మిత్రుడిని హతమార్చిన నిందితుడికి జీవితఖైదు..
హైదరాబాద్ (CLiC2NEWS): తనకు ఉపాధి కల్పించిన మిత్రుడినే కిరాతకంగా హత్యచేశాడు ఓ నిందితుడు. నిందితుడికి జీవితఖైదు విధించింది కూకట్పల్లి 3వ అదనపు జిల్లా న్యాయస్థానం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. మైల సతీష్ బాబు అమీర్‌పేటలోని ఐటి స్లాట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. అతను కెపిహెచ్‌బికాలనీలో స్లాట్ సొల్యూషన్స్ పేరుతో శిక్షణ, మై సాప్ట్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. తన చిన్న నాటి స్నేహితుడైన హేమంత్ ఉద్యోగం కావాలని 2017లో సతీష్‌ని అడగగా.. అతను ఉద్యోగం ఇచ్చి తన కంపెనీలో భాగస్వామ్యం కూడా ఇచ్చాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో హేమంత్ వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్నాడు. అది తెలుసుకున్న సతీష్‌బాబు ఆమెను పంపించేయాలని 2019 ఆగస్టు 27న హెచ్చరించడంతో.. సతీష్‌బాబుపై పగను పెంచుకుని హేమంత్.. 28వ తేదీన తన ప్లాట్‌కు వచ్చిన అతనిని హత్యచేశాడు. నిందితుడికి జీవితఖైదు, రూ. 10 వేల జరిమానా విధించింది కూకట్పల్లి 3వ అదనపు జిల్లా కోర్టు.అంతే కాకుండా సాక్ష్యాధారాలను మార్చేందుకు ప్రయత్నించినందుకు మూడేళ్లు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.