ఒడిశాలో లోయలోపడ్డ బస్సు.. 25 మందికి గాయాలు

భువనేశ్వర్: ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడింది. దీంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుల్‌వాని నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ఇవాళ తెల్లవారుజామున జిల్లాలోని గడియపాడఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.