ఎస్టీపీల నిర్మాణాన్ని సంద‌ర్శించిన జ‌ల‌మండ‌లి ఎండీ

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): జలమండలి నూతనంగా నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్ – 2, 3లో భాగంగా ఫతేనగర్, మియాపూర్ పటేల్ చెరువు, కోకాపేట్ లో నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను మంగళవారం జలమండలి ఎండీ పరిశీలించారు.

నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీపీల నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు గానూ 24 గంటల పాటు పనులు జరపాలని, ఇందుకోసం 3 షిఫ్టుల్లో కార్మికులు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పనులు దశలవారీగా కాకుండా ఏకకాలంలో జరగాలని, ఇందుకు తగ్గట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు.

ఎస్టీపీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూషీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుచేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.