Mandapeta: బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..

ఒకరి పరిస్థితి విషమం.. నలుగురికి తీవ్ర గాయాలు..

మండపేట (CLiC2NEWS):  మండపేట ఏడిద రోడ్ లో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభ‌వించింది. జీవనాధారంగా చేసుకున్న వృత్తే ప్రాణాంతకంగా మారింది…తాతల నాటి నుండి చేపట్టిన ఈ వ్యాపారం ప్రాణాలను బలిగొంటున్నా.. వారసత్వంగా వస్తున్న ఈ వ్యాపారాన్ని మొండి ధైర్యంతో మానడం లేదు..నేడు మరోసారి అగ్ని ప్రమాదం జరిగి నలుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండపేట ఏడిద రోడ్ లో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగింది. ఏడిద రోడ్ లో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విస్పోటనం సంభవించింది. ఈ సంఘటనలో కేంద్రం యజమాని అన్నవరపు అయ్యప్పరాజు(25) తో పాటు తల్లి అన్నవరపు ఈశ్వరి(48), అన్నవరపు సతీష్(22) కార్మికురాలు సీతని భవానీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వారు మండపేట ఫైర్ స్టేషన్ కు సమాచారం అందివ్వగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మండపేట సీఐ దుర్గాప్రసాద్ సిబ్బంది విచ్చేసి గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి మండపేట రోడ్డు లోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో బాణాసంచా తయారీ వ్యాపారి దివంగత అన్నవరపు కోటేశ్వరరావు బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహించే వారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు దివంగత అన్నవరపు చంద్రరావు బాణసంచా తయారీ చేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన మూడేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తర్వాత ఆ కేంద్రాన్ని ఆయన కుమారుడు అన్నవరపు విజయ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాణసంచా తయారు చేస్తుండగా చిన్న మంట రేగింది. దీంతో బయట ఉన్న విజయ్ మంటలు ఆర్పే ఉద్దేశ్యం తో లోపలికి వెళ్ళాడు. ఈ లోగా క్షణాల్లో అక్కడ ఉన్న పేలుడు పదార్థాలు అంటుకున్నాయి. ఒక్కసారి గా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో యజమాని అయ్యప్పరాజు(25) తో బాటు ఆయన తల్లి ఈశ్వరి, అతని పెదనాన్న కుమారుడు అన్నవరపు సతీష్ (22), ఇప్పునపాడు కు చెందిన కార్మికురాలు సీతని భవాని (55) లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రధమ చికిత్స అందించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వారి ఆహా కారాలు చూపరులను కంటతడి పెట్టించాయి. తహశీల్దార్ తంగెళ్ల రాజరాజేశ్వరరావు, ఆర్ ఐ కంఠంశెట్టి గౌరి ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. దీనిపై టౌన్ సి ఐ కేసు నమోదు చేశారు.

ఆనందాన్ని పంచె కుటుంబంలో విషాదం : గత కొన్ని దశాబ్దాలుగా మండపేట పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో పేరెన్నికగన్న తీర్థాలు జాతర వివాహాది శుభకార్యాలు ఫంక్షన్లు ఏం జరిగినా మండపేట నుండి బాణసంచా వెళ్ళేది. ఇటువంటి బాణసంచా తయారీలో నిపుణుడు దివంగత అన్నవరపు కోటేశ్వరరావు. గత అర్థ శతాబ్దంగా బాణసంచా తయారు చేస్తూ పేరు పొందారు. బాణసంచా కాల్పులతో అందరికీ ఆనందాన్ని పంచే ఈ కుటుంబంలో విషాదమే మిగిలింది. కోటేశ్వరరావు చిన్న కుమారుడు అన్నవరపు రవి కుమార్ గతంలో జరిగిన బాణసంచా కేంద్రం పేలుడు ఘనటలో మృతి చెందాడు. కొన్నాళ్ళకు కోటేశ్వరరావు పెద్ద కుమారుడు అన్నవరపు చంద్రారావు అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందాడు. ఇక కోటేశ్వరరావు మనువడు అయ్యప్పరాజు బాణసంచా తయారీ కేంద్ర నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవలే తన చెల్లెలికి వివాహం చేసాడు. తల్లితో బాటు ఈ కేంద్రాన్ని నడుపుతూ ఇప్పుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి కళ్ళల్లో ఆనందాన్ని పంచే వీరు త్వరగా కోలుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.