుచేటు..

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ

మండపేట (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు సమకూరుస్తుంటే ఆ నిధులను జ‌గ‌న్ స‌ర్కార్ నవరత్నాలకు వాడుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ మండి పడ్డారు. స్థానిక కామాక్షీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమలాపురం పార్లమెంటరీ జిల్లా బీజేపీ పదాదికారుల ముఖ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యాజీ వేమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులు పాలు చేసారని ద్వజమెత్తారు. పరిమితికి మించి అప్పుసప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.

ఒక పక్క రాష్ట్రానికి సంక్షేమం కోసం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు సమకూరుస్తుంటే ఆ నిధులను నవరత్నాలకు వాడుకోవడం దారుణమని మండి పడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంటే వాటిని జగన్ సొంత పథకాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి పట్టాయన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల శ్రేయస్సుకు విడుదల చేస్తున్న నిధులు అనుకున్న లక్ష్యాలకు ఖర్చు పెట్టకుండా నవరత్నాలకు వెచ్చించడం సమంజసం కాదన్నారు. అమలాపురం పార్లమెంటు జిల్లా పరిధిలోకి వస్తే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారాయన్నారు. వందలాది ప్రయాణికులు గాయాల పాలవుతున్నా, ఆసుపత్రులకు వెళ్లే గర్భిణిలు ఇబ్బందులు పడుతున్నా రోడ్ల మీద దృష్టి సారించకపోవడం పద్దతి కాదన్నారు.

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 11 వేల కోట్లు నిధులు పంపితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 25 శాతం వాటాను ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన 25 శాతం వాటాను తక్షణం చెల్లించి రైల్వే లైన్ నిర్మాణ పనులకు సహకరించాలని కోరారు. బీజేపీ బాధ్యత తీసుకుని జగన్ ప్రభుత్వాన్ని మేల్కొలిపే కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా అధ్యక్షులు అయ్యాజీ వేమ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ ద్వారా నిధులను విడుదల చేస్తే ముఖ్యమంత్రి జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో నాడు నేడు పాఠశాల భవనాలను సమీక్షించి తనవిగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల వల్ల అమలాపురం ఏరియాలో లంక గ్రామాలు కోతకు గురయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్చభారత్ కన్వీనర్‌ పాలూరి సత్యానందం, జిల్లా ప్రధానకార్యదర్శిలు అడబాల సత్యనారాయణ, ఇళ్ల వెంకటేశ్వరరావు, రవీంద్ర, లక్మీకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ, ఆకుల వీరబాబు,విల్ల దొరబాబు, నాళం ఫణిప్రకాష్, వివిధమోర్చాల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.