చైనా టూరిస్ట్ వీసాలు ర‌ద్దు చేసిన భార‌త్‌!

ఢిల్లి (CLiC2NEWS): చైనా పౌరుల‌కు జారీ చేసిన టూరిస్ట్ వీసాల‌ను భార‌త్‌ స‌స్పెండ్ చేసింది.  ఈ మేర‌కు భార‌త్ త‌ర‌పున ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ఏప్రిల్ 20వ తేదీన స‌ర్క్యుల‌ర్ విడుద‌ల చేసింది. చైనా పౌరుల‌కు జారీ చేసిన ప‌ర్యాట‌క వీసాల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు 10 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధి క‌లిగిన వీసాలు ఏమాత్రం ఇక చెల్లు బాటు కావ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

క‌రోనా స‌మ‌యంలో 22 వేల‌మంది భార‌త విద్యార్థులు చైనా నుండి స్వదేశానికి వ‌చ్చారు. రెండేళ్లుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వ్వ‌డానికి విద్యార్థులు అభ్య‌ర్థిస్తున్న‌ప్ప‌టికీ చైనా వారిని అనుమ‌తించ‌డం లేదు. ఈ విష‌యంపై ప‌లుమార్లు చైనాను కోరింది. వేలాది మంది విద్యార్థుల‌కు సంబంధించిన విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మార్చి 17వ తేదీన భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చీ బీజింగ్‌ను కోరారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని గ‌తంలో పేర్కొన్నప్ప‌టికీ.. భార‌త విద్యార్థుల విష‌యంలో ఆ దేశం ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలిపారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయిన‌ప్పుడు కూడా దీనిపై చ‌ర్చ జ‌రిగిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు చైనా స్పందించ‌లేదు. దీంతో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.