Mandapeta: ఆకలితో ఉన్న పదిమంది కడుపులు నింపాలన్న సంకల్పం ఎంతో గొప్పది..

మండపేట (CLiC2NEWS): కుటుంబ సభ్యులు పోయిన బాధల్లో ఉండి కూడా ఆకలితో ఉన్న పది మందికి అన్నం పెట్టి వారి కడుపులు నింపాలన్న సంకల్పం ఎంతో గొప్పదని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు కొల్లి విశ్వనాథం అన్నారు. ఇటీవల రెండో వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ సతీమణి మాతృమూర్తి కన్ను మూశారు. బుధవారం స్వర్గస్తురాలైన సతీష్ అత్తయ్య అనంతలక్ష్మి పేరున ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ నిత్యాన్నదాన శిబిరంలో అనాథలకు అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దకర్మ కార్యక్రమం పూర్తయిన అనంతరం సతీష్ కుటుంబ సభ్యులు సేవా సంస్థకు విచ్చేసి అనాథలకు వారి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. ఆదర్శ సంస్థకు సొంత భవనం ఏర్పాటు చేసుకోవడానికి సతీష్ తన వంతు ఆర్థిక సహాయం అందించారు. సంస్ధ వ్యవస్థాపకుడు కొల్లి విశ్వనాథంకు 20 వేల రూపాయలు విరాళంగా అందజేసి సతీష్ తన దాతృత్వాన్ని చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కొల్లి మాట్లాడుతూ సతీష్ ఔదార్యానికి సంస్ధ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉదార స్వభావం కలిగిన సతీష్ గతంలో కూడా సంస్థకు అనేక మార్లు సాయం అందించారని తెలిపారు. ఇటువంటి సేవాగుణం ఉన్న వ్యక్తులు సంస్థకు లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చిట్టూరి నిరేఖ, గొడితి సతీష్, అనూష, వైట్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.