కార్తీక శోభ..
కార్తీకమాసం అంటేనే తులసి పూజలు, అయ్యప్ప మాలధారణలు, వేకువజామునే చన్నీళ్ల స్నానాలు, ఉపవాస దీక్షలు. ఈ మాసం శివ కేశవులిద్దరికీ ప్రీతికరం. ఇక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎటు చూసిన ఆథ్యాత్మిక భావనతో భక్తులు పరవశించిపోతారు. ఈ మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తారు. మహిళలు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసి, తులసిచెట్టు దగ్గర దీపారాధన చేస్తుంటారు. దేవాలయాలలో దీపాలు వెలిగించడం, వ్రతాలు చేయడం జరుగుతుంటాయి. కార్తీక సోమవారాలు ఉపవాసాలతో 365 వత్తులతో దీపారాధన చేస్తుంటారు. ఇక కార్తీక పౌర్ణమి.. ఆ రోజు దీపం పెట్టని హిందువు ఉండడు.
కార్తీక దీపం కార్తీక మాసంలో ఇంట్లో కాని, ఆలయాలలో కానీ దీపారాధన చేస్తే సకల పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే కోరికలు నెరవేరుతాయని, సౌభాగ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇంకా ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద కూడా దీపారాధన చేస్తారు. కార్తికమాసంలో వనభోజనాలు చేస్తారు. ఇరుగు పొరుగు వారుకానీ, స్నేహితులు కానీ, సహోద్యోగులతో కలిసిమెలిసి ఐక్యతతో వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
కార్తీక మాసంలో పురాణాలు చదవడం, వినడం గాని చేస్తుంటారు. శివపురాణం, కార్తీక పురాణం వంటివి ఈ మాసంలో వినడం, చదవడం, తెలుసుకోవడం వలన మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఒక్కరూ దైవారాధన చేస్తూ ఉండాలని, శుభం జరగాలని కోరుతూ..
-పూర్ణిమ
అడ్వకేట్
[…] మరిన్ని `ఒక్కమాట`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కార్తీక శోభ.. […]