Mandapeta: ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

మండపేట (CLiC2NEWS): ఆకాల వ‌ర్షాల మూలంగా తడిసి పాడై పోయిన ప్రతి ధాన్యపు గింజను స‌ర్కార్ కొనుగోలు చేస్తుందని ఆలమురు వ్యవసాయశాఖ ఏడి సిహెచ్ కెవి చౌదరి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట దాదాపు అన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిందన్నారు. ఈ సందర్భంగా ఏడీ చౌదరి మాట్లాడుతూ రెండు రోజుల తుఫానుకు 1970 హెక్టార్లలో పంట నీట మునిగిందని తెలిపారు. ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం మండలాల్లో 17,757 హెక్టార్లలో వరి పంట వేశారని చెప్పారు. ఈదురు గాలులకు కొంతమేర నేల కొరిగితే మిగిలిన చేలు నీట మునిగినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. ప్రాధమిక అంచనా ప్రకారం సూమారు 100 హెక్టార్లలో కోత దశకు వచ్చిన పంటను కోసి పంట క్షేత్రాల్లోనే విడిచిపెట్టడంతో ఆ పంట కూడా వర్షాలకు చిక్కిందని అన్నారు. రాగల రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల కేంద్రం ద్వారా తెలియవచ్చింది అన్నారు. ఈ విషయంలో రైతులందరూ మేల్కొని ఉండాలని సూచించారు. వరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరి క్షేత్రాల్లో నీరు లేకుండా పంటను కాపాడుకోవాలని వివరించారు. బాటల ఏర్పాటు చేసుకొని వర్షపు నీరు బయటకు పోయే విధంగా చూసుకుంటే కొంతవరకూ మంచిది అన్నారు. అదేవిధంగా నేల కొరిగిన వరి దుబ్బులను పైకి లేపి ఒకదానితో మరొకటి ముడులు వేసుకోవాలని తెలియజేశారు. నీటిలో నానుతున్న వరి మొలకెత్తకుండ  5% ఉప్పునీటి ద్రావణం పిచికారి చేసుకోవాలన్నారు. తడిచిన ధాన్యాన్ని అరబెట్టుకోవాలని సూచించారు.  సబ్ డివిజన్ లో ధాన్యం కొనుగోలు కోసం 60 రైతుభారోసా కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గా గుర్తించమని పేర్కొన్నారు.  రైతులెవ్వరు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. మొత్తం ధాన్యం ప్రభుత్వమే నిర్దేశిత ప్రమాణాలు ప్రకారం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.